Begin typing your search above and press return to search.

ఫిబ్రవరి బాక్సాఫీస్.. ఎలా ఉండబోతోందంటే..

దాదాపు మూడు వారాలు గడుస్తున్నా హనుమాన్ సినిమా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు.

By:  Tupaki Desk   |   31 Jan 2024 5:06 AM GMT
ఫిబ్రవరి బాక్సాఫీస్.. ఎలా ఉండబోతోందంటే..
X

జనవరిలో సంక్రాంతి సినిమాలు ఆడియన్స్ ను అలరించాయి. ఆ సీజన్ లో టాలీవుడ్ నుంచి ఏకంగా 4 టాప్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో హనుమాన్ బ్లాక్ బస్టర్ హట్ నిలవగా.. మిగతా మూడు చిత్రాలు మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నాయి. హనుమాన్, గుంటూరు కారం చిత్రాలు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. దాదాపు మూడు వారాలు గడుస్తున్నా హనుమాన్ సినిమా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు.

ఇక సంక్రాంతి సినిమాల సందడి కాస్త తగ్గడంతో ఫిబ్రవరి చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు సినీ ఆడియన్స్. ఫిబ్రవరిలో తెలుగు, తమిళ, హిందీ, హాలీవుడ్ తో కలుపుకుని ఏకంగా 15 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. చిన్న, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పది తెలుగు చిత్రాలు.. ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

తొలి వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో చెప్పుకోదగ్గ మూవీ ఏదన్నా ఉందంటే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ ఒక్కటే. సుహాస్, శివాని జంటగా దుష్యంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కానుంది. సుహాస్ మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడం, ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ మెప్పించడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. అదే రోజు గేమ్, బూట్ కట్ బాలరాజు, హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాలు కూడా విడుదల కానున్నాయి.

ఇక రెండో వారం లిస్టులో క్రేజీ సినిమాలు ఉన్నాయి. జీవా ప్రధాన పాత్రలో వస్తున్న.. వైఎస్ జగన్ యాత్ర 2 ఫిబ్రవరి 8వ తేదీన విడుదల కాబోతుంది. అలాగే మాస్ మహారాజా హీరోగా నటించిన ఈగల్ మూవీ ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది. ఇక ఐశ్వర్య ధనుష్ డైరెక్షన్ లో రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ కూడా ఫిబ్రవరి 9వ తేదీనే విడుదల కానుంది.

ఇక ఫిబ్రవరి 16న మెగా హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది. హీరో సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన కూడా అదే రోజు విడుదల కానుంది. చివరి వారంలో సంతోష్ శోభన్ జోరుగా హుషారుగా షికారు పోదామా, రాజ్ తరుణ్ తిరగబడరా స్వామి సినిమాలు థియేటర్స్ కు వస్తున్నాయి. మరి ఈ చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందనేది చూడాలి.