ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన కొన్ని నెలలకే సెకండ్ పార్ట్ రిలీజ్ చేసిన సినిమాలివే!
తాజాగా రన్వీర్ సింగ్ సినిమాతో ఈ చర్చ మళ్ళీ మొదలైంది. తక్కువ వ్యవధిలో వచ్చిన ఆ క్రేజీ సీక్వెల్స్ విశేషాలు మీకోసం..
By: Madhu Reddy | 16 April 2026 5:00 AM ISTసాధారణంగా ఏదైనా సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రావాలంటే ఏళ్ల తరబడి వేచి చూడాలి. 'బాహుబలి' అయినా, 'పుష్ప' అయినా పార్ట్-2 కోసం ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పవు. కానీ, కొందరు దర్శకులు మాత్రం కథపై ఉన్న నమ్మకంతో మొదటి భాగం రిలీజ్ అయిన కొద్ది నెలల గ్యాప్‌లోనే రెండో భాగాన్ని కూడా థియేటర్లలోకి తెచ్చేస్తుంటారు. తాజాగా రన్వీర్ సింగ్ సినిమాతో ఈ చర్చ మళ్ళీ మొదలైంది. తక్కువ వ్యవధిలో వచ్చిన ఆ క్రేజీ సీక్వెల్స్ విశేషాలు మీకోసం..
వర్మ మార్క్ 'రక్త చరిత్ర':
సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే ట్రెండ్‌ను టాలీవుడ్‌లో గట్టిగా మొదలుపెట్టింది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని చెప్పాలి. పరిటాల రవి జీవిత కథ ఆధారంగా వివేక్ ఒబెరాయ్ హీరోగా వచ్చిన 'రక్త చరిత్ర' మొదటి భాగం అక్టోబర్ 22, 2010న విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక సరిగ్గా నెలన్నర తిరగకముందే, అంటే డిసెంబర్ 3న రెండో భాగాన్ని కూడా రిలీజ్ చేసి వర్మ అందరినీ ఆశ్చర్యపరిచారు. కథలోని వేగం తగ్గకుండా ఉండాలనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ మ్యాజిక్:
నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించే క్రమంలో బాలకృష్ణ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సంక్రాంతి కానుకగా జనవరి 9, 2019న విడుదలైంది. ఇక ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని చూపించే రెండో భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' కేవలం 45 రోజుల గ్యాప్‌తో ఫిబ్రవరి 22నే థియేటర్లలోకి వచ్చేసింది. ఇంత తక్కువ సమయంలో రెండు భాగాలు రావడం టాలీవుడ్‌లో ఒక రికార్డ్.
బాలీవుడ్ సెన్సేషన్ 'దురంధర్':
ఇక రీసెంట్‌గా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా 'దురంధర్'. రన్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి భాగం గతేడాది డిసెంబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ వేడి తగ్గకముందే 'దురంధర్- ది రివెంజ్' పేరుతో రెండో భాగాన్ని కేవలం మూడున్నర నెలల గ్యాప్‌తో ఈ ఏడాది మార్చి 19, 2026న విడుదల చేశారు. ఒక భారీ యాక్షన్ సినిమాకు ఇంత తక్కువ టైమ్‌లో సీక్వెల్ రావడం బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
వాస్సేపూర్ గ్యాంగ్స్ అరాచకం:
రియలిస్టిక్ క్రైమ్ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనురాగ్ కశ్యప్, 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' సినిమాతో ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపేశారు. ఈ సినిమా మొదటి భాగం జూన్ 22, 2012న రిలీజ్ కాగా, కేవలం రెండు నెలల లోపే ఆగస్టు 8న పార్ట్-2ను రిలీజ్ చేశారు. ఇక అసలు కథలో ఉన్న ఇంటెన్సిటీని ప్రేక్షకులు మర్చిపోకముందే రెండో భాగాన్ని చూపించి దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఇలాంటి ప్లానింగ్ వల్ల సినిమాపై ఉన్న ఆసక్తి తగ్గకుండా ఉండటం చిత్ర యూనిట్‌కు పెద్ద ప్లస్ అవుతుంది అనటం లో ఎటువండి సందేహం లేదు.
