Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు వీరమల్లు అప్డేట్

ముఖ్యంగా పవన్ ను ఇప్పటి వరకు పీరియాడిక్ సినిమాల్లో చూడకపోవడం కూడా దీనిపై బజ్ కు కారణం అయింది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 4:01 PM GMT
ఎట్టకేలకు వీరమల్లు అప్డేట్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ మధ్య వరుస పెట్టి సినిమాలకు ఓకే చెప్పారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అవడంతో ఆ సినిమాలన్నీ ఆగిపోయాయి. ఇప్పటికే మూడు చిత్రాలు నిలిచిపోయాయి. అయితే చాలా కాలం తర్వాత ఈ మూవీల నుంచి మెల్లమెల్లగా ఒక్కో అప్డేట్ వస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా మెగా సూర్య ప్రొడక్షన్స్.. హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ ఇచ్చింది.


పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమానే హరిహర వీరమల్లు. అయితే పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిష్- పవన్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడంతో పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా పవన్ ను ఇప్పటి వరకు పీరియాడిక్ సినిమాల్లో చూడకపోవడం కూడా దీనిపై బజ్ కు కారణం అయింది.

ఈ సినిమా షూటింగ్ సుమారు నాలుగేళ్ల క్రితం మొదలైంది. క్రిష్ దర్శకత్వంలో మొదట్లో చిత్రీకరణ జోరుగా సాగింది. ఆ తర్వాత కరోనా రావడంతో బ్రేకులు పడ్డాయి. ఇక అప్పటి నుంచి ఈ మూవీకి అనేక ఇబ్బందులు వచ్చాయి. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందో.. లేదో అన్న అనుమానాలు వచ్చాయి. ఒక్క గ్లింప్స్ మినహా పెద్దగా అలాంటి అప్డేట్లు రాలేదు. దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారంటూ కూడా రూమర్లు బయటకు వచ్చాయి.

ఈ నేపథ్యంలో నేడు (ఫిబ్రవరి 12) హరిహర వీరమల్లును నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌస్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. కొన్ని సిటీల్లో ఈ సినిమా వీఎఫ్ ఎక్స్ పనులు జరుగుతున్నాయని పేర్కొంది. “విప్లవ యోధుడి సినిమా హరిహర వీరమల్లు గురించి అప్డేట్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులు, సినిమా ప్రేమికులందరికీ.. ప్రస్తుతం ఈ ప్రతిష్ఠాత్మక సినిమా హైఎండ్ వీఎఫ్‍ ఎక్స్ పనులు ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మీ ఊహలను మించి మా చిత్రం ఉంటుంది. అందుకే అలాగే థ్రిల్‍ తో ఉండండి” అని మెగా సుప్రియా ప్రొడక్షన్స్ వెల్లడించింది.

హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి స్పెషల్ ప్రోమోను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు కూడా నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రోమో అద్భుతంగా ఉంటుందని తెలిపింది. అయితే తమ ప్రకటనలో క్రిష్ గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. మరి ఆ ప్రోమో ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

హరిహర వీరమల్లు సినిమా మొఘలుల కాలం నాటి బ్యాక్‍ డ్రాప్‍ లో రూపొందుతోంది. ఈ చిత్రంలో భారత యోధుడిగా పవన్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్‍ గా యాక్ట్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‍ లో విడుదల కానుంది.