సీనియర్ నటి ఆ క్లబ్‌లో చేరుతుందా?
నాయికా ప్రధాన చిత్రాలు తీయడం ఒకెత్తు.. వాటిని బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా మలచడం మరొక ఎత్తు.
By: Tupaki Desk | 17 Jun 2025 8:15 AM ISTనాయికా ప్రధాన చిత్రాలు తీయడం ఒకెత్తు.. వాటిని బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా మలచడం మరొక ఎత్తు. రెండోది జరగకపోతే ఇక ఎప్పటికీ ఆ నిర్మాత లేదా దర్శకుడు లేడీ ఓరియెంటెడ్ అనే మాటే ఎత్తడు. అందుకే పరిశ్రమలో హీరో సామ్యం డామినేషన్ ఎక్కువ. హీరోని చూసి మాత్రమే టికెట్ తెగుతుంది.. హీరోయిన్ ని చూసి కాదు! అనేందుకు బలమైన ప్రూఫ్ లు ఉన్నాయి.
అయితే దీపిక పదుకొనే, కంగన, ఆలియా, కరీనా, టబు లాంటి భామలు కొన్నిటిని అధిగమించారు. నాయికా ప్రధాన చిత్రాల్లో నటించి సత్తా చాటగలమని నిరూపించారు. అయితే ప్రధాన నటీమణులకు తగ్గట్టే కథాంశాల్ని కూడా దర్శకనిర్మాతలు ప్రజలకు కనెక్ట్ చేయగలిగారు. ఇక ఆలియా, కరీనా లాంటి నాయికలు నటించిన సినిమాలు తొలి రోజు 7-8 కోట్ల రేంజులో వసూలు చేసిన ఘనతను సాధించారు. ఇప్పుడు అదే క్లబ్ లో సీనియర్ నటి కాజోల్ సినిమా చేరగలదా? అన్న చర్చా సాగుతోంది.
కాజోల్ నటించిన హారర్ చిత్రం `మా` ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కాజోల్ ఇందులో ఓ ఛాలెంజింగ్ పాత్రలో నటించారు. తన నటనకు పేరొస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆరంభ వసూళ్లను పెంచాలంటే, కేవలం ట్రైలర్ వరకే కాకుండా సినిమా ఆద్యంతం గగుర్పాటుకు గురి చేసే హారర్ తో రక్తి కట్టించాల్సి ఉంటుంది. ఇటీవలి ముంజ్యా, షైతాన్ వంటి చిత్రాల సరళిలో `మా` కూడా క్యూరియాసిటీ పెంచింది. కాజోల్ కొన్ని సత్తువ లేని పాత్రల్లో నటించి వైఫల్యాలను ఎదుర్కొన్న తర్వాత ఇది మంచి అవకాశం. పోటీబరిలో కాజోల్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. `మా` చిత్రం తాను ఆశించినట్టు విజయం సాధిస్తే ఇదే తరహాలో మరిన్ని సినిమాల్లో కాజోల్‌కి అవకాశాలు వచ్చేందుకు వీలుంది. అజయ్ దేవగన్ కెరీర్ బెస్ట్ పొజిషన్ కి చేరుకుంటున్న ఈ తరుణంలో కాజోల్ కూడా కంబ్యాక్ అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆ ఇద్దరి నటవారసురాలు నైసా దేవగన్ కూడా త్వరలోనే బరిలోకి వచ్చే ఛాన్సుంది.
