కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి.. రజనీ మధ్యవర్తిత్వం?
తాజాగా ఈ పుకార్లపై అనిరుధ్ రవిచందర్ స్పందించారు. రెడ్డిట్ ఓవర్‌డ్రైవ్ లో మునిగి తేలకండి. అందరూ శాంతంగా ఉండండి అంటూ అనిరుధ్ ప్రతిస్పందించాడు.
By: Tupaki Desk | 14 Jun 2025 11:32 PM ISTసినిమా- క్రికెట్ బాంధవ్యం మరో కొత్త పుకార్ మోసుకొచ్చింది! సౌతిండియన్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, 'సన్‌రైజర్స్' హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్‌ను త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు పుకార్లు వచ్చాయి. తనదైన అందం, హావభావాలతో ప్రతి మ్యాచ్ లో సందడి చేసే కావ్య మారన్ చాలామంది యువహృదయాలకు గాయం చేసింది. అలా గాయపడిన వారిలో అనిరుధ్ రవిచందర్ కూడా ఒకడు! అంటూ ప్రచారం సాగుతోంది. అందమైన జంట డేటింగ్ చేస్తున్నారని, త్వరలో వివాహం చేసుకుంటారని రెడ్డిటర్లు వరుస పోస్ట్ లతో వేడెక్కించారు.
తాజాగా ఈ పుకార్లపై అనిరుధ్ రవిచందర్ స్పందించారు. రెడ్డిట్ ఓవర్‌డ్రైవ్ లో మునిగి తేలకండి. అందరూ శాంతంగా ఉండండి అంటూ అనిరుధ్ ప్రతిస్పందించాడు. రెడ్డిట్ లో తొలి పోస్ట్ అనంతరం చాలా మీడియాలు అనిరుధ్ - కావ్య కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని , దానిని అధికారికంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాయి.
అయితే అలాంటిదేమీ జరగడం లేదని అనిరుధ్ ఎక్స్ లో రాసాడు. శనివారం సాయంత్రం అతడు X (గతంలో ట్విట్టర్) లో ''పెళ్లి ఏంటి అయ్యా? హహహ.. ప్రశాంతంగా ఉండండి.. దయచేసి పుకార్లు ఆపండి'' అని రాశారు. అయితే కావ్య అనే పేరును మాత్రం అతడు ప్రస్థావించలేదు. కావ్య- అనిరుధ్ లను ఇటీవల కొందరు డిన్నర్ డేట్‌లో చూసినట్లు పేర్కొనడంతో ఆ తర్వాత తామరతంపరగా పుకార్లు మొదలయ్యాయి. కావ్య సన్ టీవీ కళానిధి మారన్ కుమార్తె. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టు సహ యజమాని. సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యక్తిగతంగా కళానిధి మారన్‌తో యువజంట సంబంధం గురించి మాట్లాడారని, ఈ జంట త్వరలో వివాహం చేసుకోవచ్చని అంచనాలు వెలువడ్డాయి.
అనిరుధ్ నటుడు రవి రాఘవేంద్ర -క్లాసికల్ డ్యాన్సర్ లక్ష్మి దంపతుల కుమారుడు. ఫిలింమేకర్ కె సుబ్రహ్మణ్యం మనవడు. అతడి అత్త లత, రజనీకాంత్‌ను వివాహం చేసుకున్నారు. అతడు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, పవన్ కల్యాణ్, అజిత్ కుమార్, సూర్య, జూనియర్ ఎన్టీఆర్, షారూఖ్ వంటి ప్రముఖుల సినిమాలకు సంగీతం అందించాడు. సౌతిండియాలో క్షణం తీరిక లేనంత బిజీగా సంపాదిస్తున్న మేటి ప్రతిభావంతుడు అనిరుధ్.
