ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ఆ ఏరియాలో థియేటర్స్ బంద్!
ఎన్ని ఓటీటీలు వచ్చినా.. అందులో ఎన్ని కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అయినా.. థియేటర్స్ కు ఉన్న క్రేజే వేరు.
By: Tupaki Desk | 21 April 2025 10:06 PM ISTఎన్ని ఓటీటీలు వచ్చినా.. అందులో ఎన్ని కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అయినా.. థియేటర్స్ కు ఉన్న క్రేజే వేరు. బడా స్క్రీన్ పై సినిమా చూస్తే వచ్చే ఆ ఫీలింగ్ ఎవరూ వర్ణించలేరు. అందుకే ఎలాంటి స్పెషల్ అకేషన్స్ లేదా సెలవులు లేదా ఫెస్టివల్స్ వచ్చినా.. మనలో దాదాపు అందరూ వెళ్లి థియేటర్ కు వెళ్లి మూవీలను చూడాలని కచ్చితంగా అనుకుంటారు.
అదే సమయంలో సినిమాలో కచ్చితంగా కంటెంట్ ఉండాలని కోరుకుంటున్నారు. కంటెంట్ బాగుంటే.. మిగతా విషయాలతో సంబంధం లేకుండా బ్రహ్మరథం పట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు కొంత కాలంగా కంటెంట్ రిచ్ ఉన్న సినిమాలు ఎక్కువగా రావడం లేదు. ప్రతి వారం అనేక సినిమాలు రిలీజ్ అవుతున్నా.. హిట్ అయ్యేవి కొన్ని మాత్రమే.
దీంతో టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ బిజినెస్ నష్టాల్లో పడిందనే చెప్పాలి. అందుకే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లతో జరిగిన చర్చలు ప్రతిష్టంభనలో ముగిసిన తర్వాత.. 2025 జూన్ 1 నుంచి తమ థియేటర్లను మూసివేయాలని తూర్పు గోదావరి ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేశారు.
కొంతకాలంగా థియేటర్స్ నుంచి మంచి ఆదాయం లేకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు పంపిణీదారులకు ప్రయోజనం చేకూర్చే ప్రస్తుత అద్దె వ్యవస్థకు బదులుగా పర్సంటేజ్ వ్యవస్థను అమలు చేయాలనే డిమాండ్ తీసుకొచ్చారు ఎగ్జిబిటర్లు. కానీ ఆ డిమాండ్ ను డిస్ట్రిబ్యూటర్ల సంఘం తోసిపుచ్చిందట. అందుకే సంతృప్తికరమైన పరిష్కారం లభించే వరకు తూర్పు గోదావరి ప్రాంతంలో థియేటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చిందని చెబుతున్నారు.
నిజానికి.. ఎగ్జిబిటర్లు డిమాండ్ చేసిన విధానం చిన్న, మధ్య బడ్జెట్ చిత్రాల సమయంలో అమలు చేస్తారు డిస్ట్రిబ్యూటర్లు. స్టార్లు నటించిన పెద్ద బడ్జెట్ చిత్రాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అద్దె ప్రాతిపదికన పంపిణీ చేస్తారు. కానీ పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకలో థియేటర్లు అద్దె వ్యవస్థపై కాకుండా శాతం నమూనాలోనే నడుస్తున్నాయి. ఇక్కడ కూడా ఎగ్జిబిటర్లు అదే విధానం అమలు చేయాలని కోరుకుంటున్నారు. అందుకు డిస్ట్రిబ్యూటర్లు ఓకే చెప్పకపోవడంతో థియేటర్లను మూసివేస్తున్నారు!
