Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

యూత్‌లో ఒక కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సినిమా ఈ నగరానికి ఏమైంది.

By:  Tupaki Desk   |   3 Nov 2026 5:00 PM IST
ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ
X

యూత్‌లో ఒక కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సినిమా ఈ నగరానికి ఏమైంది. ఇప్పుడు అదే మేజిక్ ను ఏడేళ్ల తరువాత మళ్లీ రిపీట్ చేయడానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ తన పాత గ్యాంగ్‌తో కలిసి సీక్వెల్ తో వస్తున్నాడు. లేటెస్ట్ గా 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మొదటి భాగం ఇచ్చిన హైప్ దృష్ట్యా ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ట్రైలర్ చూస్తుంటే ఆ పాత వైబ్ ను ఎంతవరకు మ్యాచ్ చేశారనే విషయంపై క్లారిటీ వచ్చింది.

ముప్పై ఏళ్లు వచ్చినా సెటిల్ అవ్వని కుర్రాళ్ల జీవితాలు, వాళ్ల మధ్య వచ్చే ఈగో క్లాషెస్ చుట్టూ కథను చాలా నేచురల్ గా మొదలుపెట్టారు. వివేక్ తన కొత్త సినిమా స్క్రిప్ట్ తో రెడీగా ఉంటే, కౌశిక్ డేట్స్ కోసం పడే పాట్లు ఫన్నీగా అనిపిస్తున్నాయి. బ్రూటల్ సర్వైవల్ స్టోరీ అంటూ వివేక్ బిల్డప్ ఇవ్వడం, దాన్ని మిగతా ఫ్రెండ్స్ లైట్ తీసుకోవడం చూస్తుంటే తరుణ్ మార్క్ డైలాగ్ రైటింగ్ క్లిక్కయ్యేలా ఉంది. పాత్రల మధ్య రాసుకున్న కాన్వర్సేషన్స్ నేటి జనరేషన్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

సినిమా తీయడం కోసం వీళ్లంతా వేసే ట్రిప్, అక్కడ ఎదురయ్యే ఊహించని సమస్యలు ట్రైలర్ లో మెయిన్ హైలైట్ గా నిలిచాయి. అడవిలో ఎలుగుబంటి దాడి సీన్, పబ్‌లో జరిగే కొట్లాటలు ఈసారి హంగామా కాస్త గట్టిగానే ఉండబోతోందని చూపిస్తున్నాయి. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను టైమింగ్ ఎప్పటిలాగే క్లిక్ అయింది. కొత్తగా గ్యాంగ్‌లో కనిపించిన శ్రీనాథ్ మాగంటి కూడా ఆ ఫ్రెండ్షిప్ గ్రూప్‌లో చక్కగా ఒదిగిపోయిన ఫీలింగ్ కలిగించాడు.

సినిమాలంటే పిచ్చి ఉన్న అమ్మాయిగా శివాత్మిక రాజశేఖర్ క్యారెక్టర్ కాస్త ఇంట్రెస్టింగ్ గా తోస్తోంది. ఆమె తండ్రి పాత్ర వేసే ప్లాన్స్ కథకు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాయో చూడాలి. దీనికితోడు సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు బిగ్గెస్ట్ అసెట్ గా మారింది. ఆయన కంపోజ్ చేసిన రాక్, ర్యాప్ బిట్స్ ప్రతి సీన్ లోని ఎనర్జీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. సౌండ్ డిజైన్ చాలా ట్రెండీగా కుదిరింది.

అయితే ఈ ట్రైలర్ రొటీన్ స్పూఫ్ కామెడీల వైపు వెళ్లకుండా తన ఒరిజినల్ రూట్స్ ను నమ్ముకోవడం మంచి విషయం. కొన్ని చోట్ల సీన్లు కాస్త గందరగోళంగా అనిపించినప్పటికీ, ఫ్రెండ్స్ మధ్య ఉండే సహజమైన సంభాషణలు దాన్ని కవర్ చేశాయి. ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూనే యూత్ మెచ్చే సరదా మూమెంట్స్ ను సమపాళ్లలో మిక్స్ చేశారు. విజువల్స్ పరంగా ప్రొడక్షన్ వేల్యూస్ మొదటి పార్ట్ కంటే మరింత రిచ్ గా కనిపిస్తున్నాయి.

ఈసారు ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్ యూత్ ఆడియన్స్ కు కావాల్సినంత కిక్ ఇస్తోంది. మొదటి భాగం అందించిన కల్ట్ ఫీల్ ను తెరపై ఎంతవరకు కొనసాగిస్తారనేది సినిమా సక్సెస్ కు కీలకం కానుంది. నవంబర్ 19న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్రెండ్షిప్ వైబ్ ను మళ్లీ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.