ట్రెండీ టాక్: లెజెండ్ ఎన్టీఆర్‌కి భారతరత్న?
గత కొన్నేళ్లుగా మన తెలుగు కళాకారుల ప్రతిభకు హస్తిన(దిల్లీ) వేదికగా దక్కుతున్న అరుదైన పురస్కారాలు ఈ మార్పును స్పష్టం చేస్తున్నాయి.
By: Sivaji Kontham | 28 May 2026 11:12 AM ISTతెలుగు వెండితెరపై దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యం వహించిన లెజెండరీ నటుడు, విశ్వవిఖ్యాతనవరసనటసార్వభౌముడు నందమూరి తారక రామారావుకి దక్కాల్సిన జాతీయ స్థాయి గౌరవంపై చిత్రసీమలో మళ్లీ సరికొత్త విశ్లేషణలు మొదలయ్యాయి. ఒక మహోన్నత కళాకారుడిగా ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్న అన్నగారికి ఢిల్లీ పీఠం కేవలం ఒకే ఒక్క పౌర పురస్కారంతో సరిపెట్టడం నాటి రాజకీయ విచక్షణకు అద్దం పడుతోంది. దశాబ్ధాలుగా నటనారంగంలో ఎన్నో సంచలన చిత్రాల్లో నటించినా.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సైతం ఆయనకు అందకపోవడం వెనుక అప్పటి పాలకుల సంకుచిత స్వభావం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే మారుతున్న కాలంతో పాటు దక్షిణాది ప్రతిభపై ఇటీవల కేంద్ర పెద్దల వైఖరి మారుతుండటం పరిశ్రమ వర్గాల్లో ఆశలు రేకెత్తించింది.
గత కొన్నేళ్లుగా మన తెలుగు కళాకారుల ప్రతిభకు హస్తిన(దిల్లీ) వేదికగా దక్కుతున్న అరుదైన పురస్కారాలు ఈ మార్పును స్పష్టం చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవిని దేశంలోనే అత్యున్నతమైన పౌర సన్మానాలు వరించడం, అలాగే మెగా కాంపౌండ్ నుంచే తొలిసారిగా అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా నిలవడం టాలీవుడ్ సాధించిన ప్రగతికి నిదర్శనం. తెలుగు వారి కృషిని జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా గుర్తిస్తూ గతంలో ఒకే ఏడాది ఏకంగా ఐదుగురు ప్రముఖులకు ద్వితీయ అత్యున్నత పురస్కారం.. పదిహేను మందికి పద్మ అవార్డులను ప్రకటించడం ఇందుకు బలమైన రుజువుగా నిలిచింది.
ఈ సానుకూల వాతావరణం నడుమ, నవరస నటసార్వభౌముడు దివంగత ఎన్టీఆర్ కి దేశంలోనే అతిపెద్ద గౌరవమైన `భారతరత్న` దక్కాలనే డిమాండ్ నందమూరి అభిమానుల నుంచి ఎల్లపుడూ ఉవ్వెత్తున లేస్తోంది. కేవలం నటనలోనే కాకుండా.. చిత్ర నిర్మాణంలో.. అద్భుతమైన రాజకీయ ప్రస్థానంలో చెరగని ముద్ర వేసిన రామారావు ఈ పురస్కారానికి అన్ని విధాలా తగిన వ్యక్తి అని తెలుగు సమాజం ముక్తకంఠంతో నమ్ముతోంది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన అలాంటి నాయకుడిని సముచితంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ మహోన్నత ఆశయాన్ని సమర్థిస్తూ గతంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఒక సుదీర్ఘమైన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం అంతర్జాలంలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈశాన్య భారత కోకిల, దిగ్గజ సంగీత విద్వాంసులు భూపేన్ హజారికా గారికి కాలం చేసిన తర్వాత ఏ విధంగా అత్యున్నత పౌర పురస్కారం దక్కిందో అదే పంథాలో ఎన్టీఆర్ కి కూడా మరణానంతర గౌరవంగా భారతరత్న ఇవ్వాలని చిరు నాడే గళమెత్తారు. శతాబ్ది ఉత్సవాల వేళ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే అది యావత్ తెలుగు జాతికే గర్వకారణంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ నమ్మకం నేటికీ ప్రతి తెలుగువాడి గుండెల్లో సజీవంగానే ఉంది. నేడు (28.05.2026) 103వ జయంతి వేళ ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని మరోసారి నందమూరి అభిమానులే కాకుండా, మెగాభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నినదిస్తున్నారు.
