సినిమా సెట్స్‌లో వేధింపులు తగ్గాయన్న నటి
బాలీవుడ్ లో తాను లైంగిక వేధింపులకు గురి కాలేదని, అయితే తనను ఇబ్బందికి గురి చేసిన పరిస్థితులు వేరే ఉన్నాయని ఫాతిమా పేర్కొంది.
By: Tupaki Desk | 24 Jun 2025 5:00 AM ISTసినీపరిశ్రమలో లైంగిక వేధింపుల ప్రహసనంపై కొన్నేళ్లుగా చాలా చర్చ సాగింది. మీటూ ఉద్యమ సమయంలో సహచరుల వేధింపులపై కొందరు నటీమణులు ఫిర్యాదు చేయడం, అనంతరం అరెస్టులు, పోలీసుల విచారణల గురించి తెలిసిందే. కొన్నేళ్లుగా కోర్టుల పరిధిలో కేసులు రన్ అవుతున్నాయి. నాలుగైదేళ్లుగా మీటూ ఉద్యమ ప్రభావం సినీపరిశ్రమలపై ఉంది. క్రమశిక్షణా రాహిత్యం, సెట్లలో మహిళలపై దుష్ప్రవర్తన ఇప్పటి పరిస్థితుల్లో ఎలా మారాయి? అని ప్రశ్నిస్తే దానికి `దంగల్` నటి ఫాతిమా సనా షేక్ ఇచ్చిన ఆన్సర్ ఆశ్చర్యపరిచింది.
ఇటీవలి కాలంలో సెట్లలో లైంగిక వేధింపులు, దుష్ప్రవర్తన తగ్గాయని ఫాతిమా వెల్లడించారు. మీ టూ ఉద్యమం బాలీవుడ్‌ను మరింత జవాబుదారీగా మార్చిందని సదరు నటీమణి పేర్కొంది. సెట్స్ లో ఇప్పుడు పరిస్థితులు అదుపు తప్పడం లేదు. సమస్య ఉంటే పరిష్కరించడానికి ఒక టీమ్‌ని నియమించినందున అందరూ జాగ్రత్త పడుతున్నారు. వేధింపులపై సకాలంలో స్పందించి దర్యాప్తు చేస్తున్నందున పరిస్థితి మారింది. సెట్లో ఏదైనా ఘటన జరిగితే దానిపై ఇప్పుడు తారలు అంతా బహిరంగంగా మాట్లాడుతున్నారు. దీనివల్ల కూడా వేధింపులు తగ్గాయని ఫాతిమా సనా షేక్ అన్నారు.
బాలీవుడ్ లో తాను లైంగిక వేధింపులకు గురి కాలేదని, అయితే తనను ఇబ్బందికి గురి చేసిన పరిస్థితులు వేరే ఉన్నాయని ఫాతిమా పేర్కొంది. ఇటీవల ఓటీటీ కంపెనీలు కూడా సెట్లలో వేధింపులకు చెక్ పెట్టేందుకు చేసిన కృషి అభినందనీయం... అని ఫాతిమా అన్నారు. మొత్తానికి మారిన పరిస్థితులపై ఫాతిమా తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. అయితే సినీరంగంలో మాత్రమే కాదు.. అన్ని రంగాల్లోను పరిస్థితులు మారాలని చాలా మంది నెటిజనులు కోరుకుంటున్నారు. లైంగిక వేధింపుల నివారణకు పోష్ (పివోఎస్ హెచ్) వంటివి పని చేయడం అభినందనీయమని అన్నారు.
