Begin typing your search above and press return to search.

ఫహాద్ చేతిలో కీప్యాడ్ ఫోన్.. ధర మాత్రం 10 లక్షలు!

ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో అందరూ స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నప్పుడు ఫహాద్ మాత్రం ఓ పాత మోడల్ ఫోన్‌తో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

By:  Tupaki Desk   |   17 July 2025 12:56 PM IST
ఫహాద్ చేతిలో కీప్యాడ్ ఫోన్.. ధర మాత్రం 10 లక్షలు!
X

తక్కువ సినిమాలతోనే ప్రేక్షకుల మనసుల్లో తనదైన స్థానం ఏర్పరచుకున్న ఫహాద్ ఫాజిల్‌ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. అతనిపైన సినీ లవర్స్‌కి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. క్యారెక్టర్ లో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో, స్క్రిప్ట్‌కి ఎలా న్యాయం చేయాలో చక్కగా తెలుసుకున్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ‘పుష్ప’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. అయితే ఈసారి ఫహాద్ చర్చల్లోకి వచ్చినది సినిమా వల్ల కాదు, చేతిలో కనిపించిన ఓ ఫోన్ వల్ల.

తాజాగా మలయాళ చిత్రమైన ‘మాలీవుడ్ టైమ్స్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఫహాద్ హాజరయ్యాడు. కార్యక్రమం పూర్తయ్యాక బయటకు వచ్చిన ఫహాద్ ఫోన్ కాల్ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే అందులో అసలైన హైలైట్ ఫహాద్ లుక్ కాదు.. అతని చేతిలో ఉన్న కీప్యాడ్ ఫోన్. ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో అందరూ స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నప్పుడు ఫహాద్ మాత్రం ఓ పాత మోడల్ ఫోన్‌తో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఫహాద్ చేతిలో ఉన్నది వర్చూ బ్రాండ్‌కు చెందిన అసెంట్ రెట్రో క్లాసిక్ మోడల్ ఫోన్ అని తెలుస్తోంది. ఇది యూకే కంపెనీ తయారు చేసిన హ్యాండ్‌మేడ్ లగ్జరీ ఫోన్. పైకి చూస్తే మామూలు బేసిక్ కీప్యాడ్ ఫోన్‌లా ఉన్నా, దీని ధర రూ.10.2 లక్షలు అని చెబుతున్నారు. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభ్యం కాని రేర్ మోడల్. ఎక్స్‌క్లూజివ్ మెటీరియల్స్‌తో హ్యాండ్‌బిల్ట్‌గా తయారయ్యే ఈ ఫోన్ ఫహాద్ దగ్గర ఎన్నేళ్లుగా ఉందో కానీ, ఇప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫోన్ ఖరీదు తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఐఫోన్, గెలాక్సీ లాంటి ప్రీమియం బ్రాండ్స్‌ను త్రోసిపెట్టి.. ఇలా క్లాసిక్ రిట్రో ఫోన్‌ను వాడుతున్న ఫహాద్ సెలెబ్రిటీ లైఫ్‌స్టైల్‌కు డిఫరెంట్ అప్రోచ్ చూపిస్తున్నాడు. గతంలో నటుడు వినయ్ ఫోర్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఫహాద్ స్మార్ట్‌ఫోన్లు వాడడు, సోషల్ మీడియా దూరంగా ఉంటాడు" అన్న మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఇది కేవలం లగ్జరీ ఫోన్ కాదనిపించేలా ఫహాద్ స్టైల్ అతనికే ప్రత్యేకమైంది.

వర్చూ ఫోన్ల విషయానికి వస్తే.. ఇవి టైటానియం, లెదర్, సఫైర్ గ్లాస్ వంటి మెటీరియల్స్‌తో తయారవుతాయి. ప్రతి ఫోన్‌ మోడల్‌ను ప్రత్యేకంగా చెయ్యి చేతితో తయారు చేస్తారు. వాటిలో కొన్నింటికి ప్రత్యేక సెక్యూరిటీ, కన్సియర్‌జ్ సర్వీసులు కూడా ఉంటాయి. అందుకే ఈ బ్రాండ్‌ను సెలెబ్రిటీలు స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఫహాద్ ఈ రేర్ మోడల్‌ను వాడుతున్నాడంటే ఆయన సెలెక్టివిటీకి ఇది ఓ ఉదాహరణనే చెప్పాలి. ఇప్పుడు ఫహాద్ పలు మలయాళ చిత్రాల్లో నటిస్తున్నాడు. బాలీవుడ్ ఎంట్రీపై కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాల్లో విలక్షణత చూపే ఫహాద్, నిజ జీవితంలో కూడా స్టైల్ విషయంలో తనదైన వైభోగాన్ని చూపిస్తున్నాడు.