సక్సెస్ మీట్సా? కామెడీ మీట్సా?
రిజల్ట్.. వసూళ్లు.. టాక్.. రివ్యూస్.. రెస్పాన్స్.. వీటిలో ఏ ఒక్క దానితో సంబంధం లేకుండా ఈవెంట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు కొన్ని సినిమాల మేకర్స్
By: Tupaki Desk | 10 May 2025 2:00 AM ISTఅది సక్సెస్ మీటా.. లేకుంటే కామెడీ మీటా.. అన్నట్లు ఉంది ప్రస్తుత రోజుల్లో పరిస్థితి. రిజల్ట్.. వసూళ్లు.. టాక్.. రివ్యూస్.. రెస్పాన్స్.. వీటిలో ఏ ఒక్క దానితో సంబంధం లేకుండా ఈవెంట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు కొన్ని సినిమాల మేకర్స్. సక్సెస్ మీట్.. థ్యాంక్యూ మీట్.. ఆ మీట్.. ఈ మీట్.. అంటూ రకరకాల పేర్లతో వేడుకలు జరుపుకుంటున్నారు.
కానీ సినిమా రిజల్ట్ చూస్తే షాకే.. మొదటి షోనే డిజాస్టర్ టాక్.. మధ్యాహ్నం నుంచి ఏకంగా షోలు క్యాన్సిల్.. ఏ సినిమా రా బాబు అంటూ సోషల్ మీడియాలో సినీ ప్రియుల రివ్యూలు.. అలా ఎందుకు తీశారోనని విమర్శలు.. కానీ అవేం పట్టించుకోకుండా అనేక మంది మేకర్స్ సక్సెస్ మీట్స్ ఏర్పాటు చేసి ఓ రకంగా సందడి చేస్తూ కనిపిస్తున్నారు.
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ఆ ట్రెండ్ ఎక్కువైనా.. ఎప్పటి నుంచో ఉందిలే. అయితే సక్సెస్ అంటే సినిమా కోసం మేకర్స్ పెట్టిన ప్రతి ఒక్క రూపాయి వెనక్కి రావడం. అదే అసలైన సిసలైన సక్సెస్ అని చెప్పాలి. కానీ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ.. కొందరు సినిమా రిలీజ్ అయిన తక్కువ రోజుల్లో సక్సెస్ మీట్స్ పెట్టి థాంక్యూ చెప్పేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం ఓ హీరో యాక్ట్ చేసిన మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు వసూలు చేసిందని పోస్టర్ రిలీజ్ చేశారు. సక్సెస్ మీట్ అంతకుముందే పెట్టేశారు. తీరా చూస్తే ఆ మూవీ మూడు ఏరియాల్లో భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. మరో రెండు ఏరియాల్లో ఏదో పెట్టిన ఖర్చులు మాత్రం వచ్చాయట. ఇంకా కొన్ని ఏరియాల్లో అంతంతమాత్రమే.
ఆ తర్వాత మరో హీరో నటించిన సినిమా ఓపెనింగ్స్ భారీగా వచ్చినట్లు అనౌన్స్ చేశారు. కానీ రెండో రోజు థియేటర్స్ ఖాళీగా కనిపించాయి. అది పక్కన పెడితే వెంటనే ఈవెంట్ ఏర్పాటు చేసి ఆ సమయంలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిందని ప్రకటనలు.. సంబరాలు.. వేడుకలు.. అది కూడా స్వయంగా హీరోనే అలా చేశారు. కేట్ కూడా కట్ చేశారు.
ఇంకో హీరో తన మూవీ వేరే లెవెల్ హిట్ అని గ్రాండ్ గా ప్రకటించారు. కానీ ఆ సినిమా ఎలాంటి హిట్టో డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు. గోదావరి రెండు ఏరియాలు సహా పలు ప్రాంతాల్లో భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. అలా ఒకటి రెండు కాదు.. చాలా సినిమాల పరిస్థితి అంతే. మరేం ఏమనుకుంటున్నారో.. ఎందుకు అలా చేస్తున్నారో వారికే తెలియాలి.