Begin typing your search above and press return to search.

గామి.. మనకు పొరుగింటి పుల్లకూరే రుచి!

మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఇతర సినిమాలకు సపోర్ట్ చేయటానికి ఎప్పుడూ ముందే ఉంటారు

By:  Tupaki Desk   |   13 March 2024 6:20 PM GMT
గామి.. మనకు పొరుగింటి పుల్లకూరే రుచి!
X

మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఇతర సినిమాలకు సపోర్ట్ చేయటానికి ఎప్పుడూ ముందే ఉంటారు. మంచి కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలను ప్రశంసించడానికి ఏమాత్రం వెనుకాడరు. ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ చేస్తూ తమవంతు ప్రోత్సాహం అందిస్తుంటారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా తమకు నచ్చితే సోషల్ మీడియా వేదికగా అభినందిస్తుంటారు. నచ్చిన అంశాలేంటో చెబుతూ ఆ మూవీని మరింతగా జనాల్లోకి తీసుకెళ్తారు. అయితే రీసెంట్ గా రిలీజైన 'గామి' విషయంలో అలా జరగడం లేదు. ఇప్పటి వరకు స్టార్ హీరోలేవరూ సపోర్ట్ చెయ్యలేదు.

విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కిన అడ్వెంచర్ డ్రామా 'గామి'. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ సినిమా రిలీజైంది. యునిక్ స్టోరీ లైన్ తో, విభిన్నమైన స్క్రీన్‌ ప్లేతో రూపొందిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. విమర్శకులు సైతం టీమ్ కృషిని ప్రశంసిస్తున్నారు. ఇప్పటిదాకా తెలుగు తెరపై చెప్పని కథతో, అద్భుతమైన విజువల్స్ తో వచ్చిన సినిమా ఇదని కొనియాడుతున్నారు. పరిమిత బడ్జెట్ లో ఇలాంటి అవుట్ పుట్ తీసుకురావడం మామూలు విషయం కాదని అభినందిస్తున్నారు. దీనికి స్టార్ హీరోలు కూడా సపోర్ట్ చేస్తారని సినీ అభిమానులు భావించారు కానీ అలా జరగలేదు. అదే సమయంలో 'ప్రేమలు' వంటి డబ్బింగ్ సినిమాని పొగుడుతూ మన టాలీవుడ్ హీరోలు పోస్టులు పెట్టారు.

మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'ప్రేమలు' సినిమాని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశారు. ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ డైరక్టర్ అనిల్ రావిపూడి లాంటి సినీ ప్రముఖులు ఎక్స్ లో పోస్టులు పెట్టారు. రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాదు, సక్సెస్ సెలబ్రేషన్స్ కు హాజరై కుమారుడితో పాటు చిత్ర బృందాన్ని ఆకాశానికి ఎత్తేశారు. అయితే తెలుగు సినిమా 'గామి' గురించి వీరెవరూ పోస్టులు పెట్టకపోవడంపై తెలుగు సినీ అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మన టాలీవుడ్ జనాలకు పొరుగింటి పుల్లకూరే రుచి అని, అందుకే మలయాళ డబ్బింగ్ సినిమాని పొగుడుతున్నారని, తెలుగు మూవీని పట్టించుకోవడం లేదని పలువురు కామెంట్లు పెడుతున్నారు. సినిమాలో ఫ్లస్ లు, మైనస్ లు పక్కన పెడితే.. టాలీవుడ్‌లో ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలను అభినందించాలని మరికొందరు అంటున్నారు. ఒక యంగ్ టీమ్ క్రౌడ్ ఫండింగ్ తో ఆరేళ్లు కష్టపడి తీసినందుకైనా వారిని అప్రిసియేట్ చెయ్యాలని అంటున్నారు. హీరో విశ్వక్ సేన్ సైతం ఒక నలుగురు పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చి ఈ సినిమా చూసి మాట్లాడితే బాగుంటదని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

'గామి ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అందరం కలిసి ఒక కమర్షియల్ సినిమా చెయ్యొచ్చు. కానీ ఛాలెంజింగ్ గా తీసుకొని తెలుగు ఇండస్ట్రీకి కొత్త సినిమా రావాలని 6 సంవత్సరాలు కష్టపడి చేసిన ప్రయత్నం ఇది. మనం సపోర్ట్ చెయ్యకపోయినా పర్వాలేదు కానీ.. ఇలా బాట్స్ తో నెగిటివ్ ప్రచారం చేయకూడదు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియదు. నేను దాన్ని పట్టించుకోలేదు. కొత్త కంటెంట్ తో మంచి సినిమాలను ఆడియెన్స్ కు అందించాడని ప్రయత్నం చేస్తూనే ఉంటాను" అని అన్నారు.

"మా సినిమాని కూడ ఒక నలుగురు పెద్ద మనుషులు వచ్చి చూసి మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా. తెలుగులో ఇంతకముందు ఇలాంటి చిత్రం రాలేదని ప్రౌడ్ గా చెప్తాను. గామి ఇక్కడితో ఆగిపోదు. ఇప్పుడే స్టార్ట్ అయింది.. ఇంకా చాలా దూరం వెళ్తుంది. 10 - 20 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి ఒక సినిమా తెలుగులో వుందని గర్వపడే స్థాయికి వెళ్తుంది. నేను ఓవర్ కాన్ఫిడెంట్ తో చెప్పడం లేదు. సినిమా రిలీజైన నాలుగు రోజుల తర్వాత మాట్లాడుతున్న మాటలివి. ఇదే 'డ్యున్' అయ్యుంటే మనం బట్టలు చింపేసుకొని చూస్తుంటాం" అని విశ్వక్ అన్నారు.

ఇకపోతే 'గామి' ట్రైలర్ చూసిన తర్వాత రాజమౌళి, ప్రభాస్ లాంటి సినీ ప్రముఖులు అభినందించిన సంగతి తెలిసిందే. కన్నడ డైరెక్టర్ రిశబ్ శెట్టి, టాలీవుడ్ దర్శకులు మారుతి, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను లాంటి వారు సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని అప్రిసియేట్ చేశారు.