Begin typing your search above and press return to search.

టిల్లుగాన్ని ఐపీఎల్ కూడా అడ్డుకోలేకపోయింది!

అయితే మన తెలుగు సినిమాలను ఈ ఐపీఎల్ అడ్డుకోలేకపోయింది.

By:  Tupaki Desk   |   3 April 2024 7:28 AM GMT
టిల్లుగాన్ని ఐపీఎల్ కూడా అడ్డుకోలేకపోయింది!
X

మన దేశంలో క్రికెట్, సినిమాలు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. ఇప్పుడు సమ్మర్ సీజన్ లో సినిమా సందడి మొదలవ్వగా.. మరోవైపు ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని.. ఈసారి వేసవి కాలంలో వచ్చే సినిమాలపై పెద్ద దెబ్బ పడుతుందని అందరూ భావించారు. కచ్చితంగా ఈవెనింగ్ షోలు, నైట్ షోలపై ప్రభావం చూపిస్తుందని అనుకున్నారు. శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచులు ఉంటాయి కాబట్టి, ఏమాత్రం వసూళ్లు ఆశించలేమని ట్రేడ్ వర్గాలు విశ్లేషించారు. అయితే మన తెలుగు సినిమాలను ఈ ఐపీఎల్ అడ్డుకోలేకపోయింది.

ఐపిఎల్ క్రికెట్ ఉండటం.. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో ఈసారి సమ్మర్ సీజన్ లో పెద్ద సినిమాలను విడుదల చెయ్యడానికి ఎవరూ సాహసించలేదు. దీంతో రెండు నెలలకు పైగా ఉండే ఇలాంటి మంచి సీజన్ ను క్యాష్ చేసుకోడానికి, అనేక చిన్న మీడియం రేంజ్ చిత్రాలు రిలీజులు ప్లాన్ చేసుకున్నాయి. ఓ పక్కన ఐపీఎల్ ప్రభావం పడుతుందేమో అని మేకర్స్ ఆందోళన చెందుతూనే ఉన్నారు. కానీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాని, క్రికెట్ కూడా ఆపలేదని 'టిల్లు స్క్వేర్' నిరూపించింది.

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''టిల్లు స్క్వేర్''. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. గత శుక్రవారం రిలీజైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. కేవలం 5 రోజుల్లోనే రూ. 85 కోట్ల వసూళ్లు రాబట్టి, 100 కోట్ల దిశగా పయనిస్తోంది. ఓవైపు ఐపిఎల్ కు విశేష ఆదరణ దక్కుతున్నా.. టిల్లు గాడి స్పీడ్ కు బ్రేకులు పడటం లేదు. వీకెండ్ లో రెండేసి మ్యాచులు ఉన్నా సరే, ఈ చిత్రం భారీ కలెక్షన్లు అందుకుంది.

'టిల్లు స్క్వేర్' సినిమా వీక్ డేస్ లోనూ గట్టిగా నిలబడింది. సోమవారం రూ.10 కోట్లు, మంగళవారం రూ.7 కోట్లు వసూలు చేసింది. ఐపిఎల్ మొదలైన తర్వాత విడుదలైన 'ఓం భీమ్ బుష్' సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర హిట్టయింది. 26 కోట్ల వరకూ కలెక్షన్లు రాబట్టింది. దీన్ని బట్టి మంచి కంటెంట్ ఉండి, టాక్ బాగుంటే చాలు.. సినిమా విజయాన్ని క్రికెట్, ఎన్నికల ఫీవర్ కూడా అడ్డుకోలేవని అర్థమవుతోంది.

ఈ సీజన్ లో సినీ అభిమానులను అలరించడానికి మరికొన్ని క్రేజీ చిత్రాలు రాబోతున్నాయి. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన 'ఫ్యామిలీ స్టార్' సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 5న విడుదల కానుంది. మరుసటి రోజు 'మంజుమ్మల్ బాయ్స్' వంటి మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'లవ్ మీ' మూవీ ఏప్రిల్ 25న విడుదల అవుతుంది. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి వీటిల్లో ఏయే సినిమాలు హిట్ అవుతాయో చూడాలి.