బజ్ లేని డబ్బింగ్ సినిమాలు.. కానీ క్లిక్ అయితే..
నిజానికి తెలుగులో కూడా సంక్రాంతికే ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు.
By: Tupaki Desk | 25 Jan 2024 2:09 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న తెలుగులో విడుదల కాబోతోంది. సంక్రాంతి కానుకగా తమిళనాట రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. కానీ సినిమాలో ధనుష్ యాక్టింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. పండగ సీజన్ కావడంతో అక్కడ సినిమాకి కలెక్షన్స్ బాగానే వచ్చాయి. నిజానికి తెలుగులో కూడా సంక్రాంతికే ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు.
కానీ తెలుగు సినిమాల మధ్య భారీ పోటీ ఉండడంతో మేకర్స్ వెనకడుగు వేశారు. అందుకే ఈ రిపబ్లిక్ డే వీకెండ్ కి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. కోలీవుడ్ లో జనవరి 12 న రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 65 నుంచి 70 కోట్ల మధ్యలో గ్రాస్ రాబట్టింది. ఇక ధనుష్ కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటంతో ఇక్కడ కూడా కెప్టెన్ మిల్లర్ డీసెంట్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది.
తమిళంలో రిలీజ్ అయిన సమయంలో సినిమా నిడివి విషయంలో కంప్లైంట్స్ రావడంతో తెలుగు ఆడియన్స్ కి ఆ ఇబ్బంది లేకుండా కొంత రన్ టైంని ట్రిమ్ చేసి విడుదల చేస్తున్నారు. తమిళంలో 'కెప్టెన్ మిల్లర్' 160 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అయింది. కానీ తెలుగులో 149 నిమిషాల నిడివితోనే రిలీజ్ చేస్తున్నారు. సినిమాపై ఉన్న కాన్ఫిడెంట్ తో మూవీ టీం రిలీజ్ కి ఒక్కరోజు ముందే హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.
కాకపోతే సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో తెలుగులో అనుకున్నంత బజ్ లేదు. కానీ సినిమా క్లిక్ అయితే పోటీగా తెలుగు సినిమాలేవి లేవు కాబట్టి వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాతో పాటు మరో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన 'అయలాన్' తెలుగులో అదే రోజు(జనవరి 26) విడుదల కాబోతుంది. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతికి ధనుష్, శివ కార్తికేయన్ ఇద్దరూ పోటీ పడ్డారు.
ఈ రెండు సినిమాలకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడూ తెలుగులోనూ పోటీ పడుతున్నారు. డాక్టర్, డాన్, మహావీరుడు వంటి సినిమాలతో శివ కార్తికేయన్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అయలాన్ కి తెలుగు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఈ సినిమా కూడా డీసెంట్ కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.