ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - టాక్ ఏంటీ?
ప్రధాన పాత్రల్లో పెడ్రో పస్కల్ (రీడ్ రిచర్డ్స్), వెనెస్సా కిర్బీ (స్యూస్ స్టోర్మ్) ఆకట్టుకునే నటన చూపించారు. ఇద్దరూ సూపర్ హీరోలుగా మాత్రమే కాకుండా, తల్లిదండ్రులుగా కనిపించడంలోను మంచి పరిపక్వత చూపారు.
By: Tupaki Desk | 25 July 2025 10:17 PM ISTమార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ద ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ పై అభిమానులలో భారీ అంచనాలు ఉండడం సహజమే. ఎందుకంటే ఈసారి బడ్జెట్ లోనూ గ్రాఫిక్స్ లోనూ లిమిట్స్ లేకుండా సినిమాను నిర్మించారు. ఇప్పటివరకు ఫెంటాస్టిక్ ఫోర్‌కి సంబంధించిన సినిమాలేవీ అంతగా విజయం సాధించకపోయినా, ఈ సారి మార్వెల్ హౌస్ కొత్త జోష్‌తో ప్రయోగం చేసింది. మాట్ షాక్మన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, రీలీజ్ అయ్యాక ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సంపాదించుకుంటోంది.
ఈసారి కథలో అసలు మ్యాజిక్ ఎక్కడంటే… నాలుగేళ్ల క్రితం కొస్మిక్ రే వల్ల సూపర్‌పవర్స్ పొందిన ఫాంటాస్టిక్ ఫోర్ టీం, భూమిని రక్షించడానికి గెలాక్టస్ అనే భయంకర శత్రువుతో యుద్ధానికి దిగుతుంది. ఇందులో అసలైన ట్విస్ట్ ఏమిటంటే, గెలాక్టస్ భూమిని వదిలిపెడతానని, కానీ రీడ్ రిచర్డ్స్, స్యూస్ స్టోర్మ్ కి పుట్టబోయే బిడ్డను తనికిస్తే సరిపోతుందని డిమాండ్ చేస్తాడు. మరి వారు అలా అప్పగించారా? గెలాక్టస్ భూతాన్ని ఎలా ఎదుర్కొన్నారు? శల్లా బాల్ అనే సిల్వర్ సర్ఫర్ ఎందుకు గెలాక్టస్‌కు మెసెంజర్‌గా పనిచేస్తోంది? ఇలాంటి ప్రశ్నలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ప్రధాన పాత్రల్లో పెడ్రో పస్కల్ (రీడ్ రిచర్డ్స్), వెనెస్సా కిర్బీ (స్యూస్ స్టోర్మ్) ఆకట్టుకునే నటన చూపించారు. ఇద్దరూ సూపర్ హీరోలుగా మాత్రమే కాకుండా, తల్లిదండ్రులుగా కనిపించడంలోను మంచి పరిపక్వత చూపారు. బెన్ గ్రిమ్‌గా ఇబాన్ మాస్-బాచ్‌రాచ్, జానీ స్టోర్మ్‌గా జోసెఫ్ క్విన్ తమ పాత్రల్లో సరైన ఫన్‌ను అందించారు. ఈ సినిమాలో అసలు షో స్టీలర్ మాత్రం జూలియా గార్నర్. ఆమె చేసిన శల్లా బాల్/సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్‌కు ప్రేక్షుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. గెలాక్టస్‌గా రాల్ఫ్ ఇనేసన్ విజువల్స్‌తో పాటు తన హావభావాలు, డైలాగ్ డెలివరీతో తెరమీద భయానకంగా కనిపించాడు.
టెక్నికల్‌గా సినిమాకి ఉన్నత స్థాయి స్టాండర్డ్ ఉంది. మైఖేల్ గియాచ్చినో అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జెస్ హాల్ సినిమాటోగ్రఫీ, మార్వెల్ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కలిసి సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే మొదటి గంట కొంత లాగ్ ఫీల్ అయినా, ఎడిటింగ్ బ్యాలెన్స్ చేసిందని చెప్పొచ్చు.
ప్రేక్షకుల మాటల్లో ఈ సినిమా ఓ రెగ్యులర్ మార్వెల్ మూవీ కంటే ఎక్కువగా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా లాగానూ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా స్యూస్ స్టోర్మ్ పాత్రలో ‘నేను నా బిడ్డ కోసం ఏం అయినా చేస్తాను, కానీ నా ప్రపంచాన్ని కాపాడేందుకని నా పిల్లను సాక్రిఫైస్ చేయను’ అని చెప్పే డైలాగ్స్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అంతేకాదు, స్పేస్‌షిప్‌లో బిడ్డ జన్మించడ వంటి సన్నివేశాలు కొత్తగా, మరిచిపోలేని అనుభూతిని ఇస్తాయి.
ఇదే కాకుండా, విలన్లు అయిన గెలాక్టస్, శల్లా బాల్ పాత్రలు కూడా ప్రేక్షకులకు ఆకర్షణగా మారాయి. అటు విజువల్స్, ఇటు ఎమోషన్… రెండూ సమపాళ్ళలో ఉండటం వల్ల సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. అయితే యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఆసక్తి రాకపోవడం, మరికొంత థ్రిల్ మిస్ అవడమే చిన్న మైనస్. అయినా సినిమా ఎంగేజింగ్‌గా ఉంటుందని టాక్ వస్తోంది. మొత్తానికి, ‘ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ ఎమోషనల్ టచ్‌తో కూడిన సూపర్ హీరో ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. క్లైమాక్స్‌లో ఉన్న సర్ప్రైజ్, రాబోయే అడ్వెంజర్స్‌కి ఆసక్తి పెంచింది. మార్వెల్ ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా ఈ మూవీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
