Begin typing your search above and press return to search.

డబ్బింగ్ సినిమాలు.. ఇక్కడ ఎవరినీ నిందించలేం!

రీమేక్ సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో.. డబ్బింగ్ రూట్ లో సొమ్ము చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   5 April 2024 2:54 AM GMT
డబ్బింగ్ సినిమాలు.. ఇక్కడ ఎవరినీ నిందించలేం!
X

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. మన నిర్మాతలు ఇతర భాషల్లో హిట్టయిన సినిమాల రైట్స్ కొనుగోలు చేసి, తెలుగులోకి అనువదించి విడుదల చేస్తున్నారు. రీమేక్ సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో.. డబ్బింగ్ రూట్ లో సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు చిన్న నిర్మాతలు తక్కువ రేటుకి డబ్బింగ్ హక్కులు తీసుకొని, లిమిటెడ్ థియేటర్లలో తెలుగు సినిమాలు లేని టైంలో రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థలే అనువాద చిత్రాలను అధిక స్క్రీన్లలో, భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అది కూడా ఒరిజినల్ తెలుగు సినిమాలకు పోటీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ ఇటీవల 'ప్రేమలు' వంటి మలయాళ డబ్బింగ్ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. మహా శివరాత్రికి విడుదల చేసిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టి.. కొన్ని ఏరియాల్లో 'గామి', 'భీమా' చిత్రాలకు డ్యామేజ్ చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ 'భ్రమయుగం' చిత్రాన్ని తెలుగులోకి అనువదించింది. ఇది 'మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా', 'సిద్దార్థ్ రాయ్', 'సుందరం మాస్టర్' వంటి చిత్రాలకు పోటీగా థియేటర్లలోకి తీసుకొచ్చింది. అంతకముందు 'ఓ బేబీ' మేకర్స్ నుంచి 'ట్రూ లవర్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి బ్యాక్ టూ బ్యాక్ డబ్బింగ్ సినిమాలు రాబోతున్నాయి. ఇటీవల 'ఆడు జీవితం - ది గోట్ లైఫ్' వంటి మలయాళ మూవీని 'టిల్లు స్క్వేర్' కంటే ఒక రోజు ముందు తెలుగులో విడుదల చేశారు. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్రాన్ని ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్' వచ్చిన ఒకరోజు తర్వాత ఏప్రిల్ 6వ తారీఖున తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి ఏప్రిల్ 5న స్పెషల్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు. ఇదే క్రమంలో మైత్రీ నిర్మాతల నుంచి ఏప్రిల్ 11న 'లవ్ గురు' అనే తమిళ డబ్బింగ్ చిత్రం కూడా రాబోతోంది. అదే రోజున తెలుగులో 'గీతాంజలి మళ్లీ వచ్చింది' విడుదల కానుంది.

నిజానికి ఇతర భాషల్లో హిట్టయిన సినిమాలను, తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేయటం అనేది కొత్త ట్రెండేమీ కాదు. టాలీవుడ్ లో ఎప్పటి నుంచో అనువాద చిత్రాలను విడుదల చేస్తున్నారు.. వాటిని మనవాళ్ళు ఆదరిస్తూనే ఉన్నారు. కరోనా పాండమిక్ తర్వాత తెలుగులో ఎన్ని డబ్బింగ్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయో మనం చూశాం. గీతా ఆర్ట్స్ ఫిల్మ్స్ నుంచి 'కాంతారా' వంటి కన్నడ అనువాద చిత్రం వస్తే, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'సర్దార్' సినిమా వచ్చింది. 'విక్రమ్' సినిమాని హీరో నితిన్ తెలుగులో రిలీజ్ చేశారు.

దిల్ రాజు బ్యానర్ లో 'పొన్నియన్ సెల్వన్' 1 & 2, 'బీస్ట్', 'వారసుడు', 'తెగింపు', 'లవ్ టుడే' లాంటి ఎన్నో తమిళ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'చార్లీ 777' అనే కన్నడ డబ్బింగ్ మూవీ విడుదలైంది. హిందీ 'బ్రహ్మాస్త్రం' చిత్రాన్ని రాజమౌళి తెలుగు ప్రేక్షకులకి అందించారు. 'లాల్ సింగ్ చడ్డా' మూవీ అనువాదానికి మెగాస్టార్ చిరంజీవి సమర్పకులుగా వ్యవహరించారు. సితార ఎంటర్టైన్మెంట్ వారు 'లియో' చిత్రాన్ని విడుదల చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే గత రెండు మూడేళ్లలో ఎన్నో అనువాద చిత్రాలు తెలుగులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇంకా వస్తూనే ఉంటాయి.

వాస్తవంగా మాట్లాడుకుంటే అప్పటి రజినీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ దగ్గర నుంచి.. ఇప్పటి విక్రమ్, సూర్య, శింబు, విజయ్, ధనుష్, కార్తీ వరకూ.. అనేక మంది పరభాషా హీరోలు తెలుగులో క్రేజ్ ఏర్పరచుకుంది డబ్బింగ్ చిత్రాలతోనే. మమ్మీ, దెయ్యాల కోట, జురాసిక్ పార్క్ లాంటి హాలీవుడ్ సినిమాలు.. ప్రేమ పావురాలు, క్రిష్ లాంటి హిందీ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది డబ్బింగ్ ద్వారానే అనే విషయం మనం ఎప్పటికీ మర్చిపోలేం.

మనం తీసిన బాహుబలి, పుష్ప, RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు.. పక్క ఇండస్ట్రీలలో అనువాద చిత్రాలే అవుతాయి. మన హీరోలకు ఇతర భాషల్లో అంతో ఇంతో మార్కెట్ ఉందంటే అది డబ్బింగ్ సినిమాల వల్లనే కదా. కాబట్టి ఇప్పుడు కొత్తగా డబ్బింగ్ చిత్రాలని నిందించడం సరైంది కాదు. కాకపోతే వాటి వల్ల ఒరిజినల్ తెలుగు సినిమాల మార్కెట్ పై దెబ్బ పడకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరముంది. పోటీ లేని టైం చూసుకుని అనువాద చిత్రాలను రిలీజ్ చేస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.