ఇమ్రాన్ హష్మీ మాటలతో పవన్ ఫ్యాన్స్ నిరాశ
ఇదిలా ఉంటే ఇటీవల గ్రౌండ్ జీరో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇమ్రాన్ హష్మీ ఓజి గురించి ఇచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ గుండెల్లో బాంబుని పేల్చింది.
By: Tupaki Desk | 4 May 2025 9:20 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి హరిహర వీరమల్లు కాగా, రెండోది ఓజి. ఈ రెండింటిలో ముందుగా వచ్చే సినిమా వీరమల్లు అని అందరికీ తెలిసినప్పటికీ పవన్ ఫ్యాన్స్ మాత్రం సమయం సందర్భం లేకుండా ఓజి ఓజి అంటూ దాని గురించే అడుగుతూ వస్తున్నారు.
అయితే అసలు మే లో రిలీజ్ అని చెప్పిన హరిహర వీరమల్లు రిలీజ్ ఎప్పుడనే విషయంలోనే క్లారిటీ లేకపోతే ఇక ఎప్పుడొస్తుందో తెలియని ఓజి గురించి ఫ్యాన్స్ అస్తమానం అడగడమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. వాస్తవానికి ఓజి సెప్టెంబర్ లో వస్తుందన్నారు కానీ ఈ విషయంలో మేకర్స్ మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల గ్రౌండ్ జీరో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇమ్రాన్ హష్మీ ఓజి గురించి ఇచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ గుండెల్లో బాంబుని పేల్చింది. ఇమ్రాన్ హష్మీ ఓజిలో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్ లో ఒక్క సీన్ ను కూడా డైరెక్టర్ సుజిత్ షూట్ చేయలేదని ఆయన చెప్పాడు.
మరో నెల రెండు నెలల్లో సుజిత్ ఆ సీన్స్ ను తీసే అవకాశముందని ఇమ్రాన్ హష్మీ చెప్పడం చూస్తుంటే ఓజి షూటింగ్ చాలానే పెండింగ్ ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఇమ్రాన్ హష్మీ లాంటి కీలక పాత్రతోనే పవన్ కాంబినేషన్ సీన్స్ తీయలేదంటే ఇక ఆ సినిమా షూటింగ్ పూర్తవడానికి, దాని పోస్ట్ ప్రొడక్షన్ కు, ఆ తర్వాత సెన్సార్, ప్రమోషన్స్ కు చాలానే టైమ్ పడుతుంది.
పోనీ ఇమ్రాన్ కు ఓజిలో తక్కువ ప్రాధాన్యత ఉన్న క్యారెక్టరా అంటే కాదు. ఆయన సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. పవన్ సినిమాలో విలన్ క్యారెక్టర్ అంటే ఆ పాత్ర హీరో పాత్రకు సమానంగా ఉంటుంది. ఇమ్రాన్ హష్మీ చెప్పిన ఈ మాటలతో పవన్ ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగినంత పనైంది. ప్రియాంక అరుళ్‌మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా, తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
