చిక్కుల్లో 'డ్యూడ్'.. మైత్రీకి కొత్త తలనొప్పి!
మైత్రి మూవీ మేకర్స్ వారు టైటిల్ ప్రకటన చేసిన వెంటనే.. డ్యూడ్ టైటిల్ తమదంటూ యువ హీరో-డైరెక్టర్-ప్రొడ్యూసర్ తేజ్ తెరపైకి వచ్చాడు.
By: Tupaki Desk | 12 May 2025 3:54 PM ISTకొద్ది రోజుల క్రితం ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ రంగనాథ్ తో ఓ సినిమాని అనౌన్స్ చేసింది. తాజాగా ఈ సినిమాకు 'డ్యూడ్' అనే టైటిల్ ను కన్ఫార్మ్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. దీపావళి కానుకగా మూవీని రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కీర్తిశ్వరన్ డైరెక్టర్ కాగా.. 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా ఎంపిక అయింది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అంతా బాగానే జరుగుతున్న సమయంలో డ్యూడ్ టైటిల్ చిక్కుల్లో పడింది. దాంతో మైత్రీకి కొత్త తలనొప్పి మొదలైంది.
మైత్రి మూవీ మేకర్స్ వారు టైటిల్ ప్రకటన చేసిన వెంటనే.. డ్యూడ్ టైటిల్ తమదంటూ యువ హీరో-డైరెక్టర్-ప్రొడ్యూసర్ తేజ్ తెరపైకి వచ్చాడు. ఏడాది క్రితమే 'డ్యూడ్' టైటిల్ ను తమ సినిమా కోసం రిజిస్టర్ చేశామని.. అదే టైటిల్ తో సినిమాను ప్రచారం కూడా చేస్తున్నామని తేజ్ తెలిపాడు. ఇప్పుడు ఆ పేరునే మైత్రి వారు అనౌన్స్ చేయడం ఆశ్చర్యంగా, ఆవేదనగా ఉందన్నాడు తేజ్. అయితే మైత్రి వంటి బడా నిర్మాణ సంస్థతో ఘర్షన పడే ఉద్ధేశం తనకు ఏమాత్రం లేదని.. ఆల్రెడీ ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లానని, సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని తేజ్ పేర్కొన్నాడు.
తేజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రమే 'డ్యూడ్'. స్క్రీన్ ప్లే కూడా అతనే అందిస్తున్నాడు. ఫూట్ బాల్ నేపథ్య కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. రంగాయన రఘు ఇందులో ఫుట్ బాల్ కోచ్ గా కనిపించబోతున్నారు. రాఘవేంద్ర రాజ్ కుమార్, శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, అనర్ఘ్య, దీపాలి పాండే తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్స్ బయటకు వచ్చాయి. చిత్రీకరణ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది. లాస్ట్ షెడ్యూల్ ఒక్కటే బ్యాలెన్స్. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని డ్యూడ్ మేకర్స్ భావిస్తున్నారు.
అయితే ఇంతలోనే ప్రదీప్ రంగనాథ్ తో తీయబోయే చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ వారు డ్యూడ్ టైటిల్ కన్ఫార్మ్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దాంతో ఒరిజినల్ డ్యూడ్ వారు ఉలిక్కి పడ్డారు. టైటిల్ తమదంటూ ముందుకు వచ్చారు. మరి ఈ ఇష్యూపై మైత్రీ వారు ఎలా రియాక్ట్ అవుతారో.. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో.. చూడాలి.
