Begin typing your search above and press return to search.

OGతో ఓమి భౌ ఢీ అంటే ఢీ

ఇటీవ‌ల 'టైగ‌ర్ 3'లో విలన్‌గా నటించిన ఇమ్రాన్ హ‌ష్మి ఓజీలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషిస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేపుతోంది

By:  Tupaki Desk   |   24 March 2024 9:49 AM GMT
OGతో ఓమి భౌ ఢీ అంటే ఢీ
X

ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క‌థానాయ‌కుడిగా దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా చిత్రం OG. ఓజస్ గంభీర OG అనే క్రూరమైన టెర్రరిస్ట్‌గా ఇందులో ప‌వ‌న్ న‌టిస్తున్నారు. అతడు ఒక క్రైమ్ బాస్ క‌థ‌ను ముగించడానికి పదేళ్లు అదృశ్యమైన తర్వాత ముంబైకి తిరిగి వస్తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌దే ఈ సినిమా క‌థాంశం. ఇంత‌కుముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ లుక్ ని రిలీజ్ చేయ‌గా దానికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఇందులో భీక‌ర‌మైన క్రిమినల్ పాత్ర‌లో ఇమ్రాన్ హ‌ష్మి న‌టిస్తున్నాడు.

ఇటీవ‌ల 'టైగ‌ర్ 3'లో విలన్‌గా నటించిన ఇమ్రాన్ హ‌ష్మి ఓజీలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషిస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేపుతోంది. నిర్మాతలు ఈ చిత్రం నుండి ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్‌ను ఇప్పుడు విడుదల చేశారు. ఈరోజు ఇమ్రాన్ పుట్టినరోజును పుర‌స్క‌రించుకుని లుక్‌ని రిలీజ్ చేయ‌గా వైర‌ల్ గా దూసుకెళుతోంది. పోస్ట‌ర్‌లో ఇమ్రాన్ హ‌ష్మి పాత్ర పేరునే కాకుండా అతడి రూపాన్ని కూడా రివీల్ చేసారు.

ఈ చిత్రంలో ఇమ్రాన్ ఓమి భౌ అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. పోస్టర్‌లో అతడి కనుబొమ్మపై తెగిన కండ‌రానికి కుట్లు వేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ మచ్చ కాకుండా గుబురు గడ్డం పొడవాటి గిర‌జాల జుట్టుతో అత‌డు భీక‌రంగా క‌నిపిస్తున్నాడు. 'హ్యాపీ బర్త్‌డే ఓమి భౌ' అని ఈ పోస్టర్‌లో రాసి ఉంది. అందులో అతడు స్మోకింగ్ చేస్తూ క‌నిపించాడు. ''హ్యాపీ బర్త్ డే డెడ్‌లియెస్ట్ OMI BHAU....ఓజీతో విద్యుద్దీకరణ జరిగే ఘర్షణను ఊహించలేము''అని నిర్మాత‌ డివివి దాన‌య్య త‌న సోష‌ల్ మీడియాలో రాసారు.

ఈ చిత్రం నుండి ఇమ్రాన్ ఫస్ట్ లుక్ రాగానే దానిని వైర‌ల్ గా షేర్ చేస్తూ ప‌వ‌న్ అభిమానులు ఆనందంగా కనిపించారు. తెరపై పవన్‌తో ఇమ్రాన్ నువ్వా నేనా? అంటూ హోరాహోరీ సాగిస్తాడ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ ఇద్ద‌రి ఫేసాఫ్ వినాశనం సృష్టిస్తుంది! అని ఒక అభిమాని ఎగ్జ‌యిటింగ్ గా వ్యాఖ్యానించ‌గా, మరొకరు ఇలా రాసారు. ''ఈ క్లాష్ చూడటానికి పిచ్చిగా ఎదురుచూస్తున్నాను. #సుజీత్ అన్న ఏదో పెద్దగా ఎక్సైటింగ్ ప్లాన్ చేస్తున్నట్లుగా ఉంది. ఇమ్రాన్ లుక్ అదిరింది. (చాలా బాగుంది) హీరో - విలన్ ఇద్దరికీ బెస్ట్ లుక్స్'' అని రాసారు.

కొంతమంది అభిమానులు ఫస్ట్ లుక్‌లో ఇమ్రాన్ లైటర్‌పై రాసిన అక్ష‌రాల‌ను జూమ్ ఇన్ చేసి డీకోడ్ చేయడానికి ప్రయత్నించారు. కొందరు గూగుల్ సహాయంతో అది 'ఫెరోసియస్ హైనా' అని రాసి ఉన్న‌ట్టు క‌నిపెట్టారు.

ఇమ్రాన్ తెలుగు అరంగేట్రం:

ఇమ్రాన్ హ‌ష్మి ఇప్ప‌టివ‌ర‌కూ హిందీ చిత్ర‌సీమ‌లోనే న‌టించాడు. ఇప్పుడు ప‌వ‌న్ సినిమాతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సందర్భంగా వారు అతడిని OG అని పిలుస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, తేజ్ సప్రు, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ త‌దిత‌రులు నటిస్తున్నారు. థమన్ ఎస్.ఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నూతన దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహించ‌నున్న‌ G2 (గూఢచారి 2)లో నటించడానికి కూడా ఇమ్రాన్ తన అనుమతినిచ్చాడు. ఈ చిత్రంలో అడివి శేష్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నాడు. 2018 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గూఢచారి చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సీక్వెల్‌కి సంబంధించిన ఇత‌ర నటీనటులు, సిబ్బందిని ఇంకా వెల్లడించలేదు. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి.