మూవీ రివ్యూ - ఈషా
By: Tupaki Desk | 25 Dec 2025 2:43 PM IST‘ఈషా’ మూవీ రివ్యూ
నటీనటులు: త్రిగుణ్- హెబ్బా పటేల్- అఖిల్ రాజ్- సిరి హనుమంతు- పృథ్వీరాజ్- దయానంద్ రెడ్డి తదితరులు
సంగీతం: ఆర్ఆర్ ధ్రువన్
ఛాయాగ్రహణం: సంతోష్ సనమొని
నిర్మాత: పోతుల హేమ వెంకటేశ్వరరావు
దర్శకత్వం: శ్రీనివాస్ మన్నె
ఈ ఏడాది లిటిల్ హార్ట్స్.. రాజు వెడ్స్ రాంబాయి లాంటి సినిమాలతో ఘనవిజయాలు అందుకున్న జోడీ బన్నీ వాసు-వంశీ నందిపాటి. ఇప్పుడీ ద్వయం ‘ఈషా’ అనే మరో చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనివాస్ మన్నె అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
కళ్యాణ్ (త్రిగుణ్).. వినయ్ (అఖిల్ రాజ్).. నయన (హెబ్బా పటేల్).. అపర్ణ (సిరి హనుమంతు).. చిన్నప్పట్నుంచి స్నేహితులు. వీరిలో వినయ్-సిరి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కళ్యాణ్ సైతం నయనను ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమను చెప్పడు. ఈ నలుగురూ కలిసి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. దొంగ బాబాలను పట్టుకుని చట్టం ముందు నిలబెడుతుంటారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు న్యూరో సర్జన్.. తర్వాత స్వామీజీ అవతారం ఎత్తిన ఆది దేవ్ (పృథ్వీరాజ్) మీద ఈ నలుగురూ దృష్టిపెడతారు. తన బండారం బయటపెడదామని ఏపీ-ఒరిస్సా సరిహద్దుల్లోని తన ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ ఈ నలుగురికీ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.. ఆదిదేవ్ గుట్టు బయటపెట్టాలన్న వీరి లక్ష్యం నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
‘ఈషా’లో హార్రర్ ఎలిమెంట్స్ గురించి రిలీజ్ ముంగిట ఒక రేంజిలో హైప్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా థియేటర్లలోకి వెళ్లే ముందు తాయిత్తులు కట్టుకుని వెళ్తే మంచిదన్నారు. సినిమా వాయిదా పడితే.. భయపడడానికి ఇంకా టైం ఉందంటూ పోస్టర్లు రిలీజ్ చేశారు. బాగా భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఈ సినిమాకు తీసుకెళ్తే ఇంకో రకంగా వర్కవుట్ అవుతుందన్నారు. ఇలాంటి హార్రర్ సినిమా తెలుగులో చాలా రేర్ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసింది చిత్ర బృందం. కానీ ఎన్నో అంచనాలతో థియేటర్లలోకి అడుగుపెట్టాక నిరాశ తప్పదు. విజువల్స్.. బీజీఎంతో హార్రర్ ఫీల్ తీసుకొచ్చి ఇలా భయపెట్టడానికి ప్రయత్నించిన సినిమాలకు తెలుగులో లెక్కే లేదు. కానీ సన్నివేశ బలంతో ప్రేక్షకులను భయపెడితేనే హార్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల మీద బలమైన ముద్ర వేస్తాయి. ఆ విషయంలో ‘ఈషా’ అంచనాలను అందుకోలేకపోయింది. హాలీవుడ్ మూవీ ‘అదర్స్’ తరహా చిత్రాల నుంచి స్ఫూర్తి పొందినట్లుగా కనిపించే కథాంశం ఆసక్తికరంగానే అనిపించినా.. దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. కథలో ట్విస్ట్.. ముగింపు సన్నివేశాలు బాగున్నా.. ఆ మలుపు రావడానికి ముందు వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో ‘ఈషా’ విఫలమైంది.
ప్రేక్షకులను ఎంతగా ఉత్కంఠకు గురి చేస్తే.. ఎంతగా భయపెడితే అంత మంచి ఫలితం వస్తుంది హార్రర్ సినిమాలకు. కెమెరా యాంగిల్స్.. బీజీఎం ద్వారా ఏమీ లేని చోట కూడా కొంచెం భయం కలిగేలా చేయొచ్చు. కానీ పూర్తిగా వాటి మీదే ఆధారపడితే కష్టం. హడావుడి తప్పితే హారర్ ఫ్యాక్టర్ ను సరిగా బిల్డ్ చేయలేకపోయారు. హారర్ సినిమాలంటే లాజిక్ ను పట్టించుకోలేం కానీ.. ఇందులో కొన్ని సీన్లు మరీ సిల్లీగా అనిపిస్తాయి. కొన్నిచోట్ల ఎమోషన్ పండించడానికి చెందిన ప్రయత్నం కూడా ఫలించలేదు. దయ్యాల అంతు తేలుస్తాం అంటూ ఒక బ్యాచ్.. ఒక పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్లడం.. అక్కడ వారిని దయ్యాలు వెంటాడుతున్న భావన కలిగించడం.. తద్వారా భయం-ఉత్కంఠ రేకెత్తించడం.. చాలా వరకు హార్రర్ సినిమాల్లో జరిగేది ఇదే. ‘ఈషా’ కూడా అదే లైన్లో నడుస్తుంది. ఐతే మధ్యలో పుణ్యవతి అనే పాత్ర ప్రవేశంతో దీనికి కొంచెం డిఫరెంట్ కలర్ ఇవ్వాలని చూశారు. అది మొదట్లో ఆసక్తికరంగా అనిపించినా.. తర్వాత తేలిపోయింది. హాంటెడ్ హౌస్ గురించి ముందు ఇచ్చే బిల్డప్ చూసి ఎంతో ఊహించుకుంటాం కానీ.. అక్కడ జరిగే పరిణామాలు.. హార్రర్ ఎలిమెంట్స్ ఏం అంత ఉత్కంఠ రేకెత్తించేలా ఉండవు.
ముందే అన్నట్లు బీజీఎం.. విజువల్స్ ద్వారా ఎఫెక్ట్ తేవడానికి ప్రయత్నించారే తప్ప.. కథనం ఆసక్తికరంగా సాగకపోవడం.. సన్నివేశ బలం లేకపోవడం వల్ల ‘ఈషా’ అనుకున్నంత మేర భయపెట్టలేకపోయింది. మరీ నెమ్మదిగా సాగే సన్నివేశాలు.. రిపీటెడ్ గా అనిపించే షాట్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. కొన్ని చోట్ల ఓటీటీల్లో మాదిరి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే ఆప్షన్ ఉంటే బాగుండనే ఫీలింగ్ కలుగుతుంది. అంతగా ఒక్కో సీన్ ఎంతకీ తెగనట్లు సా...గుతుంది. ఐతే ఈ కథ తాలూకు మర్మం ఏంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో ప్రేక్షకులు చివరిదాకా ఎదురు చూస్తారు. క్లైమాక్స్ ట్విస్టు బాగుంది. దాని మీద చివర్లో ఎమోషనల్ గా నడిపిన డ్రామా కూడా ఓకే. సినిమాలో వివిధ దశల్లో తలెత్తే సందేహాలకు చివర్లో సమాధానం చెప్పగలిగారు. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ మీదే మరీ ఎక్కువ భారం మోపేయడం సినిమాకు మైనసే అయింది. హాంటెడ్ హౌస్ లోకి వెళ్లే బ్యాచ్ అనగానే అక్కడో దయ్యం.. దానికో ఫ్లాష్ బ్యాక్.. ఈ లైన్లో సాగే హార్రర్ థ్రిల్లర్ సినిమా అయితే ఇది కాదు. ప్లాట్ పాయింట్ విషయంలో డిఫరెంట్ గానే ట్రై చేశారు. కానీ చివరి సన్నివేశాలు మినహా అంతా సాధారణంగా సాగిపోవడం వల్ల ‘ఈషా’ అనుకున్న ఇంపాక్ట్ వేయలేకపోయింది.
నటీనటులు:
‘ఈషా’లో లీడ్ ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ ఓకే అనిపిస్తుంది. కళ్యాణ్ పాత్రలో త్రిగుణ్ హావభావాలు ఆకట్టుకుంటాయి. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్ ఓకే అనిపించాడు. హెబ్బా పటేల్ పర్వాలేదు. ఆమె కంటే సిరి హనుమంత నటన మెరుగ్గా అనిపిస్తుంది. ఆది దేవ్ అనే కీలక పాత్రలో సీనియర్ నటుడు పృథ్వీరాజ్ మెప్పించాడు. ఆయన గెటప్ కూడా బాగుంది. ‘బలగం’లో హీరో బాబాయిగా కనిపించిన నటుడు ప్రేక్షకులను బాగానే భయపెట్టాడు. మిగతా ఆర్టిస్టులంతా ఓకే.
సాంకేతిక వర్గం:
హార్రర్ సినిమాలకు విజువల్స్.. బీజీఎంయే ప్రాణం. ఈ రెండు విభాగాలకూ ఇందులో మంచి మార్కులే పడతాయి. ధ్రువన్ బీజీఎం కొన్ని చోట్ల లౌడ్ అనిపించినా.. చాలా వరకు హార్రర్ ఫీల్ తీసుకురావడంలో విజయవంతమైంది. సంతోష్ సనమొని విజువల్స్ కూడా బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీనివాస్ మన్నె ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. తన టేకింగ్ ప్రభావవంతంగా లేదు. షార్ప్ గా తీయాల్సిన సన్నివేశాలను.. మరీ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అతను సినిమాలో జెన్యూన్ హార్రర్ ఫీల్ తీసుకురావడంలో తడబడ్డాడు.
చివరగా: ఈషా.. పని చేయని హారర్ మంత్రం
రేటింగ్ - 2.25/5
