Begin typing your search above and press return to search.

బజ్ లేని పదిహేను సినిమాలు.. అందరికీ హిట్టు కావాలి!

ఈ వారం వచ్చే వారిలో దాదాపు అందరికి సరైన సక్సెస్ రావాల్సిన అవసరం ఉంది. కానీ సినిమాలపై పెద్దగా అంచనాలు లేవు.

By:  Tupaki Desk   |   12 March 2024 5:37 AM GMT
బజ్ లేని పదిహేను సినిమాలు.. అందరికీ హిట్టు కావాలి!
X

ఇప్పుడంతా పరీక్షల సీజన్.. విద్యార్థులంతా ఎగ్జామ్ ఫీవర్ లో ఉన్నారు. తల్లిదండ్రులు వారి గురించి కేర్ తీసుకునే పనిలో ఉన్నారు! ఏటా ఈ సమయంలో పెద్ద సినిమాలేవి రిలీజ్ కావు. ఆ తర్వాత వేసవిలో మాత్రం భారీగా రిలీజ్ లు ఉంటాయి. కొన్ని వారాలుగా కేవలం చిన్న సినిమాలు మాత్రమే సందడి చేస్తున్నాయి. అలా ఈ వారం కూడా కొన్ని సినిమాలు భారీ ఆశలతో.. థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. ఈ వారం వచ్చే వారిలో దాదాపు అందరికి సరైన సక్సెస్ రావాల్సిన అవసరం ఉంది. కానీ సినిమాలపై పెద్దగా అంచనాలు లేవు.

శివరాత్రి కానుకగా పలు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. నటించిన ప్రయోగాత్మక చిత్రం గామి రిలీజ్ అయ్యి మంచి టాక్ అందుకుంది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసేసుకుంది. దాంతోపాటు గోపీచంద్ భీమాకు మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు సాధించింది. ఇక హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మలయాళం మూవీ ప్రేమలు డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజైంది.

రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయగా.. పెద్దగా వసూళ్లు రాబట్టడం లేదు. కానీ పెట్టుబడి మాత్రం వచ్చినట్లు తెలుస్తోంది. లాస్ట్ వీక్ సంగతి అలా ఉండగా.. ఇప్పుడు మరో వారం వచ్చేసింది. ఏడుకుపైగా చిన్న సినిమాలు థియేటర్లో విడుదల కానున్నాయి. బిగ్ బాస్ దివి లంబసింగి, వెయ్ దరువెయ్, రజాకర్, తంత్రతో పాటు పలు చిత్రాలు సందడి చేయనున్నాయి.

అయితే వారం రిలీజ్ అయ్యే కొత్త సినిమాల్లో రజాకార్ మూవీపై కాస్త ఫోకస్ ఉంది. స్టార్టింగ్ నుంచే ఈ మూవీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అనసూయ నటించిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. దీంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఇక పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ మూవీ వెయి దరువెయ్ కు ప్రమోషన్లు బాగానే జరుగుతున్నాయి.

కెరీర్ మొదట్లో అన్న పూరి సపోర్ట్ తో మంచి ఛాన్సులు అందుకున్న అతను 143 - బంపర్ ఆఫర్ వంటి సినిమాలతో బాగానే క్రేజ్ అందుకున్నాడు. అనంతరం వరుస డిజాస్టర్స్ వచ్చాయి. దీంతో ఇప్పుడు అతని ఆశలన్నీ వెయి దరువెయ్ అనే సినిమాపైనే పెట్టుకున్నాడు. మరోవైపు, అనన్య నాగళ్ల తంత్ర హారర్ మూవీ హిట్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. అనన్యకి ఈసారి ఒక హిట్ రావాల్సిన అవసరం ఉంది.

ఇక కొత్త కథలతో ప్రయోగాలు చేసే త్రిగుణ్.. ఈసారి వెరైటీ కాన్సెప్ట్ లైన్ మెన్ మూవీతో రాబోతున్నారు. బిగ్ బాస్ దివి హీరోయిన్ గా తొలిసారి నటించిన లంబసింగి మూవీ కూడా ఈ వారమే రానుంది. సోషల్ మీడియాలో బాగానే క్రేజ్ అందుకుంటున్న అమ్మడు ఈ సినిమాతో హీరోయిన్ గా బిజీ అవ్వాలని చూస్తోంది. చైతన్య రావు హీరోగా నటించిన షరతులు వర్తిస్తాయి తో పాటు రాశీఖన్నా-సిద్దార్థ్ మల్హోత్రా యోధ కూడా రిలీజ్ కానుంది. మరి వీటిలో ఏం సినిమా హిట్ అవుతుందో చూడాలి.