ఎంపురాన్ నిర్మాతపై ఈడీ దాడులు.. రివెంజా?
మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఎంపురాన్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 4 April 2025 3:16 PM ISTమాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఎంపురాన్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాను నిర్మించిన గోకులం గోపాలన్ చిట్ ఫండ్ కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. కేరళతోపాటు చెన్నై కోడంబాక్కంలోని గోపాలన్ చిట్ ఫండ్ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.
అయితే గోకులం చిట్ ఫండ్ కంపెనీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. 2017లో ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహించి, రూ.1000 కోట్లకుపైగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపించింది. ఇప్పుడు FEMA కేసులో ఈడీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిధుల మళ్లింపులు లేదా మనీలాండరింగ్ సహా ఏదైనా చట్టవిరుద్ధ ఆర్థిక లావాదేవీల్లో కంపెనీ ప్రమేయం ఉందా అన్న విషయాన్ని ధృవీకరించడంపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు, ఎంపురాన్ మూవీ వివాదంలో చిక్కుకున్న వేళ.. కేంద్రం ప్రతీకార చర్యగా ఈడీతో దాడులు చేయిస్తుందని ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
గోకులం గోపాలన్ రీసెంట్ గా నిర్మించిన ఎంపురాన్ మూవీ మార్చి 27వ తేదీన రిలీజ్ అయింది. అయితే సినిమాలో 2002లో జరిగిన గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్లకు సంబంధించిన సీన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని వివాదం నెలకొంది. దీంతో మేకర్స్.. సెన్సార్ బోర్డును సంప్రదించారు.
అప్పుడు సెన్సార్ బోర్డు అధికారులు కొన్ని కోతలు విధించగా.. ఇప్పుడు ట్రిమ్ వెర్షన్ అందుబాటులో ఉంది. కానీ వివాదం మాత్రం సాగుతూనే ఉంది. రీసెంట్ గా రాజ్యసభకు సినిమా మ్యాటర్ చేరింది. దీంతో మాలీవుడ్ యాక్టర్ కేంద్రమంత్రి సురేష్ గోపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు వ్యాఖ్యలు చేస్తూ కొందరు సభ్యులపై మండిపడ్డారు.
ఇప్పుడు శుక్రవారం ఈడీ.. గోపాలన్ కు చెందిన ఐదు కార్యాలయాల్లో దాడులు చేపట్టింది. దీంతో ఎంపురాన్ మూవీ వివాదానికి ఈడీ దాడులకు సంబంధం ఉందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులను ఈడీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంలో చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
