అసభ్యంగా తాకితే కొట్టాను, అతడు నన్ను కొట్టాడు..!
తన వ్యాఖ్యలు వక్రీకరించారు అంటూ ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. ఇటీవల ఫాతిమా నటించిన 'మెట్రో ఇన్ డినో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 11 July 2025 8:04 PM ISTదంగల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ ఫాతిమా సనా షేక్. ఆ సినిమాలో ఆమీర్ ఖాన్‌కి జోడీగా నటించిన ఫాతిమా సనా షేక్ ఆ వెంటనే థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమాలో ఆయనకు జోడీగా నటించిన విషయం తెల్సిందే. సినిమాలతో కంటే ఎక్కువగా వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలుస్తున్న ఫాతిమా సనా షేక్ ఆ మధ్య ఒక తమిళ సినిమాలో నటిస్తున్న సమయంలో చాలా అసభ్యంగా ప్రవర్తించారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఆ సమయంలో తాను తీవ్రమైన మనోవేదనకు గురి అయినట్లు చెప్పింది. సౌత్ సినిమా ఇండస్ట్రీపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
తన వ్యాఖ్యలు వక్రీకరించారు అంటూ ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. ఇటీవల ఫాతిమా నటించిన 'మెట్రో ఇన్ డినో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. దాంతో ఫాతిమా సనా షేక్ జోరు మీద ఉంది. ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. సినిమా హిట్ కావడంతో మీడియా ముందుకు వచ్చి తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. ఒక ఇంటర్వ్యూలో ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ ఇటీవల తాను ఎదుర్కొన్న ఒక షాకింగ్ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఆ సంఘటనతో చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.
ఇటీవల తాను ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఓ వ్యక్తి నాతో అనుచితంగా ప్రవర్తించాడు. అతడి ప్రవర్తనతో షాక్ అయ్యాను. అతడు అసభ్యంగా తాకడంతో చెంపపై ఒక్కటి కొట్టాను, అతడు వెంటనే నన్ను కొట్టాడు. అతడు కొట్టడంతో నేను కింద పడి పోయాను. ఆ ఘటన నుంచి తేరుకోవడానికి కొంత సమయం పట్టిందని చెప్పుకొచ్చింది. అలాంటి పరిస్థితులు ఎదురైన సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. ముంబైలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా జరుగుతున్నాయని ఫాతిమా సనా షేక్ ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న కారణంగా అందరి దృష్టి ఉంటుందని ఆమె పేర్కొంది.
ముంబైలో నేను మాస్క్ ధరించి సైక్లింగ్ చేస్తున్న సమయంలో ఒక ట్రక్ డ్రైవర్ గుర్తు పట్టి నన్ను వెంబడించాడని అంది. ఆ సమయంలో అతడు నా వెనుక పదే పదే హార్న్ కొడుతూ ఉంటే ఇబ్బంది కలిగిందని చెప్పుకొచ్చింది. చాలా సమయం అతడి నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించాను అంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లను చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. పెళ్లి సాంప్రదాయం పై తనకు పెద్దగా నమ్మకం లేదని గతంలో ఈమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత సౌత్ ఇండియన్ సినిమా సెలబ్రిటీల గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. మళ్లీ ఇప్పుడు ఈ విషయమై వైరల్ అవుతోంది.
