తన అరుదైన వ్యాధి గురించి హీరోయిన్ ఏమన్నదంటే..!
బాల నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఫాతిమా సనా షేక్ 'దంగల్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు దక్కించుకుంది.
By: Tupaki Desk | 26 Jun 2025 3:39 PM ISTబాల నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఫాతిమా సనా షేక్ 'దంగల్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమాలో ఆమీర్ ఖాన్‌కు కూతురుగా నటించిన ఫామితా ఆ తర్వాత అదే అమీర్ ఖాన్‌కు జోడీగా నటించిన విషయం తెల్సిందే. ఫామితా సనా షేక్ ఎలాంటి పాత్రల్లో అయినా ఇట్టే ఒదిగి పోతుంది అంటారు. సినిమాల సంఖ్య పెంచుకోవాలి అని కాకుండా మంచి పాత్రలు చేయాలి అనుకునే నటి ఫాతిమా. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న ఈ అమ్మడు తాజాగా 'మెట్రో ఇన్ డినో' సినిమాలో నటించింది. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫాతిమా సనా షేక్ మీడియా ముందుకు వచ్చింది.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఫాతిమా సనా షేక్ తన అనారోగ్యం గురించి, తాను సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకొచ్చింది. నాడీ సంబంధిత సమస్యల కారణంగా ఈమె మూర్ఛ వ్యాధితో ఇబ్బంది పడుతుంది. అక్కడ.. ఇక్కడ, అప్పుడు ఇప్పుడు అని కాకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఈమె ఫిడ్స్‌కు గురి అవుతుంది. ఒక సారి దుబాయ్‌కి వెళ్తున్న సమయంలో విమానంలో ఈమెకు ఫిడ్స్ వచ్చాయట. అంతే కాకుండా మరోసారి మరో ప్రయాణంలోనూ ఫిడ్స్ వచ్చాయట. ఫిడ్స్ వచ్చిన ప్రతిసారి విమాన సిబ్బంది తనకు సపర్యలు చేసి, తనను ఎయిర్ పోర్ట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారని, ఆ సమయంలో అత్యంత కఠినమైన మెడిసిన్‌ను వినియోగించినట్లు ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది.
ఒకే రోజు రెండు మూడు సార్లు ఫిడ్స్ వచ్చిన సందర్భాలు కూడా తన జీవితంలో ఉన్నాయని ఫాతిమా ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది. చిన్న వయసులో ఈ సమస్యను ఎదుర్కొనే వారు తమ జీవితాలను కోల్పోవాల్సి వస్తుంది. అది చాలా బాధ కలిగించే విషయం. వారికి అవసరమైన విధ్య అందడం లేదు. అంతే కాకుండా వారు కనీస అవసరాలను కూడా తీర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకు వ్యక్తిగత సహాయకులు ఉండటం వల్ల నేను వెంటనే కోలుకుంటాను. కొందరు మాత్రం ఫిడ్స్ కారణంగా మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయని ఫాతిమా అంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మద్దతు చాలా అవసరం అంది.
ఫాతిమా తన తాజా చిత్రం మెట్రో పై చాలా నమ్మకంగా ఉంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రను మరోసారి చేసినట్లు చెప్పుకొచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలను పోషించడం కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయడం ద్వారా ఎక్కువ సంతృప్తి లభిస్తుందని ఫాతిమా సనా షేక్ మరో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మెట్రో సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్ కీలక పాత్రలో నటించారు. ఇంకా ఈ సినిమాలో సారా అలీ ఖాన్, అలీ ఫజల్, అనుపమ్ ఖేర్, పంకజ్, కొంకోన సేన్ శర్మ, నీనా గుప్తాలు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జులై 4న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా కాకుండా ఫాతిమా చేతిలో మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
