నా మాటల అర్థం మార్చారు.. హీరోయిన్ డ్యామేజ్ కంట్రోల్
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్‌లో చాలా మంది తాము కెరీర్ ఆరంభంలో క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నామని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 13 Jun 2025 11:30 AMసినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయింది. అన్ని భాషల్లోనూ హీరోయిన్స్ లైంగిక వేదింపులకు గురి అవుతున్నారు. ఓపెన్ రహస్యం ఏంటంటే కొందరు ఇండస్ట్రీలో మనుగడ కొనసాగించడం కోసం దేనికైనా సిద్ధం అవుతూ ఉంటారు, కొందరు మాత్రం అందుకు నిరాకరిస్తారు. చాలా మంది క్యాస్టింగ్ కౌచ్‌కి నో చెప్పడం వల్ల ఆఫర్లు లేకుండా ఇండస్ట్రీ వదిలి వెళ్లి పోయిన వారు ఉంటారు. క్యాస్టింగ్ కౌచ్‌ను తట్టుకుని, ఎవరికీ తలొగ్గకుండా ఇండస్ట్రీలో రాణించిన వారు చాలా మంది ఉంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్‌లో చాలా మంది తాము కెరీర్ ఆరంభంలో క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నామని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
కొన్ని నెలల క్రితం బాలీవుడ్ దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్ సినిమా ఇండస్ట్రీలో తాను క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది. 2015లో 'నువ్వు నేను ఒకటవుదాం' అనే సినిమాలో ఫాతిమా సనా షేక్ నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో తాను చేదు అనుభవంను చవి చూసినట్లు చెప్పుకొచ్చింది. ఒక క్యాస్టింగ్ ఏజెంట్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఫాతిమా సనా షేక్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పట్ల చులకన భావం ఉంటుందని కూడా ఆమె పేర్కొంది. అక్కడ నిర్మాతలు ఓపెన్‌గానే హీరోయిన్స్‌తో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతారని ఫాతిమా సనా షేక్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
సినిమా కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉండాలని క్యాస్టింగ్ ఏజెంట్ నాతో పదే పదే అనడంతో అతడి ఉద్దేశం అర్థం అయింది. ఆ తర్వాత కూడా హైదరాబాద్‌లో అలాంటి సంఘటన నేను ఎదుర్కొన్నాను అంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఫాతిమా సనా షేక్ చేసిన వ్యాఖ్యలకు జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచారం లభించింది. దాంతో సౌత్ ఇండస్ట్రీకి చెందిన వారు ఫాతిమా సనా షేక్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు, ఆమెకు ఇక్కడ నుంచి ఆఫర్లు ఇవ్వలేదు. ఆ వ్యాఖ్యలపై తాజాగా ఫాతిమా సనా షేక్ స్పందించింది. తన వ్యాఖ్యలను వక్రీకరించారు అని, తాను మాట్లాడిన మాటలకు అర్థం వేరు అన్నట్లుగా ఫాతిమా డ్యామేజ్ క్రంటోల్ కి ప్రయత్నించింది.
తాజా ఇంటర్వ్యూలో ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ... కొన్నాళ్ల క్రితం తాను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించారు అంది. ఆ మాటలను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. దక్షిణాది సినిమా ఇండస్ట్రీ మొత్తంలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని నేను అందులో అనలేదు. ఆ పరిశ్రమలో నేను ఎదుర్కొన్న సమస్యలను మాత్రమే చెప్పాను. మొత్తం ఇండస్ట్రీని నేను ఎక్కడా తప్పుబట్టలేదు. నా వ్యాఖ్యల చుట్టూ అనవసరంగా రాద్దాంతం జరిగింది. కొందరు కావాలని ఆ వ్యాఖ్యల అర్థం మార్చి మరీ ప్రచారం చేశారు. ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఇండస్ట్రీలో చిన్న స్థాయి వ్యక్తి. కనుక మొత్తం ఇండస్ట్రీని ఎలా తప్పుబడుతామని ఆమె ఎదురు ప్రశ్నించింది. ఈ వివాదంకు ఇప్పటితో అయినా ఫుల్ స్టాప్ పెట్టాలని ఆమె విజ్ఞప్తి చేసింది.