Begin typing your search above and press return to search.

'ఫైటర్' మూవీ రివ్యూ

బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్.. అతడితో బ్యాంగ్ బ్యాంగ్-వార్ లాంటి హిట్ సినిమాలు తీసిన సిద్దార్థ్ ఆనంద్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త చిత్రం.. ఫైటర్.

By:  Tupaki Desk   |   25 Jan 2024 10:08 AM GMT
ఫైటర్ మూవీ రివ్యూ
X

'ఫైటర్' మూవీ రివ్యూ

నటీనటులు: హృతిక్ రోషన్-దీపికా పదుకొనే-అనిల్ కపూర్-కరణ్ సింగ్ గ్రోవర్-అక్షయ్ ఒబెరాయ్-అశుతోష్ రాణా తదితరులు

సంగీతం: విశాల్-శేఖర్

నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా-అంకిత్ బల్హారా

ఛాయాగ్రహణం: సంచిత్ పాలోజ్

రచన- సిద్దార్థ్ ఆనంద్-రోమన్ చిబ్

నిర్మాతలు: సిద్దార్థ్ ఆనంద్-మమతా ఆనంద్-జ్యోతి దేశ్ పాండే-అజిత్ అంధారె-అంకు పాండే-రోమన్ చిబ్-కెవిన్ వాజ్

దర్శకత్వం: సిద్దార్థ్ ఆనంద్

బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్.. అతడితో బ్యాంగ్ బ్యాంగ్-వార్ లాంటి హిట్ సినిమాలు తీసిన సిద్దార్థ్ ఆనంద్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త చిత్రం.. ఫైటర్. ఇండియన్ సినిమాలో ఇప్పటిదాకా రాని పూర్తి స్థాయి ఎయిర్ థ్రిల్లర్ ఈ చిత్రం. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఫైటర్.. సినిమాగా ఎంతమేర మెప్పించిందో తెలుసుకుందాం పదండి.

కథ:

ప్యాటీ అలియాస్ షంషేర్ పఠానియా (హృతిక్ రోషన్) ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ పైలట్. కొంచెం దూకుడు ఎక్కువైన ప్యాటీకి ప్రమాదాలకు ఎదురెళ్లడం అలవాటు. అతడి అత్యుత్సాహం వల్ల ఫైటర్ పైలటే అయిన తన ప్రేయసిని కోల్పోతాడు. ఆమె అన్న అయిన కమాండింగ్ ఆఫీసర్ రాకీ (అనిల్ కపూర్).. ప్యాటీ మీద అయిష్టత పెంచుకుంటాడు. పుల్వామా దాడిలో 40 మంది సైనికుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్ ఉగ్రవాదుల మీద ప్రతీకార దాడి చేసే క్రమంలో ప్యాటీ దూకుడు కారణంగా ఇద్దరు సైనికులు పాకిస్థాన్ చేతికి చిక్కడంతో రాకీకి కోపం తన్నుకొస్తుంది. క్రమశిక్షణ చర్యల కింద ప్యాటీని ఫైటర్ పైలట్ స్థానం నుంచి తప్పించి ఏవియేషన్ అకాడమీకి పంపిస్తాడు. కొన్నాళ్లు అక్కడ పని చేశాక తన ఉద్యోగానికే రాజీనామా చేయాలనుకుంటాడు ప్యాటీ. ఐతే అత్యవసర పరిస్థితుల్లో దేశానికి అతడి సేవలు అవసరం పడతాయి. ఆ పరిస్థితుల్లో అతనేం చేశాడు.. పాక్ చేతికి చిక్కిన ఇద్దరు భారత సైనికుల పరిస్థితి ఏమైంది.. ఈ విషయాలు తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

పాకిస్థాన్ ఆర్మీ సాయంతో ఉగ్రవాదులు ఇండియా మీద దాడి చేయడం.. దానికి ఇండియన్ ఆర్మీ దీటైన బదులివ్వడం.. ఆ కౌంటర్ ఎటాక్ లో హీరో కీలక పాత్ర పోసించడం.. తర్వాత దేశానికి పెను ముప్పు వాటిల్లితే హీరో రంగంలోకి దిగి మిషన్ పూర్తి చేయడం.. ఈ కోవలో బాలీవుడ్ ఫిలిం మేకర్స్ తరచుగా సినిమాలు తీస్తూ ఉంటారు. ఇండియా మీద ఉగ్రవాద దాడులు దాదాపుగా ఆగిపోయినా.. ఈ తరహా సినిమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఒకే తరహా కథలు మళ్లీ మళ్లీ చూసి జనాలకు మొహం మొత్తేసే పరిస్థితి. అందుకే 'పఠాన్' సక్సెస్ తర్వాత 'టైగర్-3' అంతగా జనాలకు రుచించలేదు. ఎన్నిసార్లు ఇవే సినిమాలు చూస్తాం అనే ఫీలింగ్ కలిగింది ప్రేక్షకులకు. 'ఫైటర్'కు కూడా రిలీజ్ ముంగిట ఆశించినంత బజ్ రాకపోవడానికి ఇదే కారణం. ట్రైలర్ చూస్తే.. కథ పరంగా అదే పాకిస్థాన్ వెర్సస్ ఇండియా టెంప్లేంట్లో సాగేలా కనిపించింది. సినిమా కూడా ఆ అంచనాలకు భిన్నంగా ఏమీ సాగదు. కాకపోతే ఈసారి వార్ పూర్తిగా ఆకాశంలో జరగడమే 'ఫైటర్'ను కొంచెం భిన్నంగా నిలబెడుతుంది. గాల్లో సాగే వార్.. యాక్షన్ సీక్వెన్సులు ఎంగేజ్ చేసినప్పటికీ.. మిగతా వ్యవహారమంతా రొటీన్ గా అనిపించడంతో 'ఫైటర్' ఒక మోస్తరుగా అనిపిస్తుందంతే.

దేశభక్తితో ముడిపడ్డ సినిమాల్లో ఆ తరహా ఎమోషన్ ప్రేక్షకుల్లో కలిగించడమే అత్యంత కీలకమైన విషయం. దేశం కోసం సైనికులు పడే కష్టం.. ప్రాణాలను పణంగా పెట్టి వాళ్లు చేసే పోరాటం.. వాళ్లకేమైనా అయితే కుటుంబ సభ్యులు పడే బాధ.. ఇవన్నీ భావోద్వేగాలు రేకెత్తించే విషయాలే అయినా.. చాలా సినిమాల్లో ఆ తరహా సీన్లు చూసి చూసి జనాలకు ఒక మొనాటనస్ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో మళ్లీ అవే సీన్లు చూపించి ఎమోషన్ పండించడం తేలికైన విషయం కాదు. సిద్దార్థ్ ఆనంద్.. జెన్యూన్ ఎమోషన్లను రాబట్టడంలో కొంత విజయవంతం అయ్యాడు. సినిమాలోని ముఖ్య పాత్రలు.. సంఘటనలతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడేలా చేయడంతో కథ సాఫీగానే సాగిపోతుంది. కానీ సినిమాలో కథ పరంగా ప్రేక్షకులు ఆశ్చర్యపోయే.. స్టన్నయ్యే అంశాలంటూ ఏమీ లేవు. పుల్వామా ఎటాక్ చుట్టూ వార్ డ్రామాను ఇప్పటికే 'యురి' లాంటి సినిమాల్లో చూసేశారం. దానికి కౌంటర్ ఎటాక్ గా వాయుసేన ఒక మిషన్ చేపట్టినట్లుగా ఇందులో చూపించారు. అది కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది. 'ఫైటర్'లో హీరోయిన్ పాత్రతో కొంత ఎమోషన్ పండించగలిగిన దర్శకుడు.. హీరో పాత్రను మాత్రం సరిగా తీర్చిదిద్దలేదు. ఏదో ఒక గందరగోళం ఆ పాత్రను వెంటాడుతూ ఉంటుంది. హృతిక్ ఎంత బాగా ఆ పాత్రను భుజాల మీద మోసినప్పటికీ.. పాత్ర చిత్రణలో లోపాల వల్ల ఆ పాత్రతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడదు.

యాక్షన్ సినిమాలు అన్నాక హీరోలు విలన్ల మీద పడి వీర లెవెల్లోనే ఫైట్లు చేస్తేనే ప్రేక్షకులకు కిక్కు వస్తుంది. 'ఫైటర్'లో అలాంటి యాక్షన్ ఘట్టం ఒక్కటే ఉంది. అది కూడా చివర్లో.. కొంచెం మొక్కుబడిగానే సాగుతుంది. అలా అని సినిమాలో థ్రిల్ ఇచ్చే యాక్షన్ ఎపిసోడ్లు లేవని కాదు. ఎప్పుడూ చూసే రొటీన్ యాక్షన్ కాకుండా.. కొత్తగా అనిపించే ఎయిర్ యాక్షనే ఇందులో హైలైట్. 'టాప్ గన్ మావరిక్' లాంటి హాలీవుడ్ సినిమాల్లో చూసిన ప్రపంచ స్థాయి ఎయిర్ యాక్షన్ కు ఏమాత్రం తగ్గని రీతిలో ఇందులో వాయు విన్యాసాలు ఉన్నాయి. మన బడ్జెట్లు.. ప్రమాణాల కోణంలో చూస్తే తెర మీద ఇలాంటి విన్యాసాలు గొప్పగానే అనిపిస్తాయి. సినిమాలో మూడు మేజర్ యాక్షన్ బ్లాక్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఈ ఘట్టాల్లో లాజిక్ మాత్రం కొండెక్కేసింది. గాల్లో అలాంటి విన్యాసాలు.. మలుపులు సాధ్యమా అనిపిస్తుంది. గాల్లో ఫైటర్ జెట్లు పేలిపోయినట్లుగా చూపించి.. అందులోని సైనికులు పాకిస్థాన్ కు పట్టుబడ్డట్లు చూపించడం సరిగా అనిపించదు. కథ పరంగా రొటీన్ అనిపించడం.. విలన్ పాత్ర బలహీనంగా ఉండడం 'ఫైటర్'లో మేజర్ మైనస్ పాయింట్స్. విలన్ పాత్రలో కొంచెం పేరున్న నటుడిని పెడితే బాగుండేది. ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు బాలేదు. కొన్ని ఎమోషనల్ బ్లాక్స్.. యాక్షన్ ఘట్టాల వరకు ఎంగేజ్ చేసే 'ఫైటర్' మీద మరీ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఓకే.

నటీనటులు:

హృతిక్ రోషన్ మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు 'ఫైటర్'లో. ఫైటర్ పైలట్ పాత్రకు అతను ఫిట్ అనిపించాడు. స్టైలిష్ గా కనిపించాడు. సంఘర్షణతో ముడిపడ్డ పాత్రను అతను పరిణతితో పోషించాడు. ఎమోషన్లను బాగా పండించాడు. ప్యాటీ పాత్రకు వెయిట్ తీసుకురావడంలో హృతిక్ కృషి తెర మీద కనిపిస్తుంది. అభిమానులకు అతణ్ని ఇలాంటి క్యారెక్టర్లో చూడడం ఫీస్ట్ అనడంలో సందేహం లేదు. దీపికా పదుకొనే కూడా బాగా చేసింది. సినిమాలో మేజర్ ఎమోషన్ తన పాత్రతోనే ముడిపడి ఉంది. కమాండింగ్ ఆఫీసర్ పాత్రలో అనిల్ కపూర్ తన అనుభవాన్ని చూపించాడు. కరణ్ సింగ్ గ్రోవర్.. అశుతోష్ రాణా తమ పాత్రల పరిధిలో బాగా నటించారు.

సాంకేతిక వర్గం:

విశాల్-శేఖర్ పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. సుజలాం సుఫలాం పాట సినిమా నడతలో బాగా అనిపిస్తుంది. సంచిత్ బల్హారా-అంకిత్ బల్హారా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా శైలికి తగ్గట్లుగా స్టైలిష్ గా సాగింది. సంచిత్ పాలోజ్ ఛాయాగ్రహణం సినిమాలో హైలైట్లలో ఒకటి. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. సినిమా అంతటా భారీతనం కనిపిస్తుంది. ఇక దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ స్టైలిష్ యాక్షన్ తీయడంలో తన మార్కును చూపించాడు కానీ.. కథ పరంగా ఏమాత్రం కొత్తదనం చూపించలేకపోయాడు. అలవాటైన కథనే ఎయిర్ యాక్షన్ సీక్వెన్సులు.. ఎమోషన్లతో నడిపించడానికి అతను చేసిన ప్రయత్నం ఓ మోస్తరుగా అనిపిస్తుంది.

చివరగా: రొటీన్ కథకు 'ఎయిర్' మసాలా

రేటింగ్- 2.5/5