Begin typing your search above and press return to search.

ఫిలింస్టూడియో ప‌డ‌గొట్టి 3000 కోట్ల‌తో రియ‌ల్ వెంచర్

ముంబైలోని ప‌లు పెద్ద స్టూడియోలు అంత‌రించిపోయి వాటి స్థానంలో రియ‌ల్ వెంచ‌ర్లు వెలిసిన సంద‌ర్భాలున్నాయి.

By:  Tupaki Desk   |   5 July 2025 3:00 AM IST
ఫిలింస్టూడియో ప‌డ‌గొట్టి 3000 కోట్ల‌తో రియ‌ల్ వెంచర్
X

చాలా ప‌రిశ్ర‌మ‌ల‌తో పోలిస్తే వినోద ప‌రిశ్ర‌మ‌లో వ్యాపారం అత్యంత రిస్కుతో కూడుకున్న‌ద‌ని అనుభ‌వ‌జ్ఞులు చెబుతుంటారు. సినీరంగంలో నిర్మాత‌లు, బ‌య్య‌ర్లు, స్టూడియో ఓన‌ర్లు ఆస్తులు అమ్ముకుని బిచాణా ఎత్తేసిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. సినిమా వ్యాపారంలో దిగిన కొంద‌రు ఎంతో ఫ్యాష‌న్‌తో స్టూడియోల‌ను నిర్మించుకుని సినీరంగానికి సేవ‌లు చేస్తుంటారు. కానీ స్టూడియోల నిర్వ‌హ‌ణ త‌ల‌కుమించిన భారంగా ప‌రిణ‌మించే ప‌రిస్థితులు ఉంటాయి. దీంతో స్టూడియోల స్థానంలో వేరే ఏదైనా లాభ‌సాటి వ్యాపారం చేయాల‌నే ఆలోచ‌న స్టూడియో అధిప‌తుల‌కు రావ‌డం స‌హ‌జం.

హైద‌రాబాద్ లో కొన్ని స్టూడియోల స్థానంలో రియ‌ల్ వెంచ‌ర్లు ప్లాన్ చేసార‌ని, క‌ళ్యాణ మంట‌పాలు నిర్మించార‌ని గ‌తంలో క‌థ‌నాలొచ్చాయి. గ‌తంలో మూవీ మొఘ‌ల్ డి.రామానాయుడుకు చెందిన‌ నాన‌క్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోస్ లో కొంత భాగాన్ని ప్ర‌యివేట్ ప్రాజెక్టుకి ఇచ్చార‌ని ప్ర‌చారం సాగింది. ప్ర‌భుత్వం ద‌ఖ‌లుప‌రిచిన‌ది కాకుండా, స్టూడియో స్థ‌లం ప్ర‌యివేట్ ప్రాప‌ర్టీ అయిన‌ప్పుడు ఆ స్థ‌లాన్ని త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా వ్యాపారాల‌కు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటు య‌జ‌మానికి ఉంటుంది.

ముంబైలోని ప‌లు పెద్ద స్టూడియోలు అంత‌రించిపోయి వాటి స్థానంలో రియ‌ల్ వెంచ‌ర్లు వెలిసిన సంద‌ర్భాలున్నాయి. హిందీ సినిమా షోమ్యాన్ గా పాపుల‌రైన లెజెండ‌రీ న‌టుడు కీ.శే. రాజ్ క‌పూర్ కి చెందిన ప్ర‌ఖ్యాత ఆర్కే స్టూడియో స్థానంలో ఇప్పుడు భారీ రియ‌ల్ వ్యాపారం జ‌రిగింద‌ని ప్ర‌చారం ఉంది. ప్ర‌ఖ్యాత గోద్రేజ్ ప్రాప‌ర్టీస్ ఆర్కే స్టూడియోస్ ని కొనుగోలు చేసి వ్యాపారాల్ని వృద్ధి చేసుకుంది.

ఇప్పుడు ముంబైలోనే మ‌రో స్టూడియో క‌నుమ‌రుగు కానుంద‌ని తెలిసింది. జూలై 3న ముంబైకి చెందిన లిస్టెడ్ రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్కేడ్ డెవలపర్స్ లిమిటెడ్ రూ. 183 కోట్లకు ఫిల్మిస్తాన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఒక బైండింగ్ ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రకటించింది. డెవలపర్ రూ. 3,000 కోట్ల స్థూల అభివృద్ధి విలువతో ఆ స్థలంలో లగ్జరీ అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. గోరేగావ్ వెస్ట్‌లోని ఎస్వీ రోడ్‌లో ఉన్న 4 ఎకరాల స్టూడియో భూమిని రియ‌ల్ వెంచ‌ర్లుగా అభివృద్ధి చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్ట్ 2026లో ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇక్క‌డ విశాలమైన 3, 4 బెడ్ రూమ్స్, 5 BHK అపార్ట్‌మెంట్‌లతో పాటు, ప్రత్యేకమైన పెంట్‌హౌస్‌లను నిర్మించాల‌నేది ప్ర‌ణాళిక‌. ఇది ప్రాజెక్ట్ పశ్చిమ ముంబైలోని ప్రీమియం హౌసింగ్‌లో ఒక ల్యాండ్‌మార్క్‌గా మారనుంది. గోరేగావ్ వెస్ట్‌లోని ఒక అపార్ట్‌మెంట్ సగటు ధర చదరపు అడుగుకు రూ. 30,000 నుండి రూ. 40,000 వరకు ఉంటుందని స్థానిక బ్రోకర్లు చెబుతున్నారు.

ఫిలిం స్టూడియోలు కేవ‌లం క‌ళ‌ను పోషించ‌డానికి మాత్ర‌మే.. వాటివ‌ల్ల య‌జ‌మానుల‌కు ప్ర‌యోజ‌నం ఏదీ ఉండ‌దు. భారీ ఆదాయ మార్గాలు ఉండ‌వు. అందుకే ర‌క‌ర‌కాల వాణిజ్య వ్యాపారాల విస్త‌ర‌ణ కోసం అమ్మ‌కానికి పెడుతున్నారు.