'ఫంకీ' మూవీ రివ్యూ
గత ఏడాది లైలా మూవీతో పెద్ద షాక్ తిన్నాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. అతను జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కేవీ డైరెక్షన్లో నటించిన చిత్రం.. ఫంకీ. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
By: Tupaki Desk | 13 Feb 2026 12:47 PM IST'ఫంకీ' మూవీ రివ్యూ
నటీనటులు: విశ్వక్సేన్ - కాయదు లోహర్ - నరేష్ - సంపత్ - ఈశ్వరి రావు - జయకృష్ణ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య
రచన - దర్శకత్వం: అనుదీప్ కేవీ
గత ఏడాది లైలా మూవీతో పెద్ద షాక్ తిన్నాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. అతను జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కేవీ డైరెక్షన్లో నటించిన చిత్రం.. ఫంకీ. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
కోమల్ (విశ్వక్సేన్) ఒక వర్ధమాన దర్శకుడు. అతను ఒక సీనియర్ నిర్మాతను ఒప్పించి ఫంకీ అనే సినిమా మొదలు పెడతాడు. కానీ చెప్పిన బడ్జెట్ ను దాటిపోవడంతో సినిమా మధ్యలో ఆగిపోతుంది. నిర్మాత కూతురు చిత్ర (కాయదు)ను ఒప్పించి మళ్లీ సినిమాను పట్టలెక్కిస్తాడు కోమల్. ఈ క్రమంలో కోమల్.. చిత్ర ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే కోమల్ కు ఎమోషన్లు లేవని అతడితో జీవితాన్ని పంచుకోవడానికి సందేహిస్తుంది చిత్ర. ఇంకోవైపు సినిమాకు అనుకోని అడ్డంకులు తలెత్తుతాయి. మరి ఆ సినిమా పూర్తయిందా లేదా.. కోమల్- చిత్ర కలిశారా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
'అరవింద సమేత'లో ''వినే టైం, చెప్పే మనిషిని బట్టి విషయం విలువ మారిపోతుంది'' అని ఒక డైలాగ్ ఉంటుంది. సినిమాల్లో కామెడీ పండడం కూడా అంతే. సందర్భం.. ఆర్టిస్టులు.. టైమింగ్ ను బట్టి ఉంటుంది. అనుదీప్ కేవీకి మంచి పేరు తెచ్చిపెట్టిన 'జాతిరత్నాలు' సినిమాలో దాదాపు ప్రతి సన్నివేశం నవ్విస్తుంది. అందులో సిల్లీగా అనిపించే సీన్లు- డైలాగులు కూడా కూడా పేలాయి. కానీ 'ప్రిన్స్' సినిమాలో అదే స్టయిల్లో నవ్వించడానికి ప్రయత్నిస్తే.. చాలా చోట్ల ప్రేక్షకులకు చిరాకొచ్చింది. అక్కడ అనుదీప్ శైలి కామెడీలో తమిళ ఆర్టిస్టులు ఇమడలేకపోయారు. ఐతే అనుదీప్ ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమా తీశాడు. కానీ కామెడీ స్టైల్ మాత్రం మార్చలేదు. 'జాతిరత్నాలు' ఫార్మాటే ఫాలో అయిపోయాడు. కానీ 'ప్రిన్స్'లో సమస్యే ఇక్కడా కనిపిస్తుంది. విశ్వక్సేన్ మంచి ఆర్టిస్టే అయినా.. అనుదీప్ స్టయిల్ కామెడీ అతడికి సూట్ కాలేదు. సరైన కామెడీ సిచువేషన్లూ కుదరలేదు. అక్కడక్కడా కొన్ని వన్ లైనర్స్ పేలినా.. ఓవరాల్ గా నవ్వుల డోస్ సరిపోలేదు. కామెడీ వర్కవుట్ కాకపోవడంతో చాలా సీన్లు సిల్లీగా అనిపించి.. 'ఫంకీ' సాదాసీదా సినిమాగా తయారైంది.
కామెడీ పండడానికి ముందు సిచువేషన్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఒక టోన్ సిద్ధం చేసి.. దానికి అనుగుణంగా ప్రేక్షకులను ఒక మూడ్ లోకి తీసుకెళ్తే.. 'క్రింజ్' అనిపించే కామెడీని కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ టోన్.. మూడ్ సెట్ కానపుడు.. తెరపైన చూపించేదంతా వెకిలిగా.. వెటకారంగా అనిపించి డిస్కనెక్ట్ అయిపోతాం. 'ఫంకీ'లో అదే జరిగింది. 'జాతిరత్నాలు'లో మాదిరే ఇందులోనూ తన మార్కు జోకులతోనే సినిమాను లాగించే ప్రయత్నం చేశాడు అనుదీప్. కానీ అక్కడ నవ్వులు పంచిన జోకులే.. ఇక్కడ వర్కవుట్ కాలేదంటే సందర్భం కుదరకపోవడం.. టోన్ సెట్ కాకపోవడమే కారణం. ''నువ్వు టెన్త్ క్లాసులో ఫస్ట్ క్లాసా'' అని హీరోయిన్ అడిగితే.. ''లేదు ఫస్ట్ క్లాసే'' అంటాడు హీరో. 'జాతిరత్నాలు' సినిమాలో ఇదే డైలాగ్ ఉంటే.. ఆ సినిమా ఫ్లోకి.. నవీన్ టైమింగుకి ప్రేక్షకులు పగలబడి నవ్వేవాళ్లేమో. కానీ 'ఫంకీ'లో మాత్రం ఇదే జోక్ సిల్లీగా అనిపించిందంటే.. సందర్భమే కాదు విశ్వక్ టైమింగ్ కూడా కుదరలేదని అర్థం. తన సినిమాలను మించి బయట ఇంటర్వ్యూల్లో టిపికల్ టైమింగుతో నవ్విస్తుంటాడు అనుదీప్. తన సినిమాల్లో హీరో పాత్ర కూడా దాదాపుగా తనదే. కానీ అనుదీప్ శైలి.. టైమింగ్ నవీన్ లాగా అందరికీ సూట్ కాదన్నది స్పష్టం. 'ప్రిన్స్'లో శివకార్తికేయన్.. 'ఫంకీ'లో విశ్వక్ విషయంలో అదే జరిగింది.
'ఫంకీ' సినిమాలో కథ అని.. ఎమోషన్లు అని.. ఏదో ఊహించుకుని.. ఎక్కువ అంచనాలు పెట్టుకుని రావొద్దని ప్రేక్షకులను ప్రిపేర్ చేేసే ప్రయత్నం చేశాడు నిర్మాత నాగవంశీ. ఐతే అనుదీప్ సినిమాలకు ఎవ్వరూ అలాంటి ఆలోచనలతో రారు. కొందరికి సిల్లీగా అనిపించినా సరే.. తన నాన్ సింక్ జోకులను ఇష్టపడేవారు చాలామందే ఉన్నారు. ఐతే అలాంటి వాళ్లను కూడా నిరాశపరిచాడు అనుదీప్. 'ప్రిన్స్' ఏదో మిస్ ఫైర్ అయిందనుకున్నారు కానీ.. 'ఫంకీ'లో కూడా తన రైటింగ్ మరీ వీక్ అనిపిస్తుంది. 'జాతిరత్నాలు' దగ్గరే అతను ఆగిపోయాడా.. అంతకుమించి ఇంకేం రాయలేడా తీయలేడా అనిపించేలా 'ఫంకీ' సాగుతుంది. ప్రతి పాత్రా ఇంకో పాత్రతో నాన్ సింక్ లో మాట్లాడ్డం.. ఒకరిని మించి ఒకరు డంబ్ అనిపించేలా ప్రవర్తించడం.. ఒకరి మీద ఒకరు పంచులు వేయడం.. అలాగే తమ మీద తామూ పంచులు వేసుకోవడం.. సినిమా అంతా ఇలాగే ఉంటుంది. మొదట్లో కొన్ని పంచులు బాగున్నా.. తర్వాత కూడా అదే స్టయిల్లో పంచులు పడుతుంటే.. మొనాటనస్ ఫీలింగ్ కలుగుతుంది. కామెడీ వర్కవుట్ అయితే.. కథ.. కథనం.. క్యారెక్టరైజేషన్లు అంటూ ఏమీ పట్టించుకోం. కానీ ఇక్కడ పెద్దగా నవ్వులు పండకపోవడంతో.. ఇంత సిల్లీ కథతో సినిమా తీశారేంటి.. అసలేం చెప్పదలుచుకున్నారీ మూవీతో.. హీరో క్యారెక్టర్ని అలా తయారు చేశారేంటి.. అంటూ రకరకాల సందేహాలు రేకెత్తుతాయి. చాల ా లైట్ అన్నట్లు కనిపించే వ్యక్తులకు కూడా లోపల ఎమోషన్లు ఉంటాయని.. కానీ బయటపడరని చెప్పడం ఈ సినిమా ఉద్దేశం. కానీ దాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆఖర్లో చిన్న సెంటిమెంట్ డ్రామా ట్రై చేశారు అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఒక డైరెక్టర్ సినిమా తీయడానికి పడే పాట్ల మీద నడిచే చిత్రమిది. కానీ అతను సినిమా తీసే విధానం అదీ చాలా సిల్లీగా అనిపిస్తుంది. చివరికేమో ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయినట్లు చూపిస్తారు. తెర మీద తీయబడే సినిమాను చూస్తూ కలిగిన ఫీలింగే 'ఫంకీ' మూవీని చూస్తున్నపుడు కూడా కలుగుతుంది. ఫలితం గురించి మాట్లాడ్డం అనవసరం.
నటీనటులు:
విశ్వక్సేన్ మంచి పెర్ఫామరే కానీ.. అనుదీప్ కేవీ శైలి అతడికి సరిపడలేదు. అతను సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినా... అక్కడక్కడా కొంత నవ్వించగలిగినా.. కోమల్ పాత్రలో పూర్తి స్థాయిలో కుదురుకోలేకపోయాడు. తనకు నప్పని చొక్కాను తొడుక్కున్నట్లు అనిపిస్తుంది. కాయదు లోహర్ అందంగా ఉంది. హుషారుగా నటించింది. తన వరకు ఆమె ఆకట్టుకుంది. ఈ చిత్రానికి హైలైట్ ఆమే అని చెప్పొచ్చు. నరేష్ ప్రతిభను అనుదీప్ అంతగా ఉపయోగించుకోలేదు. ఆయన పాత్ర.. నటన సోసోగా అనిపిస్తాయి. సంపత్ కూడా అంతే. 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ జయకృష్ణ పర్వాలేదనిపించాడు. అసిస్టెంట్ డైరెక్టర్లుగా నటించిన ఆర్టిస్టులు బాగా చేశారు. ఈశ్వరీ రావు ఓకే.
సాంకేతిక వర్గం:
భీమ్స్ సిసిరోలియో సంగీతం ఓ మోస్తరుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే తొలి పాట వినసొంపుగా ఉంది. అది 'బలగం'లోని 'పొట్టి పిల్లా' పాటను గుర్తుకు తెస్తుంది. మిగతా పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. భీమ్స్ నేపథ్య సంగీతం బాగానే సాగింది. సురేష్ సారంగం ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ.. తన శైలిని మార్చాల్సిన అవసరాన్ని 'ఫంకీ' గుర్తు చేస్తుంది. ఒక జోక్ మొదలైనపుడే.. అదెలా ముగుస్తుందో ప్రేక్షకుడు అంచనా వేస్తున్నాడంటే తన కామెడీ ఒకే శైలిలో నడుస్తోందని.. రిపిటీటివ్ అవుతోందని అర్థం. చాలా త్వరగా తన కామెడీకి ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసిందా అనిపిస్తుంది 'ఫంకీ' చూస్తుంటే. విడివిడిగా కొన్ని జోకులు బాగున్నా.. సినిమాను ఒక ఫ్లోలో నడిపించడంలో అనుదీప్ ఫెయిలయ్యాడు.
చివరగా: ఫంకీ.. పంచులు పేలలేదు
రేటింగ్ - 2.25/5
