Begin typing your search above and press return to search.

హై అలెర్ట్: స‌ల్మాన్ ఇంటి ముందు కాల్పుల క‌ల‌క‌లం

తాజా ఘ‌ట‌న‌తో బాంద్రా హైఅలెర్ట్ అయింది. స‌ల్మాన్ భాయ్ నివాసం వెలుపల అమాంతం భద్రతను పెంచారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటన స్థలంలో ఉంది.

By:  Tupaki Desk   |   14 April 2024 4:50 AM GMT
హై అలెర్ట్: స‌ల్మాన్ ఇంటి ముందు కాల్పుల క‌ల‌క‌లం
X

ముంబై బాంద్రాలోని బాలీవుడ్ సూప‌ర్ స్టార్ సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తాజా క‌థ‌నాల‌ ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున ఈ కాల్పులు జరిగాయి. దుండగులు బైక్‌పై వచ్చి సల్మాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల గాలిలో 4 రౌండ్లు కాల్చి లొకేషన్ నుండి పారిపోయారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

మ‌రింత స‌మాచారం గురించి ఆరా తీయ‌గా.. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. ఇప్పుడు ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ విచారణ కోసం సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

తాజా ఘ‌ట‌న‌తో బాంద్రా హైఅలెర్ట్ అయింది. స‌ల్మాన్ భాయ్ నివాసం వెలుపల అమాంతం భద్రతను పెంచారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటన స్థలంలో ఉంది. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఏడాది కాలంగా స‌ల్మాన్ కుటుంబానికి థ్రెట్ ఎదురవుతోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ ని అత‌డి కుటుంబీకుల‌ను అనేకసార్లు చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత స‌ల్మాన్ కి Y కేట‌గిరీ భద్రతను ప్ర‌భుత్వం క‌ల్పించింది. రాజస్థాన్‌- జోధ్‌పూర్‌లో 1998లో జరిగిన కృష్ణజింక కేసు దీనంత‌టికీ కార‌ణం. గత ఏడాది నవంబర్‌లో ముంబై పోలీసులు స‌ల్మాన్ భద్రతను సమీక్షించిన అనంత‌రం...భాయ్ కి మ‌రింత‌గా బెదిరింపులు పెరిగాయి.

ప్ర‌ముఖ గాయ‌కుడి హ‌త్యతో బిష్ణోయ్ సంబంధం:

ప్ర‌ముఖ పంజాబీ నటుడు, గాయకుడు గిప్పీ గెరెవాల్‌ను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ గ‌తంలో సోష‌ల్ మీడియాలో ఒక‌ పోస్ట్ చేసాడు. దాని సారాంశం ఇలా ఉంది- ``నిన్ను ఎవరూ రక్షించలేరు. సిద్ధూ మూస్ వాలా మరణంపై మీ స్పందనను మేం గుర్తించలేదు. అతడి క్యారెక్ట‌ర్, నేర సంబంధాల గురించి మాకు బాగా తెలుసు`` అని రాసారు.

పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడైన బిష్ణోయ్ 2022లో ఢిల్లీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. బిష్ణోయ్ సమాజం పవిత్రంగా భావించే కృష్ణజింకను చంపినందుకు క్షమాపణలు చెప్పనంత వరకు సల్మాన్ ఖాన్‌ను తన సంఘం క్షమించదని చెప్పాడు.

ర‌క్ష‌ణ కోసం మ‌రో బుల్లెట్ ప్రూఫ్ కార్:

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో.. సల్మాన్ రక్షణ కోసం ఒక SUVని దిగుమతి చేసుకున్నాడు. ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ టొయోటా ల్యాండ్ క్రూయిజర్‌ని ఉప‌యోగిస్తున్నా మ‌ళ్లీ కొత్త కార్ కొన్నాడు. వ‌రుస‌ బెదిరింపుల న‌డుమ అతడు ఏప్రిల్‌లో భద్రతా కారణాల దృష్ట్యా నిస్సాన్ కి చెందిన‌ అత్యంత ఖరీదైన SUV (నిస్సాన్ పెట్రోల్) ను దిగుమతి చేసుకున్నాడు.. ఈ SUV ఇంకా అధికారికంగా భారత మార్కెట్లో విడుదల కాలేదు. ప్ర‌ముఖ ఏజెన్సీల స‌మాచారం మేర‌కు ఈ విష‌యం బ‌హిర్గ‌త‌మైంద‌ని జాతీయ మీడియా వెల్ల‌డించింది.