గత్తరలేపే గ్యాంగ్ సీక్వెల్‌తో వచ్చేస్తోంది!
ఈ నగరానికి ఏమైంది `గ్యాంగ్ మళ్లీ గ్యాదర్ అయింది` అంటూ మేకర్స్ ఓ ప్రమోషనల్ పోస్టర్‌ని విడుదల చేస్తూ సీక్వెల్ అప్ డేట్ ఇచ్చారు.
By: Tupaki Desk | 27 Jun 2025 12:33 PMయూత్‌ఫుల్ న్యూఏజ్ సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నాడు తరుణ్ భాస్కర్. `పెళ్లి చూపులు` వంటి బ్లాక్ బస్టర్ తరువాత తరుణ్ భాస్కర్ చేసిన న్యూ ఏజ్ స్టోరీ `ఈ నగరానికి ఏమైంది?`. ఈ మూవీతో విశ్వక్‌సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 2018లో సురేష్ ప్రొడక్షన్స్ వారు కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే ఏకంగా బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
నటుడిగా విశ్వక్‌సేన్‌కు మంచి ప్లాట్ ఫామ్‌ని క్రియేట్ చేసింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో మీమర్స్‌కి కావాల్సినంత స్టఫ్‌ని అందించి నెట్టింట నిత్యం వైరల్ అవుతూనే ఉంది. ఈ కామెడీ డ్రామాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రకటించినా ఆ తరువాత ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో సీక్వెల్ ఇప్పట్లో ఉండదని అంతా భావించారు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ తరుణ్ భాస్కర్ సీక్వెల్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
సినిమా విడుదలైన ఇన్నేళ్ల తరువాత సీక్వెల్ చేస్తున్నామంటూ టీమ్ తాజాగా ప్రకటన చేసింది. ఈ నగరానికి ఏమైంది `గ్యాంగ్ మళ్లీ గ్యాదర్ అయింది` అంటూ మేకర్స్ ఓ ప్రమోషనల్ పోస్టర్‌ని విడుదల చేస్తూ సీక్వెల్ అప్ డేట్ ఇచ్చారు. `టీమ్ కన్యారాశి వస్తోంది` అంటూ ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ని ఈ నెల 28, 29న ఇవ్వబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. `1 బస్, త్రీ పబ్స్` అంటూ సినిమా కథ ఎలా ఉండనుందన్న హింట్ కూడా ఇచ్చేశారు.
`కీడా కోలా` తరువాత మరో సినిమా ప్రకటించని తరుణ్ భాస్కర్ డైరెక్టర్‌గా మళ్లీ `ఈ నగరానికి ఏమైంది` మూవీనే నమ్ముకోవడంతో ఆయన అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడాదిన్నర తరువాత మళ్లీ మెగాఫోన్ పడుతున్న తరుణ్ భాస్కర్ ఈ సీక్వెల్‌తో మళ్లీ ట్రాక్‌లోకి రావాలనుకుంటున్నాడట. తనదైన మార్కు టేకింగ్‌తో సరికొత్త పంథాలో సీక్వెల్‌ని తరుణ్ భాస్కర్ తెరపైకి తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాడట. ఆ ప్లాన్ ఏంటీ? ..ఇంతకీ సీక్వెల్ ఎలా ఉండబోతోంది అన్నది తెలియాలంటే శని, ఆదివారల్లో మేకర్స్ రిలీజ్ చేయనున్న అప్‌డేట్స్ కోసం వేచి చూడాల్సిందే.