Begin typing your search above and press return to search.

టాప్ స్టోరీ: బాలీవుడ్ ఫిలిం మేకింగ్‌లో అనూహ్య‌ మార్పుల‌కు కార‌ణం?

గతంలో హిందీ సినిమాలే దేశవ్యాప్తంగా విడుద‌ల‌య్యేవి కానీ ఇప్పుడు దక్షిణాది సినిమాలు హిందీ మార్కెట్‌ను శాసిస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   11 April 2026 10:00 AM IST
టాప్ స్టోరీ: బాలీవుడ్ ఫిలిం మేకింగ్‌లో అనూహ్య‌ మార్పుల‌కు కార‌ణం?
X

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో భాషా సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పుడు కేవలం ముంబై కేంద్రంగా సాగిన బాలీవుడ్ ప్రస్థానం.. ఇప్పుడు గ్లోబల్ సినిమాగా రూపాంతరం చెందుతోంది. గతంలో రొటీన్ ప్రేమకథలకే పరిమితమైన హిందీ చిత్రసీమ... ఇప్పుడు యదార్థ గాథలు, రూరల్ ఇండియా నేపథ్యంలోని వాస్తవిక కథలకు పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా ఓటిటి విప్లవం తర్వాత కంటెంట్ నాణ్యత పెరగడం.. కేవలం స్టార్ పవర్ మీదే కాకుండా పాత్రలకు తగిన నైపుణ్యం ఉన్న నటులను ఎంచుకోవడానికి మేకర్స్ మొగ్గు చూపుతుండటం బాలీవుడ్‌లో కనిపిస్తున్న సానుకూల మార్పు.

దక్షిణాది నుంచి టాలీవుడ్, కోలీవుడ్ ప్రభావం బాలీవుడ్‌పై నేడు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు మల్టీప్లెక్స్ ప్రేక్షకుల కోసం క్లాస్ సినిమాలు తీయడానికే ప్రాధాన్యత ఇచ్చిన బాలీవుడ్‌కు బాహుబలి, పుష్ప, కెజియఫ్ వంటి చిత్రాలు మాస్ ఎలిమెంట్స్, హై-వోల్టేజ్ ఎమోషన్స్‌లోని పవర్‌ను గుర్తుచేశాయి. ఈ చిత్రాల విజయంతో బాలీవుడ్ మేకర్స్ మళ్ళీ తమ మూలాల్లోకి వెళ్లి భారీ యాక్షన్ .. బలమైన సెంటిమెంట్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైన‌ర్ల‌ను పునరుద్ధరిస్తున్నారు.

సాంకేతికంగాను బాలీవుడ్ ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి చేరుకుంటోంది. రాజమౌళి వంటి దర్శకులు సృష్టించిన విజువల్ గ్రాండియర్లను చూశాక.. వెండితెరపై విజువల్ వండర్ క్రియేట్ చేయాలనే తపన హిందీ దర్శకుల్లో పెరిగింది. బ్రహ్మాస్త్ర, పఠాన్, జవాన్ వంటి చిత్రాల మేకింగ్ స్టైల్ వెనుక దక్షిణాది సినిమాల స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తోంది. నితీష్ తివారీ `రామాయ‌ణం` ఫ్రాంఛైజీ కూడా రాజ‌మౌళి, నాగ్ అశ్విన్, ప్ర‌శాంత్ నీల్ వంటి వారితో పోటీప‌డేందుకే.. అంతర్జాతీయ టెక్నీషియన్లతో కలిసి పనిచేస్తూ.. భారీ బడ్జెట్‌లతో విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యతను పెంచుతూ బాలీవుడ్ తన గ్లోబల్ స్టాండర్డ్స్‌ను నిరూపించుకుంటోంది.

పాన్-ఇండియా మార్కెట్ వ్యూహం భారతీయ సినిమాను ఒకే తాటిపైకి తెచ్చింది. గతంలో హిందీ సినిమాలే దేశవ్యాప్తంగా విడుద‌ల‌య్యేవి కానీ ఇప్పుడు దక్షిణాది సినిమాలు హిందీ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. దీనివల్ల బాలీవుడ్ నిర్మాతలు సౌత్ దర్శకులు.. సౌత్ నటులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క‌ల‌యిక‌ వల్ల భాషా భేదాలు లేని `ఇండియన్ సినిమా` బ్రాండ్ బలపడుతోంది. దీనికి బాలీవుడ్, టాలీవుడ్ నుంచి అగ్ర హీరోలు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. అలాగే వెస్ట్రన్ కల్చర్‌ను మాత్రమే కాకుండా భారతీయ నేటివిటీని.. కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించే కథలకు ఇప్పుడు బాలీవుడ్ ప్రాధాన్యతనిస్తోంది.

దక్షిణాది సినిమాల ప్రభావం వల్ల బాలీవుడ్ తన కంఫర్ట్ జోన్నుండి బయటకు వచ్చి.. తనను తాను రీ ఇన్వెంట్ చేసుకుంటోంది. సినిమాటిక్ యూనివర్స్‌లను క్రియేట్ చేయడం.. యువ దర్శకుల సరికొత్త ఆలోచనలు.. మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలు.. సామాజిక బాధ్యతతో కూడిన కథలు బాలీవుడ్ భవిష్యత్తును ఆశాజనకంగా మారుస్తున్నాయి. చివరికి ఈ ఆరోగ్యకరమైన పోటీ వల్ల నాణ్యమైన.. వైవిధ్యమైన సినిమాలు చూసే అవకాశం ప్రేక్షకులకు లభిస్తోంది. ఇది భారతీయ సినిమా గర్వించదగ్గ పరిణామం.