రేర్ క్లిక్: మెగాబాస్ ముందే స్టెప్పులేసిన ఫరియా
మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేస్తున్న అరుదైన వీడియోని షేర్ చేసిన ఫరియా, ఎంతో ఎమోషనల్ గా దానికి క్యాప్షన్ ఇచ్చారు.
By: Tupaki Desk | 23 Aug 2025 8:48 PM ISTబ్రేక్ డ్యాన్స్.. షేక్ డ్యాన్సులతో 90లలో అలలు సృష్టించిన మెగాస్టార్ ముందే స్టెప్పులేసే ధైర్యమా? కానీ అలాంటి ధైర్యం చేసింది ఫరియా అబ్ధుల్లా. నేటితరం తెలుగమ్మాయి టాలీవుడ్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ, నిరంతరం నటిగా షైన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆరడుగుల ఎత్తు, ఆకర్షణీయమైన గిరజాల జుత్తు, అంతకుమించి అందమైన చిరునవ్వుతో ఆకట్టుకునే ఫరియా.. మెగా బాస్ చిరంజీవి ముందే వేదికపై డ్యాన్సులు చేసే అరుదైన అవకాశం దక్కించుకుంది. ఈటీవీ 30వసంతాల సంబరాల్లో బర్త్ డే బోయ్ మెగాస్టార్ చిరంజీవి ముందు ఆయన డ్యాన్స్ చేసిన క్లాసిక్ సినిమాల సాంగ్స్ మాషప్‌కి అద్భుతమైన నృత్యం చేసి అలరించింది ఫరియా.
ఇక వేదికపైకి వచ్చిన మెగా బాస్ లో ఉత్సాహం నింపి, ఆయనతో డ్యాన్సులు చేయించిన ఫరియా, చిరుతో కలిసి స్టెప్పులు వేసింది. ఇది నిజంగా ఒక వర్థమాన నటి జీవితంలో అరుదైన క్షణం. ఒక లెజెండ్ తో కలిసి ఈ అరుదైన ఆనందోత్సాహంలో పాలుపంచుకునే అవకాశం ఫరియాను వరించడం అదృష్టం. ఈ ప్రతిభావనికి ఇకపై మెగా సినిమాల్లోను అవకాశం దక్కాలని ఆకాంక్షిద్దాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించేందుకు వెనకాడని మెగాస్టార్ తెలుగమ్మాయి ఫరియా కెరీర్ కి సహకరించే అరుదైన అవకాశం కల్పిస్తారనే ఆశిద్దాం.
మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేస్తున్న అరుదైన వీడియోని షేర్ చేసిన ఫరియా, ఎంతో ఎమోషనల్ గా దానికి క్యాప్షన్ ఇచ్చారు. ``మీలాంటి వారు నిజంగా ఉండరు.. ఎప్పుడూ ఉండరు.. ఎప్పటికీ ఉండరు సార్.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. డ్యాన్స్ అనే ఉద్యమంతో లక్షలాది మందిని ప్రేరేపించినందుకు ధన్యవాదాలు. మీరు కేవలం డ్యాన్స్ మాత్రమే చేయరు.. సంగీతానికి ప్రాణం పోస్తారు`` అని ఫరియా వ్యాఖ్యను జోడించారు. 30 సంవత్సరాల ఈటీవీ వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నానని అనుకున్నాను.. కానీ మీతో ప్రత్యక్షంగా నృత్యం చేసే అవకాశం లభించింది! అని లవ్ ఈమోజీని షేర్ చేసింది ఫరియా. ఇదే వేదికపై చిరుతో పాటు సీనియర్ నటి ఖుష్బూ కూడా క్లాసిక్ స్టెప్పులతో అలరించారు.
తెలుగమ్మాయి ఫరియా ప్రస్తుతం టాలీవుడ్ లో గేమ్ ఛేంజ్ చేసే పెద్ద అవకాశాల కోసం వేచి చూడాల్సి వస్తోంది. తమిళంలో `వల్లి మయిల్` అనే ఒకే ఒక్క సినిమాలో నటిస్తోందని వీకీ చెబుతోంది. ఈటీవీ ఉత్సవాల్లో మహానటి కీర్తి సురేష్, మరకతమణి ఎం.ఎం.కీరవాణి, ఆలి సహా టీవీ ఇండస్ట్రీ దిగ్గజ నటులు, సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారు.
