ప్లాప్ సినిమాకి సీక్వెల్ ఇదేం విచిత్రం!
ఇప్పుడీ నిర్ణయం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. `ది టెర్రర్ రిపోర్ట్` పేరుతో ఈ చిత్రాన్ని పట్టాలెక్కిం చాలని సన్నాహాలు చేస్తున్నారు.
By: Srikanth Kontham | 26 March 2026 2:00 PM IST2002 గోద్రా రైలు దుర్ఘటన ఆధారంగా `ది సబర్మతి రిపోర్ట్` అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. విక్రాంత్ మాసే, రాశీఖన్నా , రిద్దీ డోగ్రా ప్రధాన పాత్రల్లో దీరజ్ సర్నా తెరకెక్కించిన చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైనా వాటిన అందుకోవడంలో మాత్రం విఫలమైంది. బాలాజీ మోషన్ పిక్చర్స్-వికిర్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ లో ఈ చిత్రం 30 కోట్లను మాత్రమే రికవరీ చేసింది. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేదు. అయితే ఇప్పుడీ చిత్రానికి నిర్మాత ఏక్తా కపూర్ సీక్వెల్ ప్రకటించి షాక్ ఇచ్చింది.
ఇప్పుడీ నిర్ణయం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. `ది టెర్రర్ రిపోర్ట్` పేరుతో ఈ చిత్రాన్ని పట్టాలెక్కిం చాలని సన్నాహాలు చేస్తున్నారు. `ది సబర్మతి రిపోర్ట్` చిత్రం రిలీజ్ కు ముందు భారీ హైప్ క్రియేట్ అయింది. రిలీజ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల ప్రశంసలు దక్కాయి. అనేక రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు లభించింది. కొన్ని రాష్ట్రాల్లో టికెట్ ధరలు కూడా పెంచి రిలీజ్ చేసారు. ఇలా ఎన్ని చేసినా సినిమా కనీసం పెట్టుబడి కూడా రికవరీ చేయలేకపోయింది. సాధారణంగా ఏదైనా సినిమా సూపర్ హిట్ అయితేనే దానికి సీక్వెల్ ప్లాన్ చేస్తారు. కానీ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్రకటించడం వెనుక ఏక్తా కపూర్ ఒక బలమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? అనే సందేహాలు లేకపోలేదు.
ఈసారి కేవలం ఒక ప్రాంతీయ ఘటనకే పరిమితం కాకుండా 1998 నుండి 2026 మధ్య కాలంలో భారత్‌పై జరిగిన ప్రధాన ఉగ్రదాడులను, వాటికి దేశం ఇచ్చిన దీటైన జవాబును ప్రధానాంశంగా తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీక్వెల్ ను మాత్రం ధీరజ్ తెరకెక్కించలేదు. `షేర్షా` వంటి బ్లాక్‌బస్టర్ దేశభక్తి చిత్రాన్ని అందించిన విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించడం విశేషం. విష్ణు వర్ధన్ మేకింగ్ స్టైల్ , వాస్తవికతను తెరపైకి తెచ్చే విధానం సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఒక రిపోర్ట్ దేశాన్ని కుదిపేసింది.. తదుపరి రిపోర్ట్ ప్రపంచాన్ని వణికిస్తుంది అంటూ ప్రచారం మొదలు పెట్టారు.
ఈ చిత్రంతో ప్రముఖ యాంకర్ సుధీర్ చౌదరి నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారని తెలిసింది. దశాబ్దాలుగా గ్రౌండ్ లెవల్‌లో ఉగ్రవాదంపై రిపోర్టింగ్ చేసిన తన అనుభవాన్ని ఈ సినిమా కోసం ఉపయోగిం చబోతున్నట్లు సమాచారం. `పీఓకే` నుండి `ఆపరేషన్ సింధూర్` వరకు భారత్ సాధించిన విజయాలను ` టెర్రర్ రిపోర్ట్లో` చూపించే అవకాశం ఉంది. `ది సాబర్మతీ రిపోర్ట్` థియేటర్లలో విఫలమైనా? ఓటీటీ , శాటిలైట్ హక్కుల ద్వారా నిర్మాతలు లాభాల్లోనే ఉన్నారు. ఆ ధీమాతోనే భారీ కాన్వాస్‌పై దేశవ్యాప్త అప్పీల్ ఉన్న కథను ఏక్తా కపూర్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా నిజాలను నిర్భయంగా చెప్పాలనే పట్టుదలతో ఏక్తా కపూర్ చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి.
