Begin typing your search above and press return to search.

ప‌క్క‌నే క్షిప‌ణి ప‌డింది.. చివ‌రి కాల్ ఇంటికి.. హీరోయిన్ భ‌యాన‌క అనుభ‌వం!

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సామాన్యులనే కాక సెలబ్రిటీలను కూడా వణికించాయి.

By:  Sivaji Kontham   |   3 March 2026 4:49 PM IST
ప‌క్క‌నే క్షిప‌ణి ప‌డింది.. చివ‌రి కాల్ ఇంటికి.. హీరోయిన్ భ‌యాన‌క అనుభ‌వం!
X

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సామాన్యులనే కాక సెలబ్రిటీలను కూడా వణికించాయి. ఈ భీకర యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న బాలీవుడ్ హా* బ్యూటీ ఇషా గుప్తా మృత్యువు అంచుల్లో నుంచి ప్రాణాలతో బయటపడి స్వదేశానికి చేరుకున్న తీరు ఒక హై-టెన్షన్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. అబూదాబీ ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా అకస్మాత్తుగా మొదలైన క్షిపణి దాడుల వార్తలు.. ఆ క్షణంలో ఈ న‌టి అనుభవించిన నరకయాతన వర్ణనాతీతం.





ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయం.. ఎయిర్‌పోర్ట్ అంతా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సరిగ్గా అదే సమయంలో ఎయిర్ ట్రాఫిక్‌ను నిలిపివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బయట క్షిపణి దాడులు జరుగుతున్నాయన్న వార్త తెలియగానే ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా హాహాకారాలు మొదలయ్యాయి. తర్వాతి నిమిషం ఏం జరుగుతుందో తెలియని స్థితి.. గుర్తుతెలియని వ్యక్తులు ఒకరినొకరు ఓదార్చుకుంటూ.. కన్నీళ్లతో తమ కుటుంబ సభ్యులకు చివ‌రి కాల్స్ చేసుకుంటున్న దృశ్యాలు నా కళ్ళముందే కదిలాయి! అంటూ ఇషా భయానక పరిస్థితులను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.





యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో ఎయిర్ ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవ్వడం సహజం. అలాంటి సమయంలో సంయమనం పాటించడం ప్రాణ రక్షణకు మొదటి మెట్టు. ఇషా గుప్తా తన అనుభవం ద్వారా చెప్పినట్లుగా.. విమానాశ్రయ భద్రతా సిబ్బంది సూచనలను తూచా తప్పకుండా పాటించాలి. గందరగోళానికి లోను కాకుండా... సురక్షిత ప్రాంతాలకు లేదా బంకర్లకు చేరుకోవాలి. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉన్నందున.. అందుబాటులో ఉన్న నెట్‌వర్క్ ద్వారా అధికారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.





ఇషా గుప్తా అదృష్టవశాత్తూ ఇంకా చెక్ ఇన్ పూర్తి చేయకపోవడంతో వెంటనే నిర్ణయం తీసుకుని తిరిగి అబూదాబీలోని హోటల్‌కు చేరుకోగలిగారు. ఆపద సమయంలో యూఏఈ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ చూపిన ధైర్యం, ప్రయాణికులకు అందించిన భద్రత అమోఘమని ఆమె కొనియాడారు. హోటల్‌లో ఆ రాత్రి గడిపిన ప్రతి క్షణం ఒక యుగంలా గడిచిందని.. క్షేమంగా ఇండియాకు చేరుకోవడం కేవలం దేవుడి దయ, అభిమానుల ప్రార్థనల వల్లే సాధ్యమైందని ఇషాజీ కృతజ్ఞతలు తెలిపారు.





యుద్ధ భూమి నుంచి ఎస్కేప్ అయ్యి `బ్యాక్ హోమ్` అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఇషా, తన ప్రాణాలను కాపాడిన యూఏఈ అధికారులకు, హోటల్ సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. భయంకరమైన యుద్ధ వాతావరణం నుంచి బయటపడి మళ్లీ తన సొంత గడ్డపై కాలు పెట్టడం పునర్జన్మ లాంటిదని ఆమె అభివర్ణించారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో మానవత్వం ఎలా వెల్లివిరిసిందో.. అపరిచితులు కూడా ఒకరికొకరు ఎలా అండగా నిలిచారో ఆమె వివరించిన తీరు ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.