Begin typing your search above and press return to search.

మీరు చూస్తున్నవన్నీ నిజమేనా? స్క్రిప్టెడ్ డ్రామాలా? ఎలా తెలుసుకోవాలి!

మెరిసేవన్నీ నగలు కావు అన్నట్లే చూసేవన్నీ నిజాలు కావు. మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా రోజుల్లో ఫేస్ బుక్, ఇనాస్టా, యూట్యూబ్ వంటి ప్లాట్ ఫాంల్లో అనేక వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   23 March 2026 2:00 PM IST
మీరు చూస్తున్నవన్నీ నిజమేనా? స్క్రిప్టెడ్ డ్రామాలా? ఎలా తెలుసుకోవాలి!
X

మెరిసేవన్నీ నగలు కావు అన్నట్లే చూసేవన్నీ నిజాలు కావు. మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా రోజుల్లో ఫేస్ బుక్, ఇనాస్టా, యూట్యూబ్ వంటి ప్లాట్ ఫాంల్లో అనేక వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. కొన్నింటిని చూడగానే చాలా మంది భావోద్వేగానికి లోనవుతుంటారు. రోడ్డుపై జరిగిన గొడవలు, దొంగతనాల నుంచి తప్పించుకున్న దృశ్యాలు, భార్యాభర్తల మధ్య డ్రామాలు.. ఇలా రకరకాల వీడియోలు సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంటాయి. మనం వాటిని చూసి ఆశ్చర్యపోయి, వెంటనే మన మిత్రులకు షేర్ చేసేస్తుంటాం. కానీ మీరు చూస్తున్న ఆ వీడియోలలో 90 శాతం నిజమైనవి కావని నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో గదిలో ఉండగా, ఇంటి యజమాని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. ఈ విషయమై యవతి, ఇంటి ఓనర్ మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఈ విషయాన్ని యువతి తల్లి దృష్టికి తీసుకువెళతానని ఇంటి యజమాని చెబుతుంది. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు. యువతి అనుమతి లేకుండా ఇంటి యజమాని ఆ గదికి వెళ్లడమేంటి? వీడియోలు తీయడమేంటి? అని కొందరు ప్రశ్నిస్తుండగా, అనైతిక పనులు చేయకూడదు కదా? అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ సంచలన నిజం బయటపడింది.

స్క్రిప్టెడ్ వీడియోల గోల

చాలామంది కంటెంట్ క్రియేటర్లు కేవలం వ్యూస్, లైకులు, ఫాలోవర్ల కోసం పక్కా ప్లాన్ ప్రకారం నటులను పెట్టి ఇలాంటి వీడియోలను షూట్ చేస్తున్నారు. వీటినే 'స్క్రిప్టెడ్ వీడియోలు' అంటూ కింద కనీకనిపించని విధంగా డిస్కమైర్ ఇస్తున్నారు. వీడియో చివర్లోనో లేదా డిస్క్రిప్షన్‌లోనో "ఇది కేవలం వినోదం కోసం అవగాహన కోసం మాత్రమే" అని చిన్నగా రాస్తున్నారు. కానీ జనం అది గమనించకుండా నిజమని నమ్మి భావోద్వేగానికి లోనవుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఆ కోవకు చెందినదే అంటున్నారు.

ఇలాంటి వీడియోలు చూస్తే రహస్యంగా తీసినట్టు అనిపిస్తుంది, కానీ కెమెరా యాంగిల్స్ అన్నీ పక్కాగా సెట్ చేసి ఉంటాయి. ఇక వీడియోలో ఉన్న వ్యక్తుల హావభావాలు సహజంగా ఉండవు. ఈ వీడియోల అసలు ఉద్దేశ్యం ప్రజలకు అవగాహన కల్పించడం కంటే, వారి భావోద్వేగాలతో ఆడుకుని వీడియోను వైరల్ చేసుకోవడమే అంటున్నారు. ఇలాంటి నకిలీ వీడియోలను నిజమని నమ్మడం వల్ల సమాజంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది. అనవసర భయాలు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. దొంగతనాలు, దాడుల వీడియోలు చూసి జనం లేనిపోని ఆందోళనలు పెంచుకుంటున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

సమయం వృథా

కేవలం క్లిక్స్ కోసం చేసే ఇలాంటి వీడియోలను నిజమని భావించి చర్చించుకోవడం సమయం వృథా తప్ప మరేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వీడియోలను జాగ్రత్తగా పరిశీలించాలని, వీడియో క్వాలిటీ, ఎడిటింగ్ చూస్తే అవి నిజమో, అబద్ధమో తేలిపోతుందని అంటున్నారు. సాధారణంగా ఇలాంటి వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉన్నా, వాటి సోర్స్ ఎక్కడో తెలియకుండా జాగ్రత్త పడుతుంటారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదాన్ని కళ్లు మూసుకుని నమ్మేయొద్దని, ఏదైనా వీడియోను షేర్ చేసే ముందు అది నిజమో కాదో ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని అంటున్నారు.