మెగాస్టార్ కి తొలి డ్యూయెట్ పాడిన ఆనంద్ ...బ్యాడ్ లక్ ఏంటంటే ?
గేదెల ఆనందరావు. శ్రీకాకుళం జిల్లాలో ఉదయించిన గాయకుడు. చిన్న నాటి ఉంచే సంగీతం పట్ల మక్కువ ఉంది
By: Satya P | 17 Feb 2026 8:00 AM ISTగేదెల ఆనందరావు. శ్రీకాకుళం జిల్లాలో ఉదయించిన గాయకుడు. చిన్న నాటి ఉంచే సంగీతం పట్ల మక్కువ ఉంది. కళల పట్ల తపన ఉంది. స్టేజి నాటకాలు కూడా వేసేవారు. ఎన్నో సినీ గీతాలను ఆర్కేస్ట్రాలు చేస్తూ ఆలపించి జనం మెప్పు పొందారు. ఆ సమయంలో రాష్ట్ర స్థాయి పాటల పోటీలో పాల్గొని నాటి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ప్రముఖ సంగీత దర్శకుడు మహదేవన్ చేతుల మీద ప్రథమ బహుమతి అందుకున్నారు. ఆ మీదట సినీ రంగంలో తన గాయక ప్రస్థానం సాగించాలని ఆనంద్ నిర్ణయించుకుని సిక్కోలు నుంచి చెన్నపట్నం రైలెక్కారు.
తొలి మూవీలో కోరస్ :
ఇక ఆనంద్ తొలి మూవీ 1973లో వచ్చిన సూపర్ స్టార్ క్రిష్ణ నటించిన పండంటి కాపురం. అందులో రాజబాబుకు ఆయన గొంతు కలిపారు. ప్రముఖ దర్శకుడు ఎస్పీ కోదండపాణి ఆయనకు అలా అవకాశం ఇచ్చారు అయితే ఆ తర్వాత మాత్రం చాన్సులు రాలేదు, ఇక 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి మూవీలో ఒక వేణువు వినిపించెను పాటతో ఆనంద్ ఖాతాలో ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ పడింది. ఆ మీదట స్వర చక్రవర్తి ప్రోత్సాహంతో అనేక హిట్ సాంగ్స్ ఆలపించారు.
బ్యాడ్ లక్ ఏంటంటే :
జి ఆనంద్ ప్రతిభావంతుడైన గాయకుడు అయినప్పటికీ ఆయనకి దక్కాల్సిన స్థానం అయితే సినీ పరిశ్రమలో దక్కలేదు అని చెప్పాలి. ఆయన పాడిన కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ సినిమాల్లో అయితే కనిపించలేదు, దాంతో రికార్డుల మీద ఆయన పేరు ఉండేది. అవే సినిమాలలో కనిపించి ఉంటే ఆయన సక్సెస్ వేరే విధంగా ఉండేదని అంటారు. అలా చక్రధారి మూవీలో విఠలా విఠలా పాట జి ఆనంద్ ముందు ఆలపిస్తే సినిమాలో వేరే గాయకుని గొంతు ఉంది. అలాగే అక్కినేనికి పాడే సువర్ణ అవకాశం ఆయనకు బంగారు కానుకలో వచ్చింది. అయితే ఆ సాంగ్ ని కూడా సినిమాలో తీసేయడం జరిగింది. ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ పక్కకు పోవడం తో గాయకుడిగా ఆయన అనుకున్న స్థాయికి చేరలేకపోయారు అని అంటారు.
అంతులేని కధలో :
ఇక అంతులేని కధ మూవీలో దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి సాంగ్ కి తొలుత ఆనంద్ చేత పాడించారు. అయితే ఆ తరువాత ఆ పాటను జేసుదాస్ చేత పాడించడంతో మంచి పాట ఆయన ఖాతాలోకి రాకుండా పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు ఉన్నాయి. అయితే ఆనంద్ కేవలం సినీ పాటలను మాత్రమే నమ్ముకోలేదు, తన సొంత ఆర్కెస్ట్రా స్వర మాధురి తో దేశ విదేశాలలో ఎన్నో కచేరీలు నిర్వహించి తనతో పాటు ఎంతో మంది వర్ధమాన గాయనీ గాయకులకు ఆశ్రయం ఇస్తూ మంచి పేరు సంపాదించారు. యాభై ఏళ్ల పాటు దాన్ని దిగ్విజయంగా ఆయన నడిపించడం కూడా గొప్ప విశేషం. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకు సినిమా పాటల కంటే కచేరీల ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చిందని చెప్పారు.
ఆ లోటు అలాగే :
ఇక ఆనంద్ 1970 దశకంలో ఇండస్ట్రీలో ప్రవేశించినా అగ్ర హీరోలుగా నాడు వెలుగొందుతున్న ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ శోభన్, క్రిష్ణంరాజులకు పాటలు పాడే చాన్స్ మాత్రం అందుకోలేకపోయారు. అయితే ఆయన పాటలు ఆయన గొంతు ఎక్కువగా మురళీ మోహన్ కి సరిపోయేది, దాంతో ఆయనకు మాత్రం పాడిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
చిరంజీవి తొలి డ్యూయెట్ :
మెగాస్టార్ చిరంజీవి తొలి మూవీగా వచ్చిన ప్రాణం ఖరీదు సినిమాకు ఆనంద్ ఆలపించిన డ్యూయెట్ సూపర్ హిట్ అయింది. ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా అంటూ ఆయన గాయని ఎస్పీ శైలజతో కలిపి ఆలపించిన ఈ పాట చిరంజీవి సినీ జీవితంలో ఎంతో ముఖ్యమైనది. మెగాస్టార్ కూడా ఆ పాటను గతంలో గుర్తు చేసుకున్నారు కూడా. అలా ఆనంద్ సినీ జీవితంలో మెగాస్టార్ తో గాయక బంధం మాత్రం పెనవేసుకుంది. 1944 ఫిబ్రవరి 16న అంటే ఇదే రోజున పుట్టిన ఆనంద్ 2021లో కరోనా రెండవ దశలో ఆక్సిజన్ సకాలంలో అందక కన్నుమూశారు.
