పెరుగుతున్న సౌత్ డామినేషన్‌కి మరో ప్రూఫ్!
ఇటీవల టాలీవుడ్ తో పాటు సౌత్ డామినేషన్ ఉత్తరాది పరిశ్రమపై స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి చాలా ప్రూఫ్ లు ఉన్నాయి. పెరుగుతున్న సౌత్ డామినేషన్‌కి ఇప్పుడు మరో ప్రూఫ్ దొరికింది.
By: Tupaki Desk | 18 April 2025 9:50 AM ISTతెలుగు సినిమాకి అవార్డు అంటే ఏమిటో తెలీని రోజుల్లోనే జాతీయ అవార్డులు కొల్లగొట్టిన పరిశ్రమ మలయాళ పరిశ్రమ. ఉద్ధండులైన దర్శక నిర్మాతలు మాలీవుడ్ కీర్తి ప్రతిష్ఠల్ని చాలా ఎత్తుకు తీసుకెళ్లారు. రొటీన్ కమర్షియల్ సినిమాలు తీసే టాలీవుడ్ కి భిన్నంగా మాలీవుడ్ లో అవార్డుల సినిమాలు తీసారు. అయితే ఇప్పుడు సీన్ రివర్సులో ఉంది. టాలీవుడ్ తో పోలిస్తే ఆర్జన పరంగా దేవుని దేశంలోని మాలీవుడ్ చాలా వెనకబడి ఉంది. టాలీవుడ్ లో దిగ్గజ దర్శకులు పాన్ ఇండియన్ సినిమాకి బాటలు వేయడంతో దేశంలోని అన్ని పరిశ్రమలు ఇప్పుడు తలొంచుతున్నాయి.
ఇటీవల టాలీవుడ్ తో పాటు సౌత్ డామినేషన్ ఉత్తరాది పరిశ్రమపై స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి చాలా ప్రూఫ్ లు ఉన్నాయి. పెరుగుతున్న సౌత్ డామినేషన్‌కి ఇప్పుడు మరో ప్రూఫ్ దొరికింది. ఇంతకాలం మాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ - దృశ్యంలో మోహన్ లాల్ కేవలం మాతృభాషలో మాత్రమే నటించారు. ఇవే సినిమాలను హిందీలో తిప్పి తీసిన అజయ్ దేవగన్ .. మాతృక హీరో లాల్ కంటే ఎక్కువ పేరు కొట్టేసాడు. బాగా లాభాల్ని ఆర్జించాడు.
ఇప్పుడు దృశ్యం 3 తెరకెక్కుతోంది. ఎప్పటిలానే మోహన్ లాల్ ఇందులో ప్రధాన పాత్రధారి. అయితే ఈ సినిమాని మునుపటిలా రీమేక్ తో పని లేకుండా స్ట్రెయిట్ గా హిందీలోను ద్విభాషా చిత్రంగా విడుదల చేయాలని లాల్ ప్లాన్ చేస్తున్నారు. దృశ్యం 3 ని హిందీ, మలయాళంలో ప్లాన్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. మలయాళంలో 100 కోట్లు మినిమం, హిందీలో 200 కోట్లు మినిమం వసూళ్లు లాగేయాలని లాల్ బిగ్ ప్లాన్!! ఇటీవలే అతడు ప్రధాన పాత్ర పోషించిన ఎల్ 2-ఎంపూరన్ గ్రాండ్ సక్సెస్ సాధించింది. పాన్ ఇండియాలో విమర్శకుల ప్రశంసలతో పాటు, 300కోట్ల వసూళ్లు సాధించింది ఈ చిత్రం. మోహన్ లాల్ నటనకు ప్రశంసలు కురిసాయి.
నిజానికి ఎంపూరన్ మోహన్ లాల్ ఇమేజ్ ని పాన్ ఇండియాలో మరింత బలోపేతం చేసింది. ముఖ్యంగా ఉత్తరాదినా ఎల్ 2- ఎంపురాన్ కి చాలా మంచి పేరొచ్చింది. అందుకే ఇప్పుడు తన బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ దృశ్యం నుంచి మూడో సినిమా హక్కుల్ని దేవగన్ కి ఇచ్చేందుకు మోహన్ లాల్ ఆసక్తిగా లేడని సమాచారం. కానీ దీనికి ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
2013లో విడుదలైన మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం దృశ్యం 2015లో హిందీలో రీమేక్ అయింది. అజయ్ దేవగన్ లీడ్ పాత్ర పోషించారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించిన దృశ్యం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. 2021లో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 విడుదల కాగా, హిందీ రీమేక్ కూడా పెద్ద విజయం అందుకుంది. కానీ మూడో భాగంలో ఛాన్స్ దేవగన్ కి ఇవ్వకూడదని లాల్ బృందం భావిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. లాల్ కి మునుముందు ఈ ఐడెంటిటీ పెరగనుంది.
