Begin typing your search above and press return to search.

పుష్ప‌రాజ్ పాలిట య‌ముడు `షెకావ‌త్` ఇప్పుడేం చేస్తున్నాడు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన `పుష్ప: ది రైజ్`, `పుష్ప: ది రూల్` చిత్రాలలో ఐపీఎస్ ఆఫీసర్ `భన్వర్ సింగ్ షెకావత్` పాత్ర ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

By:  Sivaji Kontham   |   17 Jun 2026 9:04 PM IST
పుష్ప‌రాజ్ పాలిట య‌ముడు `షెకావ‌త్` ఇప్పుడేం చేస్తున్నాడు?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన `పుష్ప: ది రైజ్`, `పుష్ప: ది రూల్` చిత్రాలలో ఐపీఎస్ ఆఫీసర్ `భన్వర్ సింగ్ షెకావత్` పాత్ర ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ తనదైన క్రూరమైన నటనతో మెప్పించారు. సినిమాలో `షెకావతూ..` అంటూ పుష్పరాజ్ పలికే డైలాగ్స్, వీరిద్దరి మధ్య సాగే మైండ్ గేమ్స్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే పాన్-ఇండియా స్థాయిలో ఈ పాత్ర ఫహద్‌కు విపరీతమైన గుర్తింపు తెచ్చినా నటుడిగా దీంతో అతడి కెరీర్‌కు ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను మించిన ఎన్నో అద్భుతమైన, వైవిధ్యమైన పాత్రలను అత‌డు అంతకుముందే తన కెరీర్‌లో పోషించారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో ఫహద్ ఫాజిల్ ప్రయాణం ఆద్యంతం ఎన్నో అవార్డులు, రివార్డులతో సాగింది. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఆయన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్‌గా నిలిచారు. ఫహద్ నటించిన `ట్రాన్స్` చిత్రం పలు జాతీయ అవార్డులను సైతం అందుకుంది. ఈ సినిమాలో ఒక మోటివేషనల్ స్పీకర్‌గా, నాట‌కాలాడే పాస్టర్‌గా ఫ‌హ‌ద్ కనబరిచిన నటవిశ్వరూపం సినీ విమర్శకులను సైతం అబ్బురపరిచింది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ `విక్రమ్` చిత్రంలో అమర్ అనే సీక్రెట్ ఏజెంట్ పాత్రలో ఫహద్ ప్రదర్శించిన నటనకు క్రిటిక్స్ నుండి భారీ ప్రశంసలు దక్కాయి.

ఈ విధంగా వైవిధ్యమైన పాత్రలతో తన సినిమా జర్నీని కొనసాగిస్తున్న ఫహద్ ఫాజిల్.. తాజాగా తనను తాను మరింత ఛాలెంజ్ చేసే పాత్రలు వస్తే చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రకటించడం ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేవలం ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా.. నటుడిగా తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే కథల కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే... ఇటీవలే మలయాళంలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన `దృశ్యం 3` చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ తో ఫహద్ చేతులు కలపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సరికొత్త అప్‌డేట్ ప్రకారం.. ఫహద్‌ ఫాజిల్, పనోరమా స్టూడియోస్ -జాకబ్ బాబు కలయికలో బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ మలయాళ చిత్రాలు రూపుదిద్దుకోనున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయి. `దృశ్యం 3` వంటి భారీ సక్సెస్ తర్వాత పనోరమా స్టూడియోస్ మలయాళ సినీ పరిశ్రమలో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకోవాలనే ప్లాన్‌తో ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ సంస్థ ఎంపిక చేసుకున్న‌ కథలలో ఉన్న బలమైన కథనమే తాను ఈ ప్రాజెక్టులను ఓకే చేయడానికి ప్రధాన కారణమని ఫహద్ ఫాజిల్ స్పష్టం చేశారు.

ఈ రెండు చిత్రాలు ఫహద్ ఫాజిల్‌లోని బహుముఖ ప్రజ్ఞను సరికొత్త కోణంలో ఆవిష్కరించేలా ఉంటాయని చిత్ర నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. ఎలాంటి భాషా బేధాలు లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో కనెక్ట్ చేయగల సామర్థ్యం ఫహద్‌కు ఉందని వారు కొనియాడారు. `పుష్ప`లో షెకావత్‌గా అలరించిన ఈ వైవిధ్యమైన నటుడు.. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌లో రానున్న ఈ రెండు సరికొత్త చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తాడో చూడాలి.