Begin typing your search above and press return to search.

నిర్మాతగా కార్తికేయ.. పుష్ప స్టార్ తో 2 సినిమాలు

అయితే శోభూ యార్లగడ్డ మంగళవారం ఉదయం.. తమ ఆర్కా మీడియా వర్క్స్ నుంచి ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ రాబోతుందని ట్వీట్ చేశారు

By:  Tupaki Desk   |   19 March 2024 11:37 AM GMT
నిర్మాతగా కార్తికేయ.. పుష్ప స్టార్ తో 2 సినిమాలు
X

బాహుబలి మూవీ ప్రపంచ స్థాయిలో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. అయితే ఈ చిత్రాల నిర్మాతల్లో ఒకరైన శోభూ యార్లగడ్డ.. బాహుబలితో తెలుగు సినిమాను పాన్ ఇండియా మార్కెట్ కు తీసుకెళ్లారు. ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ చేయలేనంత రిస్క్ చేసి సూపర్ సక్సెస్ అయ్యారు.

అయితే శోభూ యార్లగడ్డ మంగళవారం ఉదయం.. తమ ఆర్కా మీడియా వర్క్స్ నుంచి ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ రాబోతుందని ట్వీట్ చేశారు. దీంతో ఆ ప్రాజెక్ట్ ఏంటని అందరూ చర్చించుకున్నారు. ఏదో భారీ సినిమా అయ్యి ఉండవచ్చని అంతా అనుకున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ తో ఓ సినిమా అనౌన్స్మెంట్ వస్తుందని భావించారు. ఇప్పుడు శోభూ యార్లగడ్డ.. అసలు విషయాన్ని ట్వీట్ చేశారు.

తమ బ్యానర్ ఆర్కా మీడియా వర్క్స్ పై రెండు ప్రాజెక్టులను ప్రకటించారు శోభూ యార్లగడ్డ. ఈ రెండు సినిమాలకు డైరెక్టర్ రాజమౌళి కొడుకు కార్తికేయతోపాటు ప్రసాద్ దేవినేని సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇంకో క్రేజీ విషయమేమింటంటే.. పుష్ప, విక్రమ్ మూవీలతో టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరైన ఫహాద్ ఫాజిల్ ఆ రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.

రెండింటిలో ఒక సినిమాకు బాలయ్య ఫేమస్ డైలాగ్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ను టైటిల్ గా పెట్టారు. ఫాంటసీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఫహాద్ ఫాజిల్ ఓ చిన్నారితో పోలీస్ కారుపై కనిపిస్తున్నారు. ఆ పాప ఓ మ్యాజిక్ పెన్సిల్ తో మాయాజాలం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పోస్టర్ ను చూస్తుంటే.. ఓ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ శశాంక్ యేలేటి తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ కానుందీ చిత్రం.

ఇక మరో సినిమాను ఆక్సిజన్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ ద్వారా సిద్ధార్థ్ నాదెళ్ల డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. స్ఫూర్తిదాయకమైన ఫ్రెండ్‌ షిప్ సబ్జెక్ట్‌ పై ఈ సినిమా తెరకెక్కనుంది. పోస్టర్ లో ఫహాద్ ఫాజిల్ మాస్క్ తో ఉండగా.. ఆయన ముఖంపై మ్యాప్ కనిపిస్తుంది. అయితే ఈ యంగ్ డైరెక్టర్లను పరిచయం చేస్తూ.. విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత శోభూ యార్లగడ్డ ఆనందం వ్యక్తం చేశారు. కార్తికేయ కూడా ఈ సినిమాల గురించి సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు.