Begin typing your search above and press return to search.

అలాంటిరోజులు పోయాయంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా?

త‌మిళ‌ నిర్మాత ఎస్ఆర్ ప్రభు ఇటీవల బ‌హిరంగ వేదిక‌పై కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   1 Aug 2023 4:03 AM GMT
అలాంటిరోజులు పోయాయంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా?
X

స్టార్ల‌ను దేవుళ్లుగా కొలిచే ప‌రిశ్ర‌మ‌లో 'అలాంటి రోజులు పోయాయి' అనేస్తే దానిని అంగీక‌రించేందుకు అభిమానులు సిద్ధంగా ఉంటారా? అంటే అస్స‌లు సిద్ధంగా ఉండ‌రు.. భారతీయ చలనచిత్ర పరిశ్రమ పూర్తిగా హీరోయిజంపై ఆధార‌ప‌డినది. త‌మ అభిమాన క‌థానాయ‌కుల‌ను లేదా స్టార్ల‌ను దేవుళ్లుగా కొల‌వ‌డం అభిమానుల‌కు ఇష్టం. ఈ త‌ర‌హా ఫ్యానిజంతోనే బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ వ‌సూళ్లు సాధ్య‌మ‌వుతున్నాయి. రికార్డుల‌కు ఆస్కారం ఏర్ప‌డుతోంది. అయితే సూపర్ స్టార్ల‌ శకం ఇప్పుడు ముగిసిపోయిందని ప్రముఖ త‌మిళ‌ నిర్మాత ఎస్ఆర్ ప్రభు ఇటీవల బ‌హిరంగ వేదిక‌పై కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ దృక్కోణం సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ర‌జ‌నీకాంత్- అజిత్- విజ‌య్ వంటి సూప‌ర్ స్టార్లు ఉన్న ఇండ‌స్ట్రీలో ఇలాంటి కామెంట్ కి ప్ర‌తిస్పంద‌న ఎలా ఉంటుందో ఊహించ‌గ‌లం.

నిర్మాత కామెంట్ పై అభిమానులు సీరియ‌స్ గా స్పందించారు. రజనీకాంత్ అభిమానులకు ప్రియమైన నటుడు మాత్ర‌మే కాదు ఆయ‌న‌ నిజమైన సూపర్‌స్టార్ అంటూ అభిమానులు రిప్ల‌య్ ఇచ్చారు. ఈ ట్యాగ్‌ని తమిళ సినిమాల‌కే ప‌రిమితం కాకుండా దేశవ్యాప్తంగా నాలుగు దశాబ్దాలుగా ఆయన కలిగి ఉన్నారు. తిరుగులేని శాశ్వత సూపర్ స్టార్ ఆయ‌న అని స‌మ‌ర్థించారు. జైలర్ ఆడియో లాంచ్‌లో రజనీకాంత్ త‌న పేరుకు ముందు సూప‌ర్ స్టార్ ట్యాగ్ ఎందుకు?.. దానిని తొల‌గించండి! అని కూడా వ్యాఖ్యానించారు. అయినా అభిమానులు దానికి అంగీక‌రించ‌లేదు.

అతడి వ్యాఖ్య‌ల‌పై రజనీకాంత్ - విజయ్- అజిత్ అభిమానులు ప్ర‌తిస్పందిస్తూ.. తమ తమ నటులను సూపర్ స్టార్‌లుగా కీర్తించారు. ఒక అభిమాని విజయ్‌ను చివరి సూపర్‌స్టార్ అని పేర్కొంటూ భవిష్యత్తులో విజయానికి అత‌డు సింబ‌ల్ అని అన్నాడు. మరొక అభిమాని ఉద్రేకంతో రజనీకాంత్ నిజమైన సూపర్ స్టార్ అంటూ హోదాను సమర్థించాడు. సూప‌ర్ స్టార్ అనే బిరుదు 1978 నుండి ర‌జ‌నీకి పర్యాయపదంగా ఉందని ఇది కేవలం కాలానుగుణ లేదా తాత్కాలిక లేబుల్ కాదని పేర్కొన్నాడు.

నిర్మాత SR ప్రభు ఏమ‌ని కామెంట్ చేసారు?

ప్ర‌స్తుత డిబేట్ న‌డుమ‌ SR ప్రభు తన ఆలోచనలను షేర్ చేసారు. చిత్ర పరిశ్రమను సూపర్ స్టార్ లు ఏలే శకం క్షీణిస్తోందని ఉద్ఘాటించారు. ప్రతి స్టార్ ఎవ‌రికి వారు మార్కెట్ వాటాను కలిగి ఉన్నార‌ని విడుదల తేదీ, కంటెంట్, కాంబినేష‌న్, పోటీ వంటి బహుళ అంశాల ఆధారంగా సినిమాల విలువ మారుతుందని అతను ఎత్తి చూపాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈ మార్పును అర్థం చేసుకోవడానికి .. ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి ప్రధాన ఉదాహరణ అని ఆయన ప్రశంసించారు. ఇది ప్రాంతీయ సరిహద్దులు దాటి మార్కెట్ ఉద్ధరణ విస్తరణకు దారితీసిందని అన్నారు. ఈ విధానం అన్ని పరిశ్రమల్లో ఆనవాయితీగా మారుతుందని వాణిజ్యం మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమను కొత్త శిఖరాలకు పెంచుతుందని SR ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే సూప‌ర్ స్టార్ల‌ను త‌క్కువ చేసి చూపే ఉద్ధేశం కంటే సినిమా పురోభివృద్ధి గురించి అత‌డు మాట్లాడే ప్ర‌య‌త్నం చేసాడు.