'ఈఎన్ఈ రిపీట్' మూవీ రివ్యూ
By: Tupaki Desk | 19 Nov 2026 9:00 AM IST‘ఈఎన్ఈ రిపీట్’ మూవీ రివ్యూ
నటీనటులు: విశ్వక్సేన్- అభినవ్ గోమఠం- వెంకటేష్ కాకుమాను- శ్రీనాథ్ మాగంటి- శివాత్మిక రాజశేఖర్- అనీషా ఆంబ్రోస్- రామ్ రెడ్డి- కరుణ్ కుమార్- జీవన్- గీత భాస్కర్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: ఏజే ఆరోన్
నిర్మాతలు: సృజన్ యరబోలు- సందీప్ నాగిరెడ్డి
రచన-దర్శకత్వం: తరుణ్ భాస్కర్
‘పెళ్ళిచూపులు’తో సెన్సేషన్ క్రియేట్ చేశాక తరుణ్ భాస్కర్ తీసిన ‘ఈ నగరానికి ఏమైంది’ రిలీజ్ టైంలో ఓ మోస్తరుగా ఆడింది. కానీ తర్వాత అదొక కల్ట్ మూవీలా మారిపోయింది. యువత ఆ సినిమాను భలేగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఈ స్పందన చూసే తరుణ్ భాస్కర్ అండ్ టీం.. సీక్వెల్ మొదలుపెట్టింది గత ఏడాది. ‘ఈఎన్ఈ రిపీట్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈఎన్ఈ గ్యాంగ్ మరోసారి మురిపించిందా? తరుణ్ భాస్కర్ అంచనాలను అందుకున్నాడా? చూద్దాం పదండి.
కథ:
వివేక్ (విశ్వక్సేన్).. తన మిత్రులైన కౌశిక్ (అభినవ్ గోమఠం).. కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి.. ఉపేందర్ (వెంకటేష్ కాకుమాను) సాయంతో తీసిన సినిమా డిజాస్టర్ అయి వీళ్లందరి జీవితాలను డోలాయమానంలోకి నెడుతుంది. ఈ సినిమా మిగిల్చిన అప్పులు తీర్చడానికి తన ప్రొడ్యూసర్ నడిపే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఉద్యోగానికి కుదురుతాడు వివేక్. మిగతా మిత్రులు ఎవరి పనుల్లో వాళ్లుంటారు. ఇలా ఈ నలుగురి జీవితాలు నిస్సారంగా సాగిపోతున్న టైంలో ఉపేందర్ చెల్లెలు కీర్తన (శివాత్మిక రాజశేఖర్)కు కుదిరిన పెళ్లి ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ వల్ల చెడిపోతుంది. దీంతో ఈ నలుగురూ అవమానపడాల్సి వస్తుంది. దీంతో కీర్తనను ఇష్టపడే కౌశిక్ తో తన పెళ్లి చేయడమే కాక.. తామేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో వివేక్ అండ్ గ్యాంగ్ ఒక సవాలును స్వీకరిస్తుంది. ఆ ఛాలెంజ్ ఏంటి.. దాన్ని వాళ్లు ఎలా పూర్తి చేశారు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
కొన్నిసార్లు మామూలుగా చేసే పనులు కూడా అనుకోకుండా అద్భుతాలుగా మారిపోతుంటాయి. ‘ఈ నగరానికి ఏమైంది’ తీస్తున్నపుడు తరుణ్ భాస్కర్ అండ్ టీంకు తామేదో అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నట్లు.. మొదటిసారి థియేటర్లలో ఆ సినిమా చూసినపుడు ప్రేక్షకులకు తామొక అద్భుతమైన సినిమాను వీక్షిస్తున్నట్లు అనిపించి ఉండకపోవచ్చు. కానీ కాల క్రమంలో మాత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ ఒక అద్భుతమే అయింది. ఫ్రెండ్స్ గ్యాంగుతో కలిసి వేసిన టూర్ ఆ సమయానికి ఏమీ అనిపించకపోయినా.. తర్వాత గుర్తు చేసుకుంటే ప్రతి అనుభవం అద్భుత జ్ఞాపకంగా మారినట్లు.. ఒక నోస్టాల్జిక్ ఫీలింగ్ కలిగించే సినిమా అది. ఇలాంటి కల్ట్ స్టేటస్ అందుకున్న కథలను టచ్ చేసి.. మళ్లీ అంత గొప్ప అనుభూతిని అందించడం అన్నది అంత తేలికైన విషయం కాదు. ఐతే సీక్వెల్ తో ఏదో క్యాష్ చేసుకుందాం అనే తరహాలో కాకుండా.. ఈఎన్ఈ గ్యాంగ్ తో ప్రేక్షకులను మరోసారి ఎంటర్టైన్ చేయడానికి తరుణ్ భాస్కర్ అండ్ టీం సిన్సియర్ ఎఫర్టే పెట్టింది. కానీ ఒక మోస్తరుగా నవ్వించి.. కొంత మేర ఎమోషనల్ గానూ కదిలించిన ఈ సీక్వెల్.. ‘ఈ నగరానికి ఏమైంది’లా మనసుల్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందా అన్నది మాత్రం డౌటే. బోర్ కొట్టకుండా టైంపాస్ అయితే చేయించింది కానీ.. ఫస్ట్ పార్ట్ లో ఉన్న నేచురల్ ఫ్లో మాత్రం ఇందులో మిస్సయింది.
వివేక్ అండ్ గ్యాంగ్ కాలేజీ రోజుల్లో చేసే అల్లరితో మొదలుపెట్టి.. వీళ్లంతా కలిసి ఒక సినిమాను పూర్తి చేసే వరకు ఒక క్రేజీ రైడ్ లాగా నడుస్తుంది ‘ఈ నగరానికి ఏమైంది’. దానికి ఒక ప్రాపర్ సీక్వెల్ లాగా.. ఆ కథ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ‘ఈఎన్ఈ రిపీట్’ మొదలవుతుంది. వీళ్లు తీసిన సినిమా డిజాస్టర్ అయి అందరి జీవితాలు అస్తవ్యస్తంగా మారాక.. ఇంకో సినిమా కోసం వీళ్లందరూ రీ యూనియన్ అయితే ఏంటి పరిస్థితి అనే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ కథలోకి ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయడానికి తరుణ్ భాస్కర్ కొంచెం టైం తీసుకున్నాడు. పాత్రలను తిరిగి పరిచయం చేయడంతో పాటు వాళ్లందరినీ ఒక చోటికి తీసుకురావడానికే ఇదంతా అన్నమాట. అక్కడిదాకా కొంచెం నెమ్మదిగా నడిచే ‘ఈఎన్ఈ రిపీట్’ గ్యాంగ్ ఒక చోటికి చేరాక ఫ్లో అందుకుంటుంది. మళ్లీ సినిమా తీయడం అంటే ఏదో ఆషామాషీగా కాకుండా.. దానికో బలమైన కారణాన్ని క్రియేట్ చేసి.. ఒక సీరియస్ ఇష్యూతో దానికి ముడిపెట్టి ఈ కథకు బలమైన లాక్ వేశాడు తరుణ్. అభినవ్ గోమఠం కనిపించిన అదిరిపోయే కామెడీ టైమింగ్ తో.. ప్రతిసారీ పంచుల వర్షం కురిపిస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాడు. ఉప్పి పాత్ర సైతం బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. చెంపదెబ్బలు కొట్టించుకుంటూ రోజుకు లక్ష రూపాయలు పుచ్చుకునే ఆర్టిస్టుగా అభినవ్.. ఫిలిం మేకర్ల పైత్యాన్ని భరిస్తూ ఎడిటింగ్ రూంలో హింస అనుభవంచే ఎడిటర్ గా వెంకటేష్ కాకుమాను తమదైన శైలిలో ఎంటర్టైన్ చేశారు. వీళ్లిద్దరి ఇంట్రడక్షన్ ఎపిసోడ్లు భలేగా పేలాయి. ఇక ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం మళ్లీ ఒక చోట కలిసిన దగ్గర్నుంచి ఎంటర్టైన్మెంట్ కు ఢోకా లేకపోయింది. విరామం ముంగిట కథ సీరియస్ అయ్యే చోట సినిమాలో ప్రేక్షకులు సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది ‘ఈఎన్ఈ రిపీట్’. మొత్తంగా ఫస్టాఫ్ అయితే ‘ఈఎన్ఈ’ మ్యాజిక్ ‘రిపీట్’ అనే ఫీలింగే కలుగుతుంది.
ఐతే సినిమా తీయడం మీద హీరో అండ్ గ్యాంగ్ స్వీకరించే సవాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కానీ.. ఆ సినిమా తీస్తూ చేసే హంగామా మాత్రం అనుకున్నంత కిక్కు ఇవ్వలేకపోయింది. కథ థాయిలాండుకి షిఫ్టయ్యాక కథ మరీ నాన్ సీరియస్ గా తయారై ఆసక్తి సన్నగిల్లిపోతుంది. అక్కడక్కడా జోకులు పేలాయి.. కామెడీ వర్కవుట్ అయింది కానీ.. మరీ సిల్లీగా అనిపించే సన్నివేశాల వల్ల కథను సీరియస్ గా తీసుకోవడం కష్టమవుతుంది. వివేక్ అండ్ గ్యాంగ్ అల్లరి కాస్తా ఒక దశ తర్వాత గందరగోళంగా తయారై.. అసహనానికి దారి తీస్తుంది. ఐతే ఉన్నట్లుండి కామెడీ నుంచి ఎమోషన్ వైపు మళ్లే ‘ఈఎన్ఈ రిపీట్’ ముగింపు సన్నివేశాల్లో మాత్రం మెప్పించింది. మన జీవితాలపై సినిమా ప్రభావాన్ని.. సినిమా ప్రాధాన్యాన్ని తెలియజెప్పే సన్నివేశాలను తరుణ్ భాస్కర్ హార్ట్ టచింగ్ గా రాశాడు.. తీశాడు. కానీ ఆ ఎమోషన్ మరింత పండడానికి అవసరమైన పునాది మాత్రం అతను సరిగా వేయలేదనిపిస్తుంది. అది జరిగి ఉంటే ‘ఈఎన్ఈ రిపీట్’ చాన్నాళ్లు మనసుల్లో నిలిచిపోయే సినిమా అయ్యుండేది. కొందరు పేరున్న దర్శకుల క్యామియోలతో ముడిపడ్డ తెర వెనుక ముచ్చట్లతో సినిమాను ఫన్ నోట్ తో ముగించి చివర్లో తరుణ్ మంచి ఫీలింగే ఇచ్చాడు. అతను ఎంటర్టైన్ చేశాడు కానీ.. ఒక కంప్లీట్ ఫిలిం ఇవ్వలేదనే అసంతృప్తి మాత్రం ఆఖర్లో కలుగుతుంది. ‘ఈ నగరానికి ఏమైంది’ని ఇష్టపడ్డవాళ్లు ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడ్డానికి ఇది ఓకే.
నటీనటులు:
‘ఈ నగరానికి ఏమైంది’ వైబ్ ను కంటిన్యూ చేయడంలో పాత ఆర్టిస్టులు ఎవ్వరూ ఇబ్బంది పడలేదు. వివేక్ పాత్రలో విశ్వక్సేన్ మరోసారి మెప్పించాడు. ఆ క్యారెక్టర్ తాలూకు యాటిట్యూడ్.. బాడీ లాంగ్వేజ్ కంటిన్యూ చేస్తూ అతను స్టైలిష్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అభినవ్ గోమటం.. విశ్వక్ ను డామినేట్ చేసేలా.. తనదే లీడ్ క్యారెక్టర్ అనే రేంజిలో పెర్ఫామెన్స్ ఇచ్చాడు. తన ఫ్లో మామూలుగా లేదు. కామెడీ టైమింగ్ అదిరిపోయింది. కొన్ని సీన్లలో మొత్తం అందరి దృష్టినీ తన వైపు తిప్పేసుకున్నాడు. వెంకటేష్ కాకుమాను ఫ్రెండ్స్ గ్యాంగుతో పడలేక ఫ్రస్టేట్ అవుతూ ఉండే పాత్రలో సులువుగా ఒదిగిపోయాడు. కార్తీక్ పాత్రలో సుశాంత్ ను రీప్లేస్ చేసిన శ్రీనాథ్ మాగంటి మాత్రం ఈ సినిమాలో అంతగా సింక్ కాలేకపోయాడు. అతను బాగా చేయలేదని కాదు కానీ.. సుశాంత్ తో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ తనతో కలగడం కష్టమే. తన పాత్రను కూడా సరిగా తీర్చిదిద్దకపోవడం మైనస్ అయింది. శివాత్మిక రాజశేఖర్ లుక్స్ పరంగా యావరేజ్ అనిపిస్తుంది కానీ.. తన నటన ఆకట్టుకుంటుంది. అనీషా ఆంబ్రోస్ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. తన పాత్ర.. నటన మామూలుగా అనిపిస్తాయి. మహేష్ భాస్కర్ నవ్వించాడు. రామ్ రెడ్డి కథలో కీలక పాత్రలో మెప్పించాడు. ఆయనకు ఈ సినిమా తర్వాత అవకాశాలు పెరుగుతాయి. దర్శకుడు కరుణ్ కుమార్ కూడా ఆకట్టుకున్నాడు. తాళ్ళూరి రామేశ్వరి.. జీవన్.. గీత భాస్కర్.. చిన్న చిన్న పాత్రల్లో ఓకే అనిపించారు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘ఈ నగరానికి ఏమైంది’కి వంకలు పెట్టడానికి లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమాను రిచ్ గా తీశారు. ఆరోన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ కలర్ ఫుల్ గా సాగాయి. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మరోసారి మంచి ఊపునిచ్చే బీజీఎం ఇచ్చాడు. తన స్కోర్ సినిమాకు పెద్ద అసెటే. కాకపోతే ‘ఈ నగరానికి ఏమైంది’ బీజీఎం బిట్స్ ఏవీ ఇందులో వాడకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది. కొత్తగా ఆ స్టయిల్లో సిగ్నేచర్ థీమ్స్ కూడా ఇందులో మిస్సయ్యాయి. సినిమాలో ఉన్న బిట్ సాంగ్స్ బాగానే సాగినా.. ‘ఆగి ఆగి సాగే..’ అంటే మంచి మెలోడీ లేకపోవడం మైనస్. ‘ఈ నగరానికి ఏమైంది’కి ఇది ఫోర్స్డ్ సీక్వెల్ అనిపించకుండా తరుణ్ భాస్కర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైనే ఎంచుకున్నాడు. కామెడీ.. ఎమోషన్లు పండేలా ఈ కథకు బలమైన పునాది వేశాడు. కొన్ని కామెడీ సిచువేషన్లు.. వన్ లైనర్స్ విషయంలో తన మార్కు చూపించాడు. కాకపోతే సినిమా మొత్తం ఒకటే ఫ్లోలో నడిపించలేకపోయాడు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో మరీ నాన్ సీరియస్ గా.. తలా తోకా లేకుండా సాగే సన్నివేశాల వల్ల సినిమా గాడి తప్పింది. కానీ చివర్లో ఇచ్చిన ఫస్టాఫ్ లో కొన్ని ఎపిసోడ్లు.. ఈ కథకు ఇచ్చిన ఫినిషింగ్ టచ్ తో తరుణ్ మెప్పించాడు. అతను తన మీద ఉన్న అంచనాలను అందుకోలేదు కానీ.. నాట్ బ్యాడ్ అనిపించాడు.
చివరగా: ఈఎన్ఈ రిపీట్.. టైంపాస్ ఎంటర్టైనర్
రేటింగ్ - 3/5
