మెగా స్పోర్ట్స్ సీజన్‌లో సెలబ్రిటీల ఓటు ఎవరికి?
ఒకవైపు ఫిపా- మరోవైపు ఐసీసీ మహిళలటీ 20 ప్రపంచకప్ మ్యాచులతో క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.
By: Srikanth Kontham | 22 Jun 2026 1:02 PM ISTఒకవైపు ఫిపా- మరోవైపు ఐసీసీ మహిళలటీ 20 ప్రపంచకప్ మ్యాచులతో క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ రెండు ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు ఒకే సమయంలో జరగడంతో సెలబ్రిటీలు సైతం ఏ మ్యాచ్ చూడాలనే ఆసక్తికర గందరగోళం నెలకొంది. ఈ మెగా టోర్నీల పోటీలో అత్యధిక శాతం మంది భారతీయ సెలబ్రిటీలు మాత్రం మహిళల టీ20 ప్రపంచకప్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మైదానంలో పోరాడుతున్న మన ఉమెన్ ఇన్ బ్లూ (భారత మహిళల జట్టు)పై ఉన్న అభిమానమే. భారతీయుల గుండెల్లో క్రికెట్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.
అందుకే గ్లోబల్ టోర్నీలు ఎన్ని ఉన్నా? మన దేశం ఆడే మ్యాచ్‌లను చూస్తూ జట్టును ప్రోత్సహించడంలో వచ్చే మజానే వేరని భావిస్తున్నారు. ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్స్ ఆటను ఆస్వాదించడంతో పాటు దేశభక్తికి సెలబ్రిటీలు సమ ప్రాధాన్యత ఇస్తున్నారు. రన్‌విజయ్ సింఘా వంటి క్రీడా అభిమానుల మాట ప్రకారం.. లియోనెల్ మెస్సి వంటి దిగ్గజాలకు ఇది చివరి ఫిఫా ప్రపంచకప్ కావొచ్చు. కాబట్టి అర్జెంటీనా, స్పెయిన్ లాంటి జట్ల మ్యాచ్‌లను వదులుకోలేము. కానీ అదే సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ వంటి భారతీయ స్టార్ ప్లేయర్స్ మైదానంలో అద్భుతాలు సృష్టిస్తుంటే వారిని చూసి గర్వపడటం.. దేశీయ జట్టుకు మద్దతుగా నిలవడమే అత్యంత ముఖ్యమన్నారు.
ఈ నేపథ్యంలో సెలబ్రిటీల నుంచి ఆసక్తికర విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ప్రముఖ సంగీత విద్వాంసుడు లెస్లీ లూయిస్ అభిప్రాయం ఏంటంటే?.. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌నకు ఉండే క్రేజ్, ఆ స్టేడియంల హడావుడి, గ్లోబల్ వైబ్స్ అద్భుతంగా ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ మన దేశంలో క్రికెట్ అనేది ఆట మాత్రమే కాదు. అదొక భావోద్వేగం. ప్రపంచ దేశాలతో మన అమ్మాయిలు తలపడుతున్నప్పుడు వచ్చే సహజమైన ఎనర్జీ, ఉత్కంఠే ఎక్కువగా స్క్రీన్‌లకు కట్టిపడేస్తుందని అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ స్థాయిలో ఈ రెండు టోర్నీల ప్రభావంపై కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో సోఫై స్టేడియానికి దగ్గరగా ఉండి ఫుట్‌బాల్ ని గమనిస్తున్న డీజే అక్బర్ సామీ వంటి వారు మరో కోణాన్ని ప్రస్తావించారు. 104 మ్యాచ్‌లతో సాగే ఫిఫా టోర్నీ ప్రపంచవ్యాప్తంగా భారీ డేటా ట్రాఫిక్‌ను, అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంటుండగా బ్రిటన్‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ మాత్రం క్రికెట్ ఆడే దేశాలలో బలమైన ఫ్యాన్ బేస్‌ను సృష్టిస్తోందని అంచనా వేస్తున్నారు.
ఏదేమైనా? క్రీడా పండుగ వినోద రంగాన్ని సరికొత్త ఊపులోకి తెచ్చింది. ఒకవైపు ప్రపంచవ్యాప్త ఫుట్‌బాల్ జాతర, మరోవైపు దేశీయ సెంటిమెంట్‌తో ముడిపడిన మహిళల క్రికెట్ లీగ్.. రెండింటి మధ్య సెలబ్రిటీలు బాలెన్స్ గా ఉన్నారు. ఒకప్పుడు పురుషుల క్రికెట్‌కు మాత్రమే పరిమితమైన క్రేజ్ ఇప్పుడు మహిళల అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలకు కూడా లభిస్తుండటం.. ఫిఫా వంటి గ్లోబల్ జెయింట్‌తో సమానంగా మన నటీనటులు, కళాకారులను ఆకర్షిస్తుండటం భారత క్రీడా రంగంలో వచ్చిన గొప్ప మార్పుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
