Begin typing your search above and press return to search.

పార్ల‌మెంట్ లో తొలి సినిమాగా 'గ‌ద‌ర్-2' రికార్డు!

స‌న్నీ డియోల్-అమీషా ప‌టేల్ జంట‌గా న‌టించిన 'గ‌ద‌ర్ -2' ఇటీవ‌ల రిలీజ్ అయి ఎలాంటి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Aug 2023 7:55 AM GMT
పార్ల‌మెంట్ లో తొలి సినిమాగా గ‌ద‌ర్-2 రికార్డు!
X

స‌న్నీ డియోల్-అమీషా ప‌టేల్ జంట‌గా న‌టించిన 'గ‌ద‌ర్ -2' ఇటీవ‌ల రిలీజ్ అయి ఎలాంటి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ జంట త‌మ‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని క‌ట్టిపడేసారు. అనీల్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. 60 కోట్ల డ్జెట్ తో తెర‌కెక్కిన సినిమా 500 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. ఇక సినిమా రిలీజ్ కి ముందు సినిమా ఎలాంటి వివాదాలు ఎదుర్కుందో తెలిసిందే.

సెన్సార్ ద‌గ్గ‌ర నుంచి రిలీజ్ అయిన త‌ర్వాత సినిమాపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. సెన్సార్ క‌ట్స్ వేసినా? కొన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయినా గ‌ద‌ర్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. వివాదాలు..విమ‌ర్శ‌లు అన్నింటిని ధైర్యంగా ఎదుర్కుని మార్కెట్ లో నిల‌బ‌డింది. పంజాబ్ లో జ‌రిగిన కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌లు ఆధారంగా తెర‌కెక్క‌డంతోనే సినిమా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది.

అవే సినిమాకి అవ‌రోధాలు సృష్టించాయి. అయినా ఎక్క‌డా నెర‌వ‌లేదు. విమ‌ర్శ‌ల‌తో ఏమాత్రం సంబంధం లేకుండా బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రంగా నిలిచింది. 'ప‌ఠాన్' త‌ర్వాత భారీ వ‌సూళ్లు సాధించి బాలీవుడ్ కి బూస్టింగ్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా పార్ల‌మెంట్ లోనూ..సినిమా చ‌రిత్ర‌లోనూ ఓ స‌రికొత్త రికార్డు సృష్టించింది. లోక్ స‌భ స‌భ్యుల కోసం కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నంలో ప్ర‌ద‌ర్శించే మొద‌టి సినిమా 'గ‌ద‌ర్ -2' రికార్డు సాధించింది.

శుక్ర‌వారం పార్ల‌మెంట్ లో స్క్రీనింగ్ మొద‌లైంది. మూడు రోజుల పాటు అక్క‌డే ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. మొత్తం ఐదు షోలు ప‌డుతున్నాయి. ఈ మూడు రోజుల పాటు ఎంపీలంతా ఉచితంగా ' గ‌ద‌ర్ -2'ని వీక్షించొచ్చు. జీస్టూడియోస్- అనీల్ శ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ -ఎమ్ ఎమ్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. పార్ల‌మెంట్ లో ప్ర‌త్యేకంగా ప్రోజెక్ట్ చేయ‌డానికి చాలా కార‌ణాలున్నాయి. రాజకీయంగా కొన్ని పార్టీలు ఈ చిత్రాన్ని వ్య‌తిరేకించిన‌ప్ప‌ట‌కీ అధికార పార్టీ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఇలాంటి సినిమాలు పార్ల‌మెంట్ భ‌వ‌నంలో ప్ర‌ద‌ర్శించాల్సిందేన‌ని గ‌ద‌ర్ ని సీన్ లోకి తెచ్చారు.