Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : గామి

By:  Tupaki Desk   |   8 March 2024 7:26 AM GMT
మూవీ రివ్యూ : గామి
X

'గామి' మూవీ రివ్యూ

నటీనటులు: విశ్వక్సేన్-చాందిని చౌదరి-అభినయ-మొహమ్మద్ సమద్-దయానంద్ రెడ్డి-మయాంక్ పరాఖ్-జాన్ కొట్టొలీ-హారిక పెదాడ తదితరులు

సంగీతం: నరేష్ కుమరన్

ఛాయాగ్రహణం: విశ్వనాథ్ రెడ్డి

స్క్రీన్ ప్లే: విద్యాధర్ కగిత-ప్రత్యూష్ వఠ్యం

నిర్మాత: కార్తీక్ సబరీష్

రచన-దర్శకత్వం: విద్యాధర్ కగిత

గామి.. చాలా కాలం నుంచి తెలుగు ప్రేక్షకుల నోళ్లలో నానుతున్న చిత్రం. ఆరేళ్ల ప్రయత్నం తర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విశ్వక్సేన్ హీరోగా కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత రూపొందించిన ఈ చిత్రం స్టన్నింగ్ ప్రోమోలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అంచనాలూ పెంచింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గామి' ఆ అంచనాలను ఏమేర అందుకుందో తెలుసుకుందాం పదండి.

కథ:

శంకర్ (విశ్వక్సేన్) ఒక విచిత్రమైన సమస్యతో బాధ పడుతున్న వ్యక్తి. అతను మరో మనిషిని తాకితే.. తన ఒంట్లో తీవ్రమైన సమస్యలు తలెత్తి చిత్రవధ అనుభవిస్తాడు. యుక్త వయసులో ఒక బాబా తనను అఘోరాలుండే ఓ ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్తాడు. తన గతమేంటో.. తనకీ సమస్య ఎలా వచ్చిందో కూడా శంకర్ కు గుర్తుండదు. శంకర్ సమస్య వల్ల తమకు ఇబ్బందిగా మారడంతో ఆశ్రమం నుంచి అఘోరాలు అతణ్ని వెళ్లగొడతారు. దీంతో తనను ఆ ఆశ్రమానికి చేర్చిన బాబాను వెతుక్కుంటూ కుంభమేళాకు బయల్దేరతాడు శంకర్. అక్కడకిి చేరుకున్నాక తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని మాలిపత్రాల్లో ఉందని తెలుసుకుంటాడు శంకర్. 36 ఏళ్లకోసారి వచ్చే వైద్రతిథి నాడే ఆ మాలిపత్రాలను సేవిస్తే తన సమస్య పరిష్కారమవుతుందని అర్థమవుతుంది. మరి ఎన్నో సవాళ్లతో కూడిన ఆ ప్రాంతానికి శంకర్ చేరుకున్నాడా.. తన సమస్యను తీర్చుకున్నాడా.. ఈ ప్రశ్నలకు సమాధానం తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

ఎప్పుడూ చూసే మూస సినిమాల మధ్య అరుదుగా కొన్ని కొత్త ప్రయత్నాలు జరుగుతుంటాయి. కానీ ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయని.. ప్రేక్షకులను మెప్పిస్తాయని చెప్పలేం. కానీ ఫలితం సంగతి అటుంచి ప్రేక్షకులకు ప్రతి సన్నివేశంలో ఒక కొత్త అనుభూతి పంచాలి.. వాళ్లను ఆశ్చర్యపరచాలి.. ఆలోచింపజేయాలి.. అని ఒక తపనతో సినిమాలు తీసేవాళ్లు అరుదుగా ఉంటారు. 'గామి' ప్రోమోలు చూస్తే ఇది అలాంటి ప్రయత్నం లాగే కనిపించింది. కానీ ప్రోమోల్లో కొన్ని మెరుపులు.. సరికొత్త విజువల్స్ తో వావ్ అనిపించి.. ఆ తర్వాత తెర మీద తుస్సుమనిపించేస్తుంటాయి కొన్ని చిత్రాలు. 'గామి' కూడా ఆ కోవకు చెందుతుందేమో అని ప్రేక్షకులకు సందేహాలు కలిగి ఉంటే ఆశ్చర్యం లేదు. కానీ ఇది అలాంటి సినిమా కాదు. ప్రోమోల్లోనే కాదు.. సినిమాగానూ 'గామి' సరికొత్త అనుభూతిని పంచుతుంది. ప్రేక్షకులకు ఎంతమేర రీచ్ అవుతుంది.. కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్నందుకుంటుంది.. ఇలాంటి విషయాలు పక్కన పెడితే.. తెలుగు సినిమా చరిత్రలో 'గామి'కంటూ ఒక పేజీ మాత్రం ఉంటుంది. ఇప్పటిదాకా తెలుగు తెరపై చెప్పని కథ ఇది. ఎన్నడూ చూడని విజువల్స్ ఇవి. అలాగే మునుపెన్నడూ కలగని అనుభూతిని కూడా పంచుతుంది 'గామి'.

క్రౌడ్ ఫండింగ్ తో సినిమా అంటే ఏదో చిన్న స్థాయిలో.. మామూలు లొకేషన్లలో సింపుల్ గా ఓ సినిమా తీసేయాలని చూస్తుంటారు. కానీ 'గామి' లాంటి విజువల్ వండర్ తీయాలన్న ప్రయత్నమే అతి పెద్ద సాహసం. కానీ ఇలాంటి సినిమాలు తీయడం మొదలుపెట్టాక బడ్జెట్.. ఇతర కష్టాలతో రాజీపడక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. కానీ 'గామి' టీం మాత్రం అడుగడుగునా ఒక అంతర్జాతీయ స్థాయి సినిమా చూస్తున్న భావన కలిగిస్తుంది. హిమాలయాల్లాంటి లొకేషన్లలో తీసిన సీన్లు మాత్రమే కాదు.. ఒక ల్యాబొరేటరీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చూసినా.. అత్యున్నత ప్రమాణాలు కనిపిస్తాయి. విజువల్స్ ఆద్యంతం వావ్ అనిపించేలా సాగుతాయి. ఇక ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వందల కోట్లు పెట్టే సినిమాల స్థాయిలో కనిపిస్తాయి కొన్ని సన్నివేశాలు. నరేషన్ స్లో అన్న మాటే కానీ.. ప్రతి సన్నివేశంలో ఏం జరుగుతుందా.. విజువల్ గా మనం ఏం మిస్సయిపోతామా అనే క్యూరియాసిటీతో 'గామి'ని నడిపించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. కథ పరంగా సస్పెన్సుని చివరిదాకా మెయింటైన్ చేయడంలోనూ దర్శకుడు తన ప్రతిభను చూపించాడు.

'గామి' కథ ఎంతో సంక్లిష్టతతో కూడుకున్నది. ఈ కథేంటి అని మాటల్లో చెప్పడం కూడా కష్టం. ఆ కథను విడమరిచి చెప్పకుండా.. అదే సమయంలో ఆసక్తి పోకుండా.. ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. ప్రేక్షకులను విజువల్ మాయాజాలంతో మెప్పిస్తూ సినిమాను ముందుకు నడిపించాడు విద్యాధర్. హీరో లక్ష్యమేంటో త్వరగా తెలిసిపోతుంది కానీ.. అతడి కథకు సమాంతరంగా చూపించే రెండు వేరే ట్రాక్స్ ప్రేక్షకులను అయోమయానికి గురి చేస్తుంటాయి. అవి రెండూ కూడా ఒక ప్యానిక్ ఫీలింగ్ కలిగిస్తాయి. ముఖ్యంగా ల్యాబొరేటరీలో చిక్కుకుని ఒక ప్రయోగానికి సబ్జెక్టుగా మారిన కుర్రాడికి సంబంధించిన ఎపిసోడ్ ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. ఆ ఎపిసోడ్ కొంచెం డిప్రెసింగ్ గా అనిపించినా.. అసలేం జరుగుతోందో.. ఆ కుర్రాడు అక్కడ్నుంచి ఎలా బయటపడతాడో తెలుసుకోవాలన్న ఆసక్తి దాన్ని ముందుకు నడిపిస్తుంది. దేవదాసి ఎపిసోడ్ మాత్రం ఏమంత ఆసక్తికరంగా అనిపించదు. మిగతా రెండు ట్రాక్స్ విజువల్ గా కూడా ప్రత్యేకంగా ఉంటాయి కానీ.. పల్లెటూరిలో సాగే ఈ ఎపిసోడ్ సాధారణంగా అనిపిస్తుంది. నరేషన్ కూడా నెమ్మదిగా ఉండటం వల్ల ఈ ట్రాక్ బోర్ కొట్టిస్తుంది.

ప్రేక్షకులను ప్రధానంగా ఎంగేజ్ చేసేది హిమాలయాల్లో విశ్వక్ చేసే సాహస యాత్రే. అందులో సాహసాలకు సంబంధించిన విజువల్స్ కట్టిపడేస్తాయి. సవాళ్లను అధిగమించే క్రమంలో కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినప్పటికీ.. ఓవరాల్ గా హిమాలయాల ఎపిసోడ్ అంతా కూడా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ల్యాబొరేటరీలో అసలేం జరుగుతోందనే విషయాన్ని ఇంకొంచెం సరళంగా చెబితే బాగుండేది. ఇది కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. చివర్లో హీరో పాత్రకు సంబంధించిన రహస్యం తెలిసి షాకవుతాం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు దీనికి బాగా ఇంప్రెస్ అవుతారు. ముగింపు సన్నివేశాలు బాగున్నాయి. ఓవరాల్ గా 'గామి' ఒక యునీక్ కాన్సెప్ట్ తో తెరకెక్కి.. ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచుతుంది. కాకపోతే పూర్తి సీరియస్ గా సాగుతూ.. చాలా చోట్ల ప్యానిక్ మోడ్లో సాగే ఈ సినిమా అందరికీ రుచిస్తుందా అన్నదే ప్రశ్న. రొటీన్ సినిమాలతో విసుగెత్తిపోయి కొత్తదనం కోసం చూసే ప్రేక్షకులు మాత్రం దీన్ని అస్సలు మిస్ కాకూడదు.

నటీనటులు:

విశ్వక్సేన్ కెరీర్ ఆరంభంలో తనకు పెద్దగా గుర్తింపు లేనపుడు మొదలుపెట్టిన సినిమా అయినా.. శంకర్ లాంటి ప్రత్యేకమైన పాత్రలో తన ఉనికిని బలంగా చాటుకున్నాడు. ఇప్పుడున్న ఇమేజ్ తన పాత్రకేమీ అడ్డంకి కాలేదు. ముఖం సహా ఒళ్లంతా బట్టలతో కప్పేసి ఉన్న అవతారంలోనే సినిమా అంతా కనిపించడం వల్ల అప్పీయరెన్స్..బాడీ లాంగ్వేజ్ తో ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం పడలేదు. ముఖంలో పాత్రకు అవసరమైన మేర హావభావాలు పలికించగలిగాడు. నటన పరంగా సవాలు విసిరే సన్నివేశాలు లేవు కానీ.. పాత్రకు తగ్గట్లుగా నటించి యాప్ట్ అనిపించాడు. తన కెరీర్లో గామి పాత్ర గుర్తుంచుకునేలా ఉంటుంది. చాందిని చౌదరి.. జాహ్నవి పాత్రలో ఆకట్టుకుంది. క్యారెక్టర్ కొంచెం గందరగోళంగా అనిపించినా.. చాందిని బాగానే చేసింది. తన లుక్ బాగుంది. చిత్రీకరణ పరంగా చాలా సవాలుతో కూడుకున్న సన్నివేశాల్లో చాందిని పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. మహమ్మద్ సమద్.. హారిక పెదాడ ముఖ్య పాత్రల్లో రాణించారు. వాళ్ల పాత్రల పట్ల ప్రేక్షకుల్లో సానుభూతి కలిగేలా నటించారు. అభినయ.. దయానంద రెడ్డి.. మయాంక్ పరాక్ వీళ్లంతా తమ తమ పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక వర్గం:

గామి టెక్నీషియన్స్ ఫిలిం. ప్రతి సాంకేతిక నిపుణుడూ తన ముద్రను చూపించడానికి చాలా కష్టపడ్డారు. నరేష్ కుమరన్ పాటలు కథలో చక్కగా కుదిరాయి. పాటల్ని మించి నేపథ్య సంగీతంతో సినిమాకు పెద్ద బలంగా నిలిచాడు నరేష్. సినిమా మొత్తం ఒక ఇంటెన్సిటీతో నడిచేలా చూడడంలో ఆర్ఆర్ పాత్ర కీలకం. ఇక కెమెరామన్ విశ్వనాథ్ రెడ్డి కష్టాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఒక విజువల్ వండర్ చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి విజువల్స్. బడ్జెట్ పరిమితులు.. సుదీర్ఘ కాలం చిత్రీకరణ వల్ల అక్కడక్కడా కన్సిస్టెన్సీ దెబ్బ తిన్న ఫీలింగ్ కలుగుతుంది కానీ.. ఓవరాల్ గా కెమెరా పనితనం గొప్పగా అనిపిస్తుంది. ఆర్ట్ వర్క్.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఆశ్చర్యపరిచే రీతిలో ఉన్నాయి. క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కిన సినిమాలో ఇలాంటి ప్రొడక్షన్ వాల్యూస్ చూపించడం అసాధారణంగా అనిపిస్తుంది. రైటర్ కమ్ డైరెక్టర్ విద్యాధర్ కగిత రూపంలో తెలుగు తెరకు ఒక ప్రత్యేకమైన దర్శకుడు దొరికాడు. అతడి తపనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ప్రత్యూష్ వఠ్యంతో కలిసి అతను అందించిన స్క్రిప్టు చాలా కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా భిన్నంగా సాగుతుంది. తాను రాసుకున్న కొత్త కథను రాజీ లేకుండా తెరకెక్కించాడు విద్యాధర్. తనకున్న అనేక పరిమితుల్లో ఇలాంటి ఔట్ పుట్ తీసుకురావడం గొప్ప విషయం. కాకపోతే నరేషన్లో ఇంకొంచెం వేగం.. కథాకథనాల్లో ఇంకొన్ని హైస్ ఉండేలా చూసుకోవాల్సింది.

చివరగా: గామి.. తెలుగు సినిమాలో సరికొత్త పేజీ

రేటింగ్- 2.75/5