మూవీ రివ్యూ : 'ఎపిక్'
Epic Movie Review
By: Tupaki Desk | 11 Sept 2026 7:53 AM IST'ఎపిక్' మూవీ రివ్యూ
నటీనటులు: ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య - శివాజీ - వాసుకి - కళ్యాణ్ శంకర్ - శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు
సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్
ఛాయాగ్రహణం: అజీమ్ మహమ్మద్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య
రచన - దర్శకత్వం: ఆదిత్య హాసన్
మూడేళ్ల ముందు ‘బేబి’తో సంచలనం రేపిన జంట ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం.. ఎపిక్. ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ సిరీస్ తో గొప్ప పేరు సంపాదించిన ఆదిత్య హాసన్ తీసిన తొలి ఫీచర్ ఫిలిం ఇది. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) వనపర్తికి చెందిన కుర్రాడు. చదువులో వీక్ అయిన అతడికి సినిమా డైరెక్టర్ అవ్వాలన్నది కోరిక. కానీ తండ్రి అభీష్టం మేరకు తనకు ఇష్టం లేకపోయినా ఎంఎస్ చదవడం కోసం లండన్ వెళ్తాడు. కాలేజీలో చేరిన తొలి రోజు పరిచయం అయిన కడలి (వైష్ణవి చైతన్య)తో అతడికి స్నేహం కుదురుతుంది. అది కాస్తా లివ్ ఇన్ రిలేషన్షిప్ గా మారుతుంది. కానీ ఇక్కడున్నంత కాలం కలిసి ఉందామని.. తర్వాత ఎవరి దారులు వారివే అని ఇద్దరూ ముందే ఒక మాట అనుకుంటారు. ఇలా మొదలైన ప్రయాణం ఎక్కడిదాకా వెళ్లింది.. బంధం ముందుకు సాగేకొద్దీ వీరి మధ్య మొదలైన ఇబ్బందులేంటి.. చివరికి ఇద్దరూ కలిసే ఉన్నారా.. ముందు అనుకున్న మాటకు కట్టుబడి విడిపోయారా.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
‘ఎపిక్’ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. సినిమాల్లో క్లైమాక్సును ప్లాన్ చేస్తాం కానీ, నిజ జీవితంలో ప్లాన్ చేయలేమని.. ప్రాక్టికల్ గా ఏం జరిగితే అది తీసుకుని ముందుకెళ్లిపోవడమే అని.. ఈ కథను కూడా దర్శకుడు ఆదిత్య హాసన్ అలాగే ముగించాడని.. సినిమాలో పాత్రలు- కాన్వర్జేషన్లు కూడా సినిమాటిగ్గా కాకుండా చాలా సహజంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పింది అక్షరాలా నిజమనే అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. ‘‘కథ మరీ ఫ్లాట్ గా వెళ్తోందే.. కొంచెం డ్రామా అవసరమేమో.. కథను క్రేజీగా మారుద్దామా’’ అనిపించినా సరే.. ‘‘అలా వద్దు.. నిజ జీవితంలో ఇలా జరగదు కదా.. ఇలాంటి సందర్భం వస్తే రియల్ గా ఏం జరుగుతుందో అదే తెర మీద చూపిద్దాం.. వాస్తవంగా ఏం మాట్లాడుకుంటారో అలాగే మాట్లాడనిద్దాం’’ అని పనిగట్టుకుని ఆదిత్య హాసన్ ఈ స్క్రిప్టు రాశాడా అనిపిస్తుంది. ఒక అబ్బాయి- అమ్మాయి మధ్య పరిచయం నుంచి మొదలుపెట్టి బ్రేకప్ అయ్యే వరకు మూమెంట్స్ ను చాలా సహజంగా చూపించే ప్రయత్నం చేశాడతను. కానీ వాస్తవ జీవితాల్లో కొన్ని క్యూట్ మూమెంట్స్.. కొన్ని అందమైన కాన్వర్జేషన్లు ఉంటాయి కానీ.. నిజ జీవిత పరిణామాల్లో సినిమాకు అవసరమైనంత డ్రామా ఉండదు కదా? ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఒకరు బాగా అలవాటైపోయాక వారి మధ్య స్వీట్ మూమెంట్స్ ఏముంటాయి? ప్రేమకథల్లో సహజంగా వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏంటో కూడా అంచనా వేయడమూ పెద్ద కష్టం కాదు కదా. కానీ అవన్నీ తెర మీద చూపిస్తే డ్రామా రక్తి కడుతుందా? కట్టదు. ‘ఎపిక్’ సినిమాతో వచ్చిన సమస్య ఇదే. ప్రేమలో పడే వరకు అందంగా కనిపించే జీవితం.. అవతలి వ్యక్తితో అలవాటు పడిపోయాక సాధారణంగా మారిపోయినట్లు ‘ఎపిక్’ సినిమా కూడా ఒక దశ వరకు ఆహ్లాదకరంగా అనిపించి.. ఆ తర్వాత అసహనం కలిగిస్తుంది. చివరికి కొన్ని మూమెంట్స్ గుర్తున్నా.. సినిమాగా ఇది బలమైన ముద్రేమీ వేయదు.
నిజ జీవితంలో ఎక్కువ మంది ఏదో ఒక దశలో ప్రేమలో పడేవాళ్లే కాబట్టి.. మిగతా జానర్లతో పోలిస్తే లవ్ స్టోరీల్లో ప్రేక్షకులు తమను తాము చూసుకుంటారు. వయసుతో సంబంధం లేకుండా ఆ కథలకు బాగా రిలేటవుతారు. ముఖ్యంగా యువ ప్రేక్షకులైతే మరీనూ. అబ్బాయి-అమ్మాయి కలిసి ప్రయాణం మొదలుపెట్టినపుడు.. వారి మధ్య జరిగే క్యూట్ మూమెంట్స్ ప్రేక్షకులకు ముచ్చటగొలుపుతాయి. ఇద్దరూ దగ్గరవుతున్నపుడు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. వారి మధ్య సమస్యలు తలెత్తితే ఇబ్బందిగా అనిపిస్తుంది. విడిపోతుంటే బాధ కలుగుతుంది. ఐతే ఈ ప్రతి అనుభూతినీ ప్రేక్షకులు లోతుగా ఫీలవ్వగలిగితే ఆ ప్రేమకథలు పండుతాయి. ఐతే ‘ఎపిక్’లో ప్రేమజంట మధ్య వచ్చే క్యూట్ మూమెంట్స్.. ఆయా సమయాల్లో వారి మధ్య జరిగే కాన్వర్జేషన్ల వరకు భలేగా అనిపిస్తాయి. అబ్బాయి-అమ్మాయి కలిసిన తొలి రోజే ముద్దు పెట్టేసుకోవడం.. తర్వాత మంచం ఎక్కేయడం లాంటి సీన్లు చూసి అందరినీ ఈ గాటన కట్టేస్తారా? ఫారిన్లో చదువుకునే వాళ్లంతా ఇంతేనా అనే అభ్యంతరాలు వ్యక్తం అయితే కావచ్చు. కానీ ఇక్కడ దర్శకుడు టైటిల్ కిందే ఇది ’నా పాయింట్ ఆఫ్ వ్యూ’ అని చెప్పుకున్నాడు కాబట్టి అందరినీ కలిపి జనరలైజ్ చేసేశాడని అనుకోవాల్సిన పని లేదు. ఆ సన్నివేశాలు.. సంబంధిత సంభాషణల మీద భిన్నాభిప్రాయాలుండొచ్చన్నది పక్కన పెడితే.. ప్రేమకథలో కాన్ఫ్లిక్ట్ రావడానికి ముందు వరకు ఆదిత్య-కడలి పాత్రల మధ్య సన్నివేశాలన్నీ చాలా వరకు అందంగా రూపుదిద్దుకున్నాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య మూమెంట్స్ ను క్యాప్చర్ చేసిన విధానం.. వాళ్లు మాట్లాడుకునే తీరు గమ్మత్తుగా అనిపిస్తాయి. కాబట్టే ‘ఎపిక్’ ఫస్టాఫ్ ఒక జాలీ రైడ్ లాగా అనిపిస్తుంది.
కానీ ఎక్కడైతే సంఘర్షణ మొదలవుతుందో.. అక్కడ్నుంచే ‘ఎపిక్’తో సమస్య మొదలవుతుంది. ప్రేమకథలో సమస్యంటూ మొదలయ్యాక అది ప్రేక్షకులకు ఒకింత అసహనం కలిగించడం మామూలే. కానీ ఇందులో దాని మోతాదు మరీ ఎక్కువైపోయింది. ప్రేమలో పడ్డపుడు గాల్లో తేలినట్లుండే వాతావరణం.. మనుషులు ఒకరికొకరు అలవాటు పడిపోయి సాధారణంగా ప్రవర్తించడం మొదలుపెట్టాక ఎంత మామూలైపోతుందో సహజంగానే చూపించే ప్రయత్నం చేశాడు ఆదిత్య హాసన్. కానీ ఇక్కడ సన్నివేశాలు-సంభాషణలను మరీ సాధారణంగా సాగదీసినట్లు అనిపించడంతో అంతకుముందులా ఈ కాన్వర్జేషన్లు అలరించవు. కొన్ని సీన్లు కొంచెం సిల్లీగా.. సాగతీతగా అనిపిస్తాయి. అమ్మాయిల పీరియడ్స్.. మూడ్ స్వింగ్స్ లాంటి వాటి గురించి చర్చ ఇందుకు ఉదాహరణ. ఇలాంటివి తెరమీద చూపించకూడదు.. వీటి గురించి మాట్లాడకూడదు అని కాదు. కానీ మేం చాలా పరిణతితో వీటి గురించి చర్చిస్తున్నాం అని కాకుండా.. ఆర్గానిగ్గా- సింపుల్ గా డిస్కషన్ ఉంటే బాగుండేది. ప్రేమికుల మధ్య ఘర్షణ.. ఎడబాటు ప్రేక్షకులకు తియ్యటి బాధతో గుండె భారమవ్వాల్సింది పోయి.. తొందరగా ఏదో ఒకటి తేల్చకుండా ఈ వ్యవహారాన్ని ఎందుకింత లాగుతున్నారు.. తెర మీద అంత గొప్పగా ఏం జరిగిపోతోందని ఆ బీజీఎం అంతలా వాయించేస్తున్నారు అనే ఫీలింగ్ కలుగుతుందంటే ‘ఎపిక్’ చివరికి ఏ స్థితికి చేరుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆఖర్లో ఎపిక్ ‘ఫైనల్ సెమిస్టర్’ అంటూ పార్ట్-2కు లీడ్ ఇస్తుంటే.. ఎవరైనా ఎగ్జైట్ అయ్యేవాళ్లు ఉన్నారంటే ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది.
నటీనటులు:
‘బేబి’ లాంటి బలమైన ఇంపాక్ట్ వేసిన సినిమా తర్వాత.. అందులో కలిసి నటించిన లీడ్ పెయిర్ ఇంకో సినిమాలో భిన్న పాత్రలతో మెప్పించడం అంత తేలిక కాదు. ఐతే ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య ‘బేబి’ నీడ నుంచి బయటికొచ్చి ఆదిత్య-కడలి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. పెర్ఫామెన్స్ విషయంలో ఎక్కడా ముందు సినిమా ఛాయలు కనిపించకుండా ఇద్దరూ ఈ పాత్రలను పండించారు. చిన్న టౌన్ నుంచి వచ్చిన ఓ కుర్రాడు లండన్లో అడుగుపెడితే.. ఒక అమ్మాయితో సాంగత్యం ఏర్పడితే ఎలా మాట్లాడతాడో.. ఎలా ప్రవర్తిస్తాడో.. అచ్చుగుద్దినట్లు తన నటనలో చూపించాడు ఆనంద్. తన హావభావాలు చాలా సహజంగా అనిపిస్తాయి. ఆనంద్ కు భిన్నమైన మనస్తత్వం ఉన్న మోడర్న్ అమ్మాయి పాత్రలో వైష్ణవి కూడా చాలా కన్విన్సింగ్ గా నటించింది. తన ముందు చిత్రాలు అన్నింటి కంటే ఇందులో నటన పరంగా ఎంతో మార్పు - పరిణతి కనిపిస్తాయి. క్యారెక్టర్ కి తగ్గట్లు బోల్డుగానూ ఆమె కనిపించింది. హీరో తల్లిదండ్రులుగా శివాజీ - వాసుకి 'నైంటీస్ మిడిల్ క్లాస్'లో తమకు అలవాటైన పాత్రలను చక్కగా చేసుకుపోయారు. సహాయ పాత్రల్లో కళ్యాణ్ శంకర్.. శ్రీనివాస్ గవిరెడ్డి నవ్వించారు. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలు లేవు.
సాంకేతిక వర్గం:
ఎపిక్ కోసం హేషమ్ అబ్దుల్ వాహబ్ మరీ వినాలనిపించే సాంగ్స్ ఏమి ఇవ్వలేదు కానీ.. సినిమాను నడిపించే పాటలు అందించాడు. సన్నివేశాలకు సూటయ్యే.. ఫీల్ పెంచే నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు అబ్దుల్. కొన్నిచోట్ల మాత్రం బీజీఎం లౌడ్ అనిపిస్తుంది. కెమెరామెన్ అజీమ్ మహమ్మద్ విజువల్స్ ఆహ్లాదభరితంగా అనిపిస్తాయి. యూకే బ్యాక్ డ్రాప్ కూడా సన్నివేశాలకు కొంత అందం తెచ్చింది. సితార వారి నిర్మాణ విలువలకు ఏమి ఢోకా లేదు. ఈ కథకు అవసరం అయిన మేర ఖర్చు పెట్టారు. ఇక ఆదిత్య హాసన్ రచయితగా.. దర్శకుడిగా తన మీద పెట్టుకున్న అంచనాలను కొంతమేరే అందుకున్నాడు. కొన్ని సీన్లు అందంగా రాసి.. చక్కటి కాన్వర్జేషన్లతో నడిపించిన అతను.. కథా కథనాల పరంగా సగటు లవ్ స్టోరీలను దాటి ఆశ్చర్యపరచలేకపోయాడు. ముఖ్యంగా లవ్ స్టోరీలో కాన్ఫ్లిక్ట్.. ఆ తర్వాతి పరిణామాలను రొటీన్ గా రాసుకుని.. కథనాన్ని మరీ స్లోగా నడిపించడం ద్వారా నిరాశకు గురిచేశాడు ఆదిత్య.
చివరగా: ఎపిక్.. తియ్యగా మొదలై.. చేదుగా ముగిసి..
రేటింగ్ - 2.25/5
