'ఈ నగరానికి ఏమైంది'.. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటీ?
ఈ నగరానికి ఏమైంది.. ఏడేళ్ల క్రితం రిలీజ్ అయిన ఆ సినిమా ఎలాంటి స్టేటస్ అందుకుందో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 10 Nov 2025 8:00 AM ISTఈ నగరానికి ఏమైంది.. ఏడేళ్ల క్రితం రిలీజ్ అయిన ఆ సినిమా ఎలాంటి స్టేటస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ.. కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. తెలుగు యూత్ ను ఓ రేంజ్ లో అలరించింది. స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న ఆ మూవీ.. ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటోంది.
థియేటర్స్ లో కాస్త నిరాశపరిచినా.. ఓటీటీలో మాత్రం అదరగొట్టింది. ఆ తర్వాత రీ రిలీజ్ అయ్యి కూడా భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ నగరానికి ఏమైంది మూవీకి సీక్వెల్ ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో రెండో పార్ట్ ఉంటుందని చెప్పిన మేకర్స్.. కొద్ది రోజుల క్రితం స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. టైటిల్ తోపాటు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఈ నగరానికి ఏమైంది రిపీట్ అనే పేరుతో సినిమాను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్ ను అదిరిపోయేలా దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కరే సీక్వెల్ ను కూడా తెరకెక్కించనున్నారు. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డి.. సీక్వెల్ కు కంటిన్యూ అవ్వనున్నారు.
సినిమాను ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.. నిర్మాణ భాగస్వామిగా ఉన్నట్లు పోస్టర్ లో వెల్లడించారు. కానీ ఇప్పుడు సురేష్ బాబు.. ఈ నగరానికి ఏమైంది రిపీట్ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
అందులో నిజమెంతో తెలియకపోయినా.. సినీ వర్గాల్లో మాత్రం టాక్ వినిపిస్తోంది. బడ్జెట్ పరిమితుల వల్ల సినిమా నుంచి ఆయన వైదొలగాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాను కాస్త గ్రాండ్ గా రూపొందించనున్నారని సమాచారం.
క్యాస్టింగ్ రెమ్యూనరేషన్లు అప్పటికీ.. ఇప్పటికీ భారీగా పెరగడంతో బడ్జెట్ పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో సురేష్ బాబు.. సినిమా నుంచి తప్పుకున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఆయన లేకుండానే.. సృజన్ తోపాటు సందీప్ నాగిరెడ్డి మూవీని నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పనులు ప్రారంభించారని, త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వినికిడి.
