నేడే విడుదల : క్రేజీ హీరోల సినిమాల సందడి లేదేం..?
కొన్నాళ్ల క్రితం వరకు శుక్రవారం వస్తుంది అంటే థియేటర్ల వద్ద జాతర వాతావరణం కనిపించేది. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతి సినిమా కు మంచి స్పందన ఉండేది.
By: Tupaki Desk | 7 Jun 2025 1:00 AM ISTకొన్నాళ్ల క్రితం వరకు శుక్రవారం వస్తుంది అంటే థియేటర్ల వద్ద జాతర వాతావరణం కనిపించేది. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతి సినిమా కు మంచి స్పందన ఉండేది. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకు కూడా మొదటి రోజు థియేటర్ల వద్ద ఒక మోస్తరు జనాలు మాత్రమే కనిపిస్తున్నారు. ఇక చిన్న హీరోల సినిమాలు మొదటి రోజు షో లు పడటమే కష్టంగా ఉంది. సినిమాకు హిట్ టాక్ వస్తే అప్పుడు కాస్త జనాలు కూడుతున్నారు తప్ప... కొత్త హీరోల సినిమాలకు మొదటి రోజే హౌస్ ఫుల్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తెలుగు మార్కెట్‌లోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఇదే పరిస్థితి ఉన్న విషయం తెల్సిందే. క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు వచ్చినా పరిస్థితి అలాగే ఉంది.
ఈ వారం ప్రేక్షకుల ముందుకు చాలా సినిమాలే వచ్చాయి. అందులో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రోజు ముందే వచ్చిన థగ్ లైఫ్ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. నాయగన్ సినిమా స్థాయిలో ఉంటుందని ప్రచారం చేసిన మేకర్స్ అందులో కనీసం 10 శాతంను కూడా చూపించలేక పోయారు అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ అభిమానులు సైతం మణిరత్నం ఫిల్మ్ మేకింగ్ విషయంలో పెదవి విరుస్తున్నారు. మణిరత్నం తన స్థాయిని తానే తగ్గించుకునే విధంగా ఇలాంటి సినిమాలను ఎందుకు తీస్తున్నాడు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
ఇక నేడు శుక్రవారం సైతం పలు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ప్రధానంగా గ్యాంబ్లర్స్ ఒకటి కాగా మరోటి శ్రీశ్రీశ్రీ రాజావారు. ఈ రెండు సినిమాల్లో హీరోలు ఈ మధ్య కాలంలో మంచి విజయాలు దక్కించుకున్న హీరోలు అయినప్పటికీ ఈ సినిమాలకు మినిమం బజ్ క్రియేట్ కాలేదు. మ్యాడ్ సినిమాలో హీరోగా నటించి మెప్పించిన నితిన్ నార్నే హీరోగా వచ్చిన శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాకు పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. సినిమా పబ్లిసిటీ చేయని కారణంగా జనాల్లోకి వచ్చినా పట్టించుకోవడం లేదు. అసలు ఈ సినిమా వచ్చిన సంగతి చాలా మందికి తెలియదు. నితిన్ నార్నె నటించిన మొదటి సినిమా టెక్నికల్‌గా ఇదే... కానీ కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యం అయింది.
మ్యాడ్ సినిమాతోనే పాపులారిటీ సొంతం చేసుకున్న దర్శకుడు శోభన్ తనయుడు సంగీత్ శోభన్. ఈయన హీరోగా రూపొందిన గ్యాంబ్లర్స్ సినిమా కూడా నేడు విడుదల అయింది. ఈ కుర్ర హీరోకు ఈ మధ్య కాలంలో యూత్‌లో మంచి క్రేజ్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లుగా గ్లాంబ్లర్స్ సినిమాను ప్రమోట్ చేసి ఉంటే కచ్చితంగా మినిమం బజ్ క్రియేట్ అయ్యేది. కానీ ఏదో కారణం వల్ల సినిమాను ప్రమోట్ చేయకుండా నేరుగా విడుదల చేశారు అనిపిస్తుంది. క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణం కనిపించక పోవడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంగీత్ శోభన్, నితిన్ నార్నెలు సైతంగా ఈ సినిమాల ప్రమోషన్ పై దృష్టి పెట్టలేదు. కారణం ఏంటో మరి..!
