పాన్ ఇండియా స్టార్ హీరో పరువు తీస్తారా?
సాధారణంగా చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆ సినిమాలు మధ్యలో ఆగిపోవడం వంటివి మనం చూస్తూ ఉంటాం.
By: Tupaki Desk | 6 April 2025 1:00 AM ISTసాధారణంగా చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆ సినిమాలు మధ్యలో ఆగిపోవడం వంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ పెద్ద హీరోల సినిమాలు మాత్రం చాలా అరుదుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాయి. స్టార్ హీరోల సినిమాలకు, క్రేజ్ ఉన్న హీరోల సినిమాలకు నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా భారీ ఎత్తున ఫైనాన్స్ చేసేందుకు ఫైనాన్సియర్స్ రెడీగా ఉంటారు. అందుకే ఎక్కువ శాతం పెద్ద హీరోల సినిమాలు ఆర్థికపరమైన కారణాల చేత ఆగి పోవడం జరగదు. కానీ ఇటీవల ఒక పాన్ ఇండియా స్టార్ హీరో సినిమా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుందనే వార్తలు వస్తున్నాయి.
సౌత్ ఇండియాకు చెందిన ఆ స్టార్ హీరో పాన్ ఇండియా రేంజ్‌లో వరుస విజయాలను దక్కించుకున్నాడు. ఆయన సినిమా అంటే బాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ అంచనాలు, ఆసక్తి భారీగా ఉంటుంది. ఇక సౌత్‌లో ఆయనకు అన్ని భాషల్లోనూ మంచి డిమాండ్ ఉంది. అలాంటి స్టార్ హీరో సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టినా కచ్చితంగా నూరు శాతం రికవరీ గ్యారెంటీ ఉంది. అలాంటి హీరో సినిమాను భుజాల మీద వేసుకున్న ఒక నిర్మాణ సంస్థ అనాలోచిత నిర్ణయాలతో, అట్టర్ ఫ్లాప్ సినిమాలకు పెట్టుబడి పెట్టడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వరుసగా సినిమాలు నిర్మిస్తూ వచ్చిన ఆ నిర్మాణ సంస్థ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
హీరోకు ఉన్న మార్కెట్ నేపథ్యంలో దాదాపుగా రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల బడ్జెట్‌తో నిర్మించేందుకు సదరు నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సమయంలోనే బాలీవుడ్ నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుని దాదాపుగా రూ.300 కోట్ల ఫండింగ్ తీసుకుంది. మిగిలిన మొత్తంను ఇక్కడి నిర్మాణ సంస్థ పెట్టాల్సి ఉండగా ఇప్పుడు ఆ మొత్తంను పెట్టే పరిస్థితి లేదట. దాంతో సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతుందని, అత్యంత కీలకమైన వీఎఫ్ఎక్స్ వర్క్ ఆగిపోయిందని ఆఫ్ ది రికార్డ్ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా కోసం ఆ పాన్ ఇండియా స్టార్ చాలానే చేశారు. అయినా పరిస్థితులు ముందు పడేలా లేవు.
సినిమా కోసం ఎక్కువ సమయం వేస్ట్ చేయకుండా సదరు పాన్ ఇండియా స్టార్ మరో సినిమాతో ముందుగా వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఆ సినిమాతో అయినా ఆ స్టార్ హీరో వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినిమాకు ఫండింగ్ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాణ సంస్థ సౌత్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాణ సంస్థపై న్యాయ పరమైన చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే సినిమా ఇమేజ్ డ్యామేజ్ కావడంతో పాటు, ఆ పాన్ ఇండియా సూపర్ స్టార్ పరువు పోతుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందా అని ఆ హీరో సన్నిహితులు ఆసక్తిగా చూస్తున్నారట. ప్రస్తుతానికి ఆ విషయంలో హీరోగారు పెద్దగా అంటీముట్టనట్లు ఉంటున్నారని, వాళ్లిద్దరూ ఏదో ఒకటి తేల్చుకున్న తర్వాత షూటింగ్ పూర్తి చేసేందుకు వస్తానని అన్నాడట.
