సినిమా ప్రమోషన్స్‌లో ముప్పుగా మారిన కల్చర్
సినిమాని తెరకెక్కించడం ఒకెత్తు అనుకుంటే, దానిని రిలీజ్ చేయడం మరో ఎత్తు. రిలీజ్ ముందు ప్రమోషన్స్‌పై ఆధారపడి సినిమాల జయాపజయాలు నిర్ధేశితమవుతాయి.
By: Tupaki Desk | 16 July 2025 8:00 AM ISTసినిమాని తెరకెక్కించడం ఒకెత్తు అనుకుంటే, దానిని రిలీజ్ చేయడం మరో ఎత్తు. రిలీజ్ ముందు ప్రమోషన్స్‌పై ఆధారపడి సినిమాల జయాపజయాలు నిర్ధేశితమవుతాయి. కానీ ఇటీవలి కాలంలో రిలీజ్ ముందు ప్రమోషన్లకు గండి కొట్టారు. మీడియా ఇంటర్వ్యూలను ప్లాన్ చేసే పీఆర్వోలు, మార్కెటింగ్ స్ట్రాటజిస్టులు జర్నలిస్టులతో సెలబ్రిటీ ఇంటర్వ్యూలకు అంతగా ప్రాముఖ్యతను ఇవ్వకపోవడంతో ఏదైనా సినిమా గురించి తెలుసుకునే అవకాశాన్ని ప్రజలు కోల్పోతున్నారు. తద్వారా సినిమా వచ్చిందో పోయిందో కూడా తెలియడం లేదు. ఇంతకుముందు హీరో హీరోయిన్, సంగీత దర్శకుడు, కీలకమైన కాస్టింగ్, దర్శకనిర్మాతలతో ఇంటర్వ్యూలు విధిగా ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో అసలు ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత లేకుండా పోతోందనే ఆవేదన కనిపిస్తోంది. ఒకప్పటి పీఆర్ కల్చర్‌తో పోలిస్తే డిజిటల్ యుగంలో పీఆర్ కల్చర్, ప్రవర్తన గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది.
ఇక హీరోలు మారిన కల్చర్ లో ఇంటర్వ్యూలను సోసోగానే ముగించేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో వారు మాట్లాడే పంథాలో ఆత్మ లేదని విమర్శలొస్తున్నాయి. మొక్కుబడిగానే తూతూగా వాటిని ముగించేస్తున్నారని విమర్శలున్నాయి. ఏదైనా సినిమాకి ప్రమోషన్ చాలా ముఖ్యం. దాని విలువ తెలిసిన నిర్మాతలు ప్రమోషన్ పై ఎక్కువ కేటాయింపులు ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు రెగ్యులర్ ప్రమోషన్స్‌లో భాగంగా పీఆర్‌లు తయారు చేసే ప్రశ్నలకు జవాబులివ్వడాన్ని హీరోలు కొందరు చికాగ్గా ఫీలవుతున్నారు. రొటీన్ ప్రశ్నలు వాటికి రొటీన్ జవాబులు వినే ఆడియెన్ కూడా విసిగిపోతుంటాడు. నిజాయితీ సంభాషణలు చాలా తక్కువ. అయితే రెగ్యులర్ ఫార్ములాటిక్ ప్రమోషన్లు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే, రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రయోగశీలి మాత్రమే ప్రమోషన్స్ లో కొత్తదనాన్ని అందించగలిగారు. కానీ ఈరోజుల్లో ఆయనను స్ఫూర్తిగా తీసుకుని దూకుడును ప్రదర్శించే వ్యక్తిత్వం ఇతరులకు లేదు. ఇక సినిమాల ప్రమోషన్స్ లో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ చాలా నిజాయితీగా కనిపిస్తారు. కానీ ఇతర హీరోల్లో అంత ఆసక్తి కనబడకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇక సందీప్ రెడ్డి వంగా లాంటి ముక్కుసూటి వ్యక్తి తన ఇంటర్వ్యూలతోను, చురుకైన జవాబులతోను అలరించగలడు.
