కొత్త శత్రువులతో ఫ్యామిలీమ్యాన్‌కి కొత్త చిక్కులు?
ఈసారి ఫ్యామిలీమ్యాన్ శ్రీకాంత్ తివారీని తిప్పలు పెట్టే మరో ఇద్దరు కొత్త శత్రువులను బరిలో దించడం బిగ్ ట్విస్ట్.
By: Tupaki Desk | 2 July 2025 10:19 AM ISTప్రతిసారీ ఏదైనా కొత్తగా చూపిస్తేనే ఈరోజుల్లో ప్రేక్షకులు కనెక్టవుతారు. డిజిటల్ యుగంలో క్రియేటివ్ మైండ్స్ కి పని ఎక్కువ పడుతోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్ లలో సహజత్వాన్ని చూపిస్తూనే, సంథింగ్ స్పెషల్ ఏదైనా చూపించాలి. అప్పుడే దర్శకరచయితల పనితనం బయటడుతుంది. అయితే ఈ విషయంలో రాజ్ అండ్ డీకే ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు. ఈసారి ఫ్యామిలీమ్యాన్ శ్రీకాంత్ తివారీని తిప్పలు పెట్టే మరో ఇద్దరు కొత్త శత్రువులను బరిలో దించడం బిగ్ ట్విస్ట్.
ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 3 లో ఆ ఇద్దరూ ఎవరి అంచనాలకు చిక్కని రీతిలో కథానాయకుడిని ఢీకొడతారని రాజ్ అండ్ డీకే చెబుతున్నారు. తాజా సమాచారం మేరకు.. మనోజ్ బాజ్‌పేయి కొత్త శత్రువు జైదీప్ అహ్లవత్, నిమ్రత్‌లను స్పై-థ్రిల్లర్‌లో ఎదుర్కొంటాడు. గ్లామరస్ క్వీన్ నిమ్రత్ కౌర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ కానుంది. రహస్య గూఢచారి శ్రీకాంత్ తివారీ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటాడన్నది ప్రతి ఒక్కరూ సిరీస్ రిలీజయ్యాక చూడాల్సి ఉంటుంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ లో ఏజెంట్ శ్రీకాంత్ తివారీ భారతదేశ శత్రువులను వెంబడిస్తూ, పోరాడటం చూసాం. అదే సమయంలో క్యాప్ ధరించిన అహ్లవత్ బైక్ నడుపుతూ కనిపించగా, నిమ్రత్ కౌర్ ఒక రెస్టారెంట్‌లో రహస్యంగా కూర్చుని కనిపిస్తుంది. టీజర్ ఉత్కంఠను పెంచడంలో సఫలమైంది.
కొత్త సీజన్ లో ప్రియమణి, హరీష్, అశ్లేష ఠాకూర్, వేదాంత్ సిన్హా తిరిగి వారి పాత్రలను పోషిస్తున్నారు. తొలి రెండు భాగాలను మించేలా ఇప్పుడు `ఫ్యామిలీమ్యాన్ సీజన్ 3`ని రాజ్ అండ్ డీకే టీమ్ సిద్ధం చేస్తోంది. ప్రతి నిమిషం థ్రిల్ కి గురయ్యేలా గగుర్పొడిచే ట్విస్టులు, టర్నులతో కుర్చీ అంచుకు జారిపోయేలా కథనాన్ని చూపించబోతున్నారని కూడా తెలుస్తోంది. ప్రతి సీజన్ లో కథాంశం ఎగ్జయిట్ చేస్తుంది. దాంతో పాటే నటీనటుల ప్రదర్శన, కీలకమైన మలుపులు గొప్ప వినోదాన్ని పంచుతున్నాయి. ఈసారి ఆ విషయంలో తగ్గకుండా తెరకెక్కిస్తున్నామని టీమ్ చెబుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు, ప్రమాదాలు ఇలా ప్రతిదీ తెరపై రంజింపజేస్తాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ సిరీస్ ని నిర్మించేందుకు రాజీ లేకుండా కృషి చేసిందని రాజ్ అండ్ డీకే చెబుతున్నారు.
